పల్లెకు వ్యతిరేకంగా నినదిస్తున్న అసమ్మతి నేతలు
ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. టిక్కెట్లు ఖరారు చేసేందుకు ‘అనంత’ టీడీపీ నేతలను అమరావతికి పిలిపించిన ఆ పార్టీ అధినేతచంద్రబాబు అభ్యర్థుల సంగతి ఎటూ తేల్చలేకపోయారు. ఆరు నియోజకవర్గాలకే అభ్యర్థులను ఖరారు చేసి, 8 స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. వారం రోజులోపు అభ్యర్థులను ప్రకటిస్తానని, ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అంతా కలిసి పనిచేయాలని సూచించారు. చంద్ర బాబు ప్రకటనతో ఆయన బావమరిది బాలకృష్ణ మినహా తక్కిన 7 నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ల్లో గుబులు మొదలైంది. అర్ధరాత్రి వరకూ సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడం, కొన్నిటికి మాత్రమే హామీ ఇచ్చి, తక్కిన స్థానాలను పెండింగ్‌లో ఉంచడంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆపార్టీ అధినేత చంద్రబాబు జిల్లా నేతలకు కబురు పంపారు. దీంతో జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన నేతలు బుధవారం ఉదయం 9 గంటలకే అమరావతిలో సీఎం నివాసం ఉంటున్న ఉండవల్లికి చేరుకున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మంత్రి జవహర్ సమక్షంలో ప్రత్యేకంగా టెంట్లు వేసి నియోజకవర్గాల వారీగా అభిప్రాయసేకరణ జరిపారు.
ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఖరారు!
జిల్లాలోని 14 స్థానాల్లో హిందూపురం మినహా తక్కిన 13 స్థానాల్లో 7 స్థానాలకు మాత్రమే అభిప్రాయ సేకరణ జరిగింది. దీంతో అభిప్రాయసేకరణ జరగని 6 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్లే అని మంత్రులు సూచన ప్రాయంగా నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. వీటిలో తాడిపత్రి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి, పెనుకొండ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, రాప్తాడు నుంచి పరిటాల సునీత టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులకు బరిలోకి దిగనున్నట్లు తేల్చారు. వీరితోపాటు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారిక ప్రకటన చేయకపోయినా వీరే అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ఆయా నేతలతో పాటు కార్యకర్తలకు సమావేశంలో చెప్పినట్లు తెలిసింది.
పెండింగ్‌లో 8 స్థానాలు
ప్రకటించిన 6 స్థానాలు మినహా అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిలో హిందూపురం మినహా తక్కిన 7 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. మొదట కళ్యాణదుర్గం సమీక్ష జరిగింది. ఇందులో అభిప్రాయసేకరణ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి వ్యతిరేకవర్గానికి చెందిన రామ్మోహన్‌చౌదరి, మల్లిఖార్జున, నారాయణ, రమేశ్‌తో పాటు పలువురు తీవ్రస్థాయిలో వ్యతిరేకంచారు. చౌదరి అయితే ఓడిపోతారని, అతన్ని మార్చాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కూడా వ్యతిరేకవర్గంపై మాటల దాడికి దిగారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో అక్కడంతా గందరగోళంగా మారింది. దీంతో ఎవరి అభిప్రాయాన్ని వారు కాగితాలపై రాసి ఇవ్వాలని కోరారు.
ప్రభాకర్‌చౌదరికి టిక్కెట్ ఇవ్వొద్దు
కళ్యాణదుర్గం టికెట్ విషయంలో జరిగిన రభసను దృష్టిలో ఉంచుకుని అనంతపురం నియోజకవర్గంపై అభిప్రాయ సేకరణ ప్రారంభం కాగానే... అభ్యర్థిత్వంపై ఎవరు ఏమీ మాట్లాడొద్దని, అభిప్రాయాలు కాగితాల్లో రాసివ్వాలని మంత్రి దేవినేని చెప్పారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులకు 63 మంది అక్కడకు వచ్చేందుకు అనుమతిచ్చారు. జకీవుల్లా, జయరాం వర్గీయులను 20 మందినే అనుమతించారు. దీంతో అభిప్రాయాన్ని చెప్పకుండా చౌదరి వ్యతిరేకవర్గం సభను బాయ్‌కాట్ చేసి బయటకు వచ్చేశారు. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని, నియోజకవర్గంలో పార్టీ బలహీనపడటంతో పాటు కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నేతలను కూడా ‘పల్లె’ నిర్లక్ష్యం చేశారని చంద్రమోహన్ అనే కార్యకర్త మాట్లాడారు. దీంతో పల్లె రఘునాథరెడ్డి గన్‌మన్ చంద్రపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కార్యకర్తలంతా ‘పల్లె’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పుట్టపర్తి అభిప్రాయ సేకరణలోనూ గందరగోళం జరిగింది. తర్వాత శింగనమల, మడకశిర, కదిరి, గుంతకల్లు నియోజకవర్గాలపై అభిప్రాయసేకరణ చేశారు. వీటితో పాటు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి సంగతి కూడా తేల్చలేదు. ఇక హిందూపురం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశానికి రాలేదు. హిందూపురం నుంచి బాలకృష్ణే బరిలో ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు.
పదిరోజుల్లో అభ్యర్థులందరినీ ప్రకటిస్తానన్న చంద్రబాబు
అభిప్రాయ సేకరణ తర్వాత 14 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసగించారు. వారం, పదిరోజుల్లోపు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ప్రకటిస్తానని చెప్పారు. ఎవరికి టిక్కెట్ వచ్చినా, రాకపోయినా అంతా పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. విభేదాలను పక్కనపెట్టాలని, వాటి సంగతి తాను చూసుకుంటానన్నారు. ఏదిఏమైనా బు«ధవారం సమావేశంతో గుంతకల్లు, శింగనమల స్థానాలకు కచ్చితంగా అభ్యర్థులు మారతారని స్పష్టమైంది. అనంతపురం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను మార్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా
మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా బుధవారం టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ గైర్హాజరయ్యారు. గుప్తా చేరికతో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు టిక్కెట్ దక్కదనే ప్రచారం సాగుతోంది. గుప్తాకు గుంతకల్లు టిక్కెట్ దాదాపు ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తనను కాదని గుప్తాకు టిక్కెట్ ఇస్తే పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని జితేంద్ర పార్టీ నేతలతో తే ల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment