జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన ఐదు పంచాయతీల ఎన్నికలు గురవారం ప్రశాంతంగా జరిగాయి. కడెం మండలం ఉడుంపూర్‌లో టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి జొన్నల సావిత్రి, ఖానాపూర్ మండలం ఇటిక్యాలలో టీఆర్‌ఎస్ బలపర్చిన వెన్నెలవారి లలిత గెలుపొందారు. సిర్పూర్(యు) మండలం పంగిడిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం జలీంషావ్ సర్పంచ్‌గా గెలుపొందారు. ఉట్నూర్‌లో 68శాతం పోలింగ్ నమోదైంది. గురువారం రాత్రి వరకూ కౌంటింగ్ కొనసాగుతోంది. భీమిని మండలం లక్ష్మీపూర్‌లో సర్పంచ్ అభ్యర్థి ఒకరు హైకోర్టును ఆశ్రయించడంతో కౌటింగ్ వాయిదా పడింది
.ఉడుంపూర్‌లోకడెం, న్యూస్‌లైన్ : మండలంలోని ఉడుంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక గురువారం ప్రశాంతంగా జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత నెల 31న ఎన్నికలు నిర్వహించగా వర్షాల కారణంగా గ్రామ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత, ఇస్లాంపూర్ గ్రామాలకు వెళ్లే రహదారికి అడ్డంగా వాగులు ఉప్పొంగడంతో అక్కడి ప్రజలు ఓటు వేయలేకపోయారు. దీంతో ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు. 31న జరిగిన పోలింగ్‌లో..1,550 ఓట్లకు గాను 1,085 పోలయ్యాయి. గురువారం 265 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్‌గా టీడీపీ బలపర్చిన జొన్నల సావిత్రి తన ప్రత్యర్థి బి.రాధికపై 606 ఓట్ల తేడాతో విజయం సాధించింది. పది వార్డులకు గాను నాలుగు వార్డుల్లో దోసండ్ల వెంకటి, కుర్ర నర్సవ్వ, అజ్మీర రాజేశ్వరి, గంగాధర బుచ్చవ్వ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగితా ఆరు వార్డుల్లో దరూర్ నర్సయ్య, కుర్ర లక్ష్మణ్, ఆత్రం దేవరావు, బెడద విజయ, దేశినేని సోను, దేశినేని భాగ్యలక్ష్మి గెలుపొందారు. అనంతరం ఉప సర్పంచ్‌గా దరూర్ నర్సయ్యను ఎన్నుకున్నారు. సాయంత్రం సర్పంచ్ సావిత్రి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాగా, తహశీల్దార్ లోకేష్, ఎంపీడీవో విలాస్, ఎసై్స మల్లేశ్ పోలింగ్ కేంద్రం వద్ద మకాం వేసి పరిస్థితిని సమీక్షించారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్‌టౌన్, న్యూస్‌లైన్ : మొదటి, రెండో విడతల్లో వాయిదా పడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికలను గురువారం నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఉట్నూర్ గ్రామ పంచాయతీ పరిధి వంకతుమ్మ, రాజంపేట్, దేవ్‌నగర్ గ్రామాల ప్రజలు వాగు దాటి రాలేక ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఎన్నికలను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడూ భారీ వర్షం కురువడంతో 8వ తేదీకి వాయిదా వేసి పోలింగ్ నిర్వహించారు. అధికారుల సూచనలతో ప్రజలు వాగులు దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 18వార్డుల్లో ఓటు వేయలేని వారు గురువారం ఓటు వేశారు. 68 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, కౌంటింగ్ కొనసాగుతోంది.
పంగిడిలో..
జైనూర్(సిర్పూర్(యు)), న్యూస్‌లైన్ : సిర్పూర్(యు) మండలం పంగిడి పంచాయతీ సర్పంచ్ ఎన్నిక గురువారం జరిగింది. 70శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఆత్రం జలీంషావ్ 259 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి గెడాం మారుతి 505 ఓట్లు వచ్చాయి.
ఇటిక్యాలలో..
ఇటిక్యాల(ఖానాపూర్), న్యూస్‌లైన్ : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత నెల 31న జరిగిన ఎన్నికల్లో వర్షం కారణంగా పోలింగ్ తక్కువ నమోదైంది. మొత్తం 927 మంది ఓటర్లు ఉండగా 305 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో ఎన్నికలు గురువారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. 305 మందికి గాను గురువారం జరిగిన పోలింగ్‌లో 204 మంది ఓటు వేశారు. మొత్తంగా 89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎంపీడీవో సిహెచ్.రాధారాథోడ్, తహశీల్దార్ కనకయ్య, జోనల్ అధికారి శంకరయ్య, ప్రత్యేకాధికారి గజ్జరాం, రిటర్నింగ్ అధికారి చంద్రహాస్ తెలిపారు. గుమ్మెన, ఎంగ్లాపూర్, కోలాంగూడ గ్రామాల నుంచి మహిళలు, వృద్ధులు, వికలాంగులు నానా అవస్థల మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు ట్రాక్టర్లు, ఆటోలు, వివిధ వాహనాల్లో తరలివచ్చారు. కాగా, టీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వెన్నెలవారి లలిత తన సమీప ప్రత్యర్థి ఉప్పు శంకర్‌పై 146 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో పది వార్డులకు గాను ఎనిమిది ఏకగ్రీవం కాగా.. రెండు వార్డుల్లో మద్దెల మహేందర్, బి.విలాస్ గెలుపొందారు. ఉప సర్పంచ్‌గా చంద్రబాను ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.