కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విబేధాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఈసారి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ‘ఉమా’ వైపు కొందరు.. ‘ఉన్నం’ వైపు మరికొందరు చేరడంతో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుకుంది. ఇరువర్గాల వాగ్వాదాలతో స్థానిక టీడీపీ కార్యాలయం మంగళవారం ప్రతిధ్వనించింది.
వివరాల్లోకి వెళితే... మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, తన వర్గీయులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. కాసేపు ఆగి, తిరిగి వెళ్లిపోతూ అప్పటికే అక్కడ కూర్చొని ఉన్న ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వరనాయుడు వర్గానికి చెందిన కొందరిని ఉద్దేశించి ఉన్నం వర్గీయుడైన కొండాపురం ముత్యాలరెడ్డి దుర్భాషలాడారు. ‘ఒక్కొక్క నా కొ... వచ్చి ఇష్టం వచ్చినట్లు కూర్చొన్నారు. పెద్దాయన (ఉన్నం హనుమంతరాయ చౌదరి) వచ్చినారన్న కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఎక్కడి నా కొ...లో అంతా ఇక్కడ చేరి మర్యాద లేకుండా కూర్చొంటున్నారు’ అంటూ తీవ్రంగా దూషిస్తూ.. అక్కడున్న కుర్చీలను ఎత్తి విసిరేశారు.
దీంతో ఉమా వర్గీయులైన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, నాయకులు కొల్లప్ప, సత్తి, డిష్ మురళి తదితరులు ఉన్నం వర్గీయులపై వాదనకు దిగారు. ఆ సమయంలో గందరగోళం చోటు చేసుకుంది. అరుపులతో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయం లోపల ఏదో జరుగుతుందంటూ బయట జనం గుమికూడారు. దీంతో కొందరు సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని రెండు వర్గాల వారిని సర్దిచెప్పి పంపించి అప్పటికప్పుడు పరిస్థితిని కాస్త చక్కదిద్దారు. కానీ రెండు వర్గాల నాయకులు మాత్రం ఏదో రోజు తేల్చుకుందామంటూ అక్కడి నుంచి వెళ్లపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment