సమైక్య సునామీ
Published Mon, Sep 30 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
కందనవోలు గడ్డ లక్ష్య సాధకులతో పోటెత్తింది. ఉద్యమాల ఖిల్లా.. తెలుగుబిడ్డలతో కదంతొక్కింది. అడుగుల పిడుగులు.. మాటల తూటాలు.. స్ఫూర్తి నింపిన పాటలు.. ఉత్సాహం నింపిన ఆట నడుమ సమైక్య నినాదం మారుమ్రోగింది. ఇసుకేస్తే రాలనంత జనం.. తొణికిసలాడే ఉద్యమ భావం.. ఉప్పొంగే పౌరుషం పోరాట పటిమకు అద్దం పట్టింది. కర్నూలులో దారులన్నీ ఒక్కటి కాగా.. ఉద్యమకారులంతా కలిసి నడవగా.. ఎస్టీబీసీ కళాశాల మైదానం జన సునామీని తలపించింది. పార్టీలకు అతీతంగా.. నేతల ఊసే లేకుండా సాగిన ప్రజాగర్జన జిల్లా చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రజల తోడుగా.. వారే సారథులుగా సాగుతున్న ఉద్యమానికి దిశా నిర్దేశం చేసింది.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:కర్నూలులో నిర్వహించిన సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన బహిరంగ సభ విజయవంతమైంది. సభా వేదిక ఎస్టీబీసీ కళాశాల మైదానంతో పాటు చుట్టుపక్క రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. గతంలో ఇదే మైదానంలో అనేక రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరిగినా.. ఈ స్థాయిలో జనాన్ని చూడలేదనే చర్చ జరిగింది. తద్వారా సమైక్యవాదాన్ని బలంగా చాటగలిగారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో సభ ఆద్యంతం హోరెత్తింది. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఊరేగింపుగా బహిరంగ సభకు తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైన కార్యక్రమం రాత్రి 9:15 గంటలకు ముగిసింది. సభ పూర్తయ్యేంత వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా క్రమశిక్షణ పాటించడం విశేషం.
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు మొత్తం 40 మంది ప్రసంగించారు. అశోక్‌బాబు ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు చప్పట్లు, ఈలలు, కేకలతో ప్రోత్సహించారు. నెల్లూరు వాసులు తమిళనాడులో, అనంతపురం ప్రజలు బెంగుళూరులో, విశాఖపట్నం ప్రజలు ఒరిస్సాలో పెట్టుబడులు పెట్టవచ్చని, అయితే అక్కడకు వెళ్లకుండా హైదరాబాదులో ఎందుకు పెట్టుబడులు పెట్టారు... ఇది మన రాజధాని అనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చి అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల అంగీకారం లేనిదే రాష్ట్ర విభజన జరగదని, కాదు కూడదని ముందుకెళ్తే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రుల మెడలు వంచి రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేకపోయినా ముందుకు సాగకుండా అడ్డుకోగలిగామని, ఇది 60 రోజుల ఉద్యమంతో సాధ్యమైందన్నారు. ప్రజాగాయకుడు వంగపండు బృందం ఆటాపాటా సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సమ్మెను కొనసాగిస్తామని, అయితే విధి విధానాలపై ఈనెల 30న అన్ని జేఏసీ నేతలతో చర్చించి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. సీమాంధ్ర జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తీరాల్సిందేనన్నారు. ప్రైవేటు సంస్థలన్నీ యథావిధిగా పనిచేస్తున్నాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అనడం సరికాదని, ఆగస్టు 1 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు నిరంతరం ఉద్యమిస్తున్నాయని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పేర్కొనగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
ప్రైవేటు విద్యాసంస్థలను యథావిధిగా నడుపుతూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించగా వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఉపాధ్యాయులు వెనక్కు తగ్గారు. ఇదిలా ఉండగా ఉదయం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకొచ్చి 60 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారని, కేంద్రంలోని మంత్రులు, ఎంపీలు పదవులకు రాజీనామా చేసినట్లయితే విభజన ప్రక్రియ ఎప్పుడో తేలిపోయేదన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రులకు జరిగే అన్యాయంపై రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలే నాయకత్వం వహించి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుండటం శుభపరిణామమన్నారు.
తెలంగాణలోనూ సమైక్యాంధ్రకు మద్దతిచ్చే ప్రజలు చాలా మంది ఉన్నారని.. అలాంటి వారిపై తెలంగాణ ముసుగులో దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. రాజకీయ స్వార్థం కోసం తీసుకున్న విభజన నిర్ణయం శిలాశాసనం కాదన్నారు. తెలంగాణ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం మానకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విశాఖలో వచ్చే నెల 3, 4 తేదీల్లో అక్కడి పరిశ్రమల కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. సోమవారం 120 ప్రభుత్వ శాఖల జేఏసీ నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
Advertisement