ఓట్లు..కోట్లు..!
Published Sun, Feb 9 2014 1:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు: ఎన్నికల కాలం వచ్చేసింది. కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. అధికారపార్టీ నేతలు ఓటర్లకు గాలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల మనుగడ కష్టమని తేలిపోవడంతో ఆయా పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో డీలాపడిపోయారు. వ్యక్తిగత ఇమేజ్‌తో ఓటర్లను ఆకర్షించే ‘దురాలోచన’ చేస్తున్నారు. దీని కోసం మద్యం దుకాణాలను ఎంచుకుంటున్నారు. వీధివీధినా బెల్టు దుకాణాల ఏర్పాటుకుకసరత్తు చేస్తున్నారు. ఇలాగైతే డబ్బుతోపాటు నలుగురీనీ ఆకట్టుకోవచ్చనే పన్నాగం పన్నుతున్నారు. రాష్ట్ర ఖజానాకు ఎక్సైజ్ శాఖ నుంచి సమకూరే ఆదాయంలో జిల్లాది అగ్రస్థానం. జిల్లా వ్యాప్తంగా 342 వైన్ దుకాణాలు, 180 బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో జిల్లాలో రోజుకు రూ.కోటి విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది.
దుకాణాల లెసైన్స్ గడువు కొద్దినెలల్లో ముగియనున్నది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచి ఓ పక్క రూ.కోట్లు మరో వైపు ఓట్లు సంపాదించాలనే ప్రయత్నంలో వున్నారు. ఇప్పటికే ప్రాంతాలవారీగా కాంగ్రెస్, టీడీపీ నేతలు మద్యం సిండికేట్‌లతో ములాఖత్ అయినట్లు సమాచారం. మద్యం నిల్వలను బెల్టుదుకాణాలకు తరలించి విక్రయించాలని, అమ్మకాల్లో పర్సంటేజీ ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, దాచేపల్లి, నరసరావుపేట, వినుకొండ, రాజుపాలెం తదితర చోట్ల కిందటినెల నుంచే బెల్టు దుకాణాలు విస్తరించాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ నెలాఖరు నుంచి నేతల కనుసన్నల్లో బెల్టుదుకాణాలు నడపనున్నట్టు తెలిసింది. సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల కార్యకర్తలకు బెల్టుదుకాణాలు అప్పగిస్తూ నేతలు పెట్టుబడులు పెడుతున్నారని తెలిసింది. తద్వారా ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్నది నేతల వ్యూహంగా కనిపిస్తోంది.
ఎమ్మార్పీ ఉల్లంఘనతో లాభాలు
లెసైన్స్‌డ్ దుకాణాల్లో ప్రముఖ బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉండటం లేదు. సమీప బెల్టుదుకాణాల్లో ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో క్వార్టర్‌పై రూ.10 చొప్పున ధర పెంచి అమ్ముతున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా లెసైన్స్‌డ్ దుకాణాలు కాకుండా అనధికారికంగా సుమారు నాలుగువేల బెల్టుదుకాణాలు నడుస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల కిందట జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి ఈఎస్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ డీసీ కుళ్లాయప్ప ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్టుదుకాణాల విస్తరణపై మండిపడ్డారు. ఓట్లవేటతో పాటు డబ్బు సంపాదనకు బెల్టుదుకాణాల విస్తరణను మార్గంగా ఉపయోగించుకోవడంపై అధికారపార్టీ నేతలపై మహిళలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలతో బెల్టుదుకాణాలు ఏర్పాటు చేయించడంపై చర్చకు తెరలేచింది.
Advertisement
Advertisement