ఎన్నికల కిక్కు తగ్గిందా!
Published Sun, Mar 16 2014 2:45 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ఎన్నికల సీజన్ అంటే మద్యం సీజనే.. అనేది బహిరంగ రహస్యం. మందు బాబులకు, వ్యాపారులకు పండుగే. అయితే ప్రస్తుతం వరుస ఎన్నికలు జరుగుతున్నా మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడం విశేషం. కోడ్ అమల్లోకి రావడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండటం, బెల్టుషాపులపై పోలీస్, ఎక్సైజ్ శాఖలు నిఘా పెట్టడం.. మరోవైపు అదనపు మద్యం సరఫరాను బేవరేజెస్ కార్పొరేషన్ నియంత్రంచడం వంటి కారణాలు మద్యం విక్రయాలు తగ్గడానికి కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే ఒడిశా మద్యం తరలిరావడం కూడా ఇక్కడి విక్రయాలు తగ్గడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల సంఘం ఆంక్షలు
రాష్ట్ర ఎన్నికల సంఘం మద్యం సరఫరాపై ఆంక్షలు విధించింది. ఈ నెల 8వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి మే 16 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 2013లో ఈ కాలంలో ఎంత మద్యం సరఫరా చేశారో అంతే సరఫరా చేయాలి.. అంతకుమించి సరఫరా, అమ్మకాలు జరపకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తగ్గిన విక్రయాలు
అదనపు సరఫరా లేకపోయినా.. గత ఏడాది జరిగినంత విక్రయాలు జరగాల్సి ఉన్నప్పటికీ గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విక్రయాలు గణనీ యంగా తగ్గిపోయాయి. ప్రభుత్వం విధించిన కోటా మేరకు కూడా అమ్మకాలు జరగటం లేదు. జిల్లాలో 201 దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి. వీటిలో 2013లో మార్చి ఒకటి నుంచి 13 వరకు అమ్మకాలు పరిశీలిస్తే.. 49397 కేసుల లిక్కర్, 27145 కేసుల బీర్..వెరసి రూ.18.64 కోట్ల అమ్మకాలు జరిగాయి. అదే ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి 13 వరకు 32020 కేసుల లిక్కర్, 24443 కేసుల బీర్ వెరసి.. రూ.13 కోట్ల అమ్మకాలే జరిగాయి. ఈ లెక్కన 13 రోజుల్లోనే రూ.5.64 కోట్ల రెవెన్యూ తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు సరాసరి కోటి రూపాయల అమ్మకాలు జరుగుతుండగా ఎన్నికల సీజను మొదలైనందున రూ.3 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంది. అయితే బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేశారు. మరోవైపు గ్రామాల్లో పోలీసులు తరచూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో బెల్టు షాపుల్లో అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. అదే సమయంలో లెసైన్స్‌డ్ షాపుల యజమానులు తమకు అధికారులు కేటాయించిన మద్యం కోటా సైతం తీసుకువెళ్లటం లేదు. గ్రామాల్లో బెల్టు షాపులు తగ్గినా అక్కడక్కడా రహస్యంగా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కేసుల భయంతో తక్కువ స్థాయిలో జరుగుతున్నం దున అమ్మకాలపై వీటి ప్రభావం అంతగా లేదు.
ఒడిశా మద్యమే కారణమా?
ఇన్ని ఆంక్షలు ఉన్నా ఎమ్మార్పీ ధరలు మాత్రం ఎక్కడా అమలు కావటం లేదు. క్వార్టర్ మద్యంపై 5 నుంచి 10 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై అధికారులు సైతం దృష్టి సారిం చటం లేదు. ఇదిలా ఉండగా జిల్లా మద్యం సరఫరా, విక్రయాలపై ఆంక్షలు ఉన్నందున పొరుగున ఉన్న ఒడిశా నుంచి మద్యం అక్రమంగా తరలివస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మద్యం అధికారిక అమ్మకాలు తగ్గడానికి ఇదే కారణమన్న అభిప్రాయం కూడా ఉంది. ఒడిశాలో పన్నులు, నియంత్రణా తక్కువ. అందువల్ల తక్కువ రేటుకే మద్యం లభిస్తుంది. దీనికి తోడు ఒడిశా నుంచి శ్రీకా కుళం జిల్లాలోకి అక్రమంగా తరలించడానికి ఎన్నో చీకటి దారులున్నాయి.అందువల్ల సాధారణ సమయాల్లోనే ఒడిశా రాష్ట్రం నుంచి మద్యం జిల్లాలోకి పెద్ద ఎత్తున తరలివస్తుంటుంది. ప్రస్తుతం విధించిన ఆంక్షలు, ఎన్నికల అవసరాల దృష్ట్యా మరింత పెద్దఎత్తున ఒడిశా మద్యం వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
కమిషన్ ఆదేశాలు పాటిస్తున్నాం...
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నట్లు ఎచ్చెరలోన్లి బేవరేజెస్ కార్పొరేషన్ డిపో మేనేజర్ విక్టోరియా రాణి చెప్పారు. కోడ్ ఉన్నంత వరకు అదనపు కోటా సరఫరా చేయబోమని స్పష్టం చేశారు. సాధారణ అమ్మకాలు కూడా తగ్గిపోవడం వాస్తవమేనన్నారు.
Advertisement
Advertisement