మక్తల్ రూరల్/గట్టు, న్యూస్‌లైన్: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ఇంకా పగలు, ప్రతీకారాలు పొడచూపుతూనే ఉన్నాయి. విజేతలు, పరాజితుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గునమండే కక్షలు రగిలిపోతున్నాయి.
ఈ కోవలోనే మక్తల్ మండలం కర్నీ గ్రామంలో వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో విజేతగా నిలిచిన సర్పంచ్‌గా అభ్యర్థి విజయాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడికి చెందిన బైక్, ట్రాక్టర్‌కు నిప్పంటించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం మేరకు..ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా రాఘవేందర్ గౌడ్ గెలుపొందారు. ఆయనకు అదే పార్టీ నాయకుడు మల్లేశ్వర్‌రెడ్డి పూర్తి మద్దతు తెలిపి భుజస్కందాలపై బాధ్యతను వేసుకుని రాఘవేందర్‌గౌడ్‌ను గెలిపించారు. నాటి నుంచి ప్రత్యర్థులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని స్థానికులు చెప్పారు. ఇదిలాఉండగా సోమవారం రాత్రి గ్రామంలోనే మల్లేశ్వర్‌రెడ్డి ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్, ట్రాక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇది గమనించిన ఆయన ఇంట్లోనుంచి బయటివచ్చి మంటలను ఆర్పివేసేలోగా వాహనాలు పూర్తిగా దహనమయ్యాయి. అయితే తెల్లవారేసరికి ఇంటి ముందు పెద్దఎత్తున గుమిగూడటంతో గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ మక్తల్ పోలీసులకు మల్లేశ్వర్‌రెడ్డి ఫోన్‌ద్వారా సమాచారమందించారు. ఎస్‌ఐ మురళి పోలీసు బందోబస్తుతో కర్ని గ్రామానికి ఘటనస్థలాన్ని పరిశీలించారు. కొందరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు బాధితుడు మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసునమోదు నమోదుచేసి దర్యాప్తుజరుపుతున్నట్లు ఎస్‌ఐ మురళి తెలిపారు.
గట్టు ఉప సర్పంచ్ ఎన్నికలో బాహాబాహీ
గట్టు, న్యూస్‌లైన్: మంగళవారం జరిగిన గట్టు ఉప సర్పంచ్ ఎన్నిక వార్డుసభ్యుల మధ్య సిగపట్లకు దారితీసింది. పోలీసుల సమక్షంలోనే ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గట్టు సర్పంచ్‌గా వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో సంతోషమ్మ ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డులకు ఏడుగురు సభ్యులు వైఎస్సార్ సీపీ మద్దతుతో గెలుపొందారు. ఆరుగురు కాంగ్రెస్ మద్దతుతో, ఒకరు టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. అయితే కోరం లేకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలాఉండగా కాంగ్రెస్, టీడీపీ వార్డు సభ్యులు ఏకం కావడంతో వారి సంఖ్య ఏడుగురికి పెరిగింది.
రెండు సమానమైన సందర్భంలో సర్పంచ్ ఓటుతో ఉప సర్పంచ్ పదవి సర్పంచ్ వర్గానికి వెళుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లిన వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో వార్డుసభ్యుడిగా గెలుపొందిన మల్లేష్‌ను కిడ్నాప్ చేశారు. మంగళవారం ఉపసర్పంచ్ ఎన్నిక తరుణంలో మల్లేష్ కనిపించకుండాపోవడంతో వైఎస్‌ఆర్ సీపీ శిబిరంలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో వార్డుసభ్యులు సిగపట్లకు దిగారు. అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఇంతలో కనిపించకుండాపోయిన మల్లేష్ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమవడంతో కథ సుఖాంతమైంది.
పగబట్టిన ‘పంచాయతీ’
Published Wed, Aug 7 2013 4:37 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement