రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి గోపాలకృష్ణ ద్వివేది
‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే ఆయుధం.. అలాంటి ఓటు జాబితాలో ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంటుంది. ఓటరుగా నమోదులో కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత ఎంతో ప్రజలకూ అంతే బాధ్యత ఉంటుంది. ఓటు అనే ఆయుధాన్ని రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారందరూ వినియోగించుకోవాలి. పోలింగ్ రోజు అందరూ ఓటు వేయాలి. వీలైనంత ఎక్కువ శాతం పోలింగ్ అయితేనే ప్రజా తీర్పునకు సార్థకత ఉంటుంది.
సాక్షి, అమరావతి :రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటు హక్కు కల్పన, ప్రవర్తనా నియమావళి అమలు, అధికారదుర్వినియోగానికి అడ్డుకట్ట, ధన ప్రభావాన్నినిరోధించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలోఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్నచర్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి గోపాలకృష్ణ ద్వివేదితో‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
సాక్షి: ఓటర్లకు మీరు సలహాలు, సూచనలు ఏమిటి?
ద్వివేది :ఓటర్‌గా నమోదుకు మరో మూడు రోజులే సమయం ఉంది. ఈ నెల 15వ తేదీలోగా కొత్తగా అర్హులైనవారంతా ఫాం 6తో దరఖాస్తు చేయాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నవారు కూడా జాబితాలో పేరుందో లేదో ఒకసారి చూసుకోవాలి. లేకపోతే వారు సైతం 15వ తేదీలోగా ఫాం 6తో దరఖాస్తు చేయొచ్చు. అలా దరఖాస్తు ఇచ్చినవారందరికీ కచ్చితంగా ఓటు హక్కు కల్పిస్తాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పోలింగ్ రోజు ఓటు లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాం. జాబితాలో పేరు లేకపోతే నేనే కాదు ఎవరూ ఏమీ చేయలేరు. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోదు. ఎన్నికల సంఘం వెలువరించిన జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిని ప్రజలు సానూకులంగా తీసుకోవాలి. రాష్ట్రంలో ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని 11 లక్షల మంది 18 ఏళ్లు నిండిన యువతకు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నాం. పోలింగ్ రోజు ఓటు లేదంటే నేనే కాదు ఎవరూ ఏం చేయలేరు. ఇన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాబితాను ఎందుకు చూసుకోలేదని మేం ఎదురు ప్రశ్నించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రానివ్వొద్దు.
సాక్షి: ఆన్‌లైన్ ద్వారా, 1950 నెంబర్ ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోండి. ఆన్‌లైన్‌లో ఓటర్‌గా నమోదవండని చెబుతున్నారు. కానీ, వీటి పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి కదా?
ద్వివేది :1950 నంబరుకు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 15 వేల కాల్స్ వస్తున్నాయి. అందరూ ఒకేసారి చేయడం వల్ల కొన్ని కాల్స్ వెయింటింగ్‌లో ఉంటాయి. 1950కు వచ్చే కాల్స్ అటెండ్ చేయడానికి జిల్లా స్థాయి నుంచి సిబ్బందిని పెంచాం. వెబ్‌సైట్‌ను ఎక్కువమంది వినియోగించడంతో ఒక్కోసారి ఇబ్బందులు రావొచ్చు. అంతేకాని పూర్తిగా పనిచేయడం లేదనడం సరికాదు. ఏది ఏమైనా వెబ్‌సైట్, 1950 నంబర్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం.
సాక్షి: అధికారంలో లేని రాజకీయ పార్టీలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
ద్వివేది : అధికారంలో ఉన్న, అధికారంలో లేని రాజకీయ పార్టీలన్నిటికీ ఒకటే చెబుతున్నాం. ఎన్నికలకు ప్రధానమైనది ఓటు. అలాంటి ఓటు నమోదుకు చర్యలు తీసుకోండి. ఎన్నికల సంఘం తరఫునా ప్రచారం చేస్తున్నాం. మరో మూడు రోజులే గడువుంది. ఈ నెల 15వ తేదీలోగా ఓటు లేని వారి చేత ఫాం 6 నింపి ఇప్పించే చర్యలు చేపట్టమని అన్ని రాజకీయ పార్టీలను కోరాం. ఇక ఎన్నికల నియమావళిలో మరో ప్రధాన అంశం ప్రవర్తనా నియమావళి అమలు. దానిని పాటించడం ద్వారా స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించమని కోరుతున్నాం.
సాక్షి: అధికార పార్టీకి ఇచ్చే సూచన, సలహాలు ఏమైనా ఉన్నాయా?
ద్వివేది :అధికార పార్టీనే కాదు... అధికారులకూ నియమావళి ఉంది. ఎవరు దుర్వినియోగానికి పాల్పడినా కఠిన చర్యలుంటాయి. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలి. ఈ విషయంలో రాజీనే లేదు. ఎవరైనా పక్షపాతంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ఉన్నా మినహాయింపుల్లేకుండా చాలా తీవ్ర చర్యలుంటాయి. అధికార పార్టీ ఏం చేయకూడదో నియమావళిలో స్పష్టంగా ఉంది. దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నాం.
సాక్షి: సచివాలయ ప్రధాన ద్వారం నుంచి ప్రధాన రోడ్డు వరకు ఇంకా సీఎం, మంత్రుల ఫొటోలతో హోర్డింగ్‌లున్నాయి, ఎందుకు తొలగించలేదు.?
ద్వివేది :అలా ఉండదండి. కరకట్ట మీద ఉన్న హోర్డింగ్స్ అన్నీ తీసేస్తున్నారు. (మధ్యలో ఫోన్ అందుకుని సచివాలయం ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందో ఆరా తీశారు. వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి ప్రధాన గేటు వద్ద ఇంకా ప్రభుత్వ హోర్డింగ్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నారు..? వెంటనే తొలగించండి. లేదంటే మీపై చర్య తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు).
సాక్షి: దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ధన ప్రభావం ఎక్కువని ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలేమైనా తీసుకుంటున్నారా?
ద్వివేది :బ్యాంకుల్లో భారీగా నగదు జమ, ఉపసంహరణపై ఓ కన్నేశాం. నగదు తరలింపు ఏ మార్గాల్లో చేసినా పట్టుకునేందుకు గట్టి చర్యలు చేపడుతున్నాం. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కూడా నిఘా పెట్టాం. చెక్ పోస్టుల దగ్గర పరిశీలన పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. మద్యం సరఫరాను నియంత్రించేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపడుతున్నాం. ఆన్‌లైన్ లావాదేవీలపైనా దృష్టిసారించాం. ఇప్పటివరకు రూ.9 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఆరు కిలోల బంగారం పట్టుకున్నాం. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆశించిన స్థాయిలో లేదని గుర్తించినందుకే ఆయా శాఖల అధికారులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశాం.
సాక్షి: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి?
ద్వివేది :ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను సిద్ధం చేశాం. మూడు లక్షల మంది సిబ్బంది అవసరమని గుర్తించాం. వారందరికీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని 45,920 పోలింగ్ కేంద్రాల్లో 9345 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. వీటి వద్ద కేంద్ర సాయుధ బలగాలను ఏర్పాటు చేస్తాం. పోలింగ్ కేంద్రాలన్నింటిలో వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. మైక్రో పరిశీలకులను నియమిస్తాం. వెబ్ కాస్టింగ్ ద్వారా ఏ పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు నేను కూడా తెలుసుకుంటా. భద్రతకు 350 కేంద్ర సాయుధ కంపెనీల బలగాలు కోరాం. పోలింగ్ నాటికి బలగాలన్నీ వస్తాయి. ప్రస్తుతం 90 కంపెనీల బలగాలు వస్తున్నాయి.
సాక్షి: ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 5వ తేదీతో చెక్కులను మహిళా సంఘాలకు ఇచ్చింది. అంటే, పోలింగ్‌కు ఆరు రోజుల ముందు ఆ డబ్బు వారి ఖాతాల్లో పడుతుంది. ఇది ఎన్నికల ప్రక్రియను, ఓటర్లను ప్రభావితం చేసినట్లు కాదా? దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?
ద్వివేది :దీంతోపాటు రైతుల ఖాతాలకు నగదు బదిలీలపైరాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాం. వారి వివరణనుకేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాం. కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తాం.
సాక్షి: ఓటర్ల జాబితా డేటా చోరీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం బృందాలను పంపిందన్నారు.
చర్యలేమైనా ఉన్నాయా?
ద్వివేది :: కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని నివేదిక కోరింది. పంపించాం. అందుకు సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలనేది వారే చూసుకుంటారు. ఇప్పటివరకైతే వారినుంచి ఎటువంటి సమాచారం రాలేదు. ఓటర్ల జాబితాలో పేరుందో లేదో ప్రతి ఒక్కరు చూసుకోండి. లేకపోతే వెంటనే అంటే మూడు రోజుల్లోగా ఫాం 6 నింపి ఇవ్వండి అని చివరగా మరీమరీ చెబుతున్నా.ఎన్నికల సందర్భంగా దేశంలోధన ప్రభావం తీవ్రంగా ఉండేరాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.దీనిని నిరోధించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం, అయినా అది సరిపోదని భావించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఇంకా పెంచాల్సిందిగా ఆదాయ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులను ఆదేశించాం. ప్రత్యేక నిఘాలో భాగంగా ఆన్‌లైన్ లావాదేవీలపైనాదృష్టి సారించాం. – గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి: ఫాం 7పై అధికార, ప్రతిపక్ష పార్టీలఆరోపణలు, ప్రత్యారోపణలపై ఏమంటారు?
ద్వివేది :ఏ పార్టీ అయినా లేదా ఏ వ్యక్తులైనాఫాం 7 వాస్తవ సమాచారంతో ఇస్తే తప్పులేదు. అవాస్తవ సమాచారంతో ఇస్తేనే నేరమవుతుంది. ఒక వ్యక్తి జీవించి ఉండగానే అతడు మరణించినట్లు, అతడి ఓటు తొలగించమనిఫాం 7 ఇవ్వడం నేరమే కాదు. అమానుషం. అయినా ఎవరి ఓట్లను అకారణంగా తీసేయలేదు. ఫాం 7 దరఖాస్తులపై క్షేత్ర స్థాయితనిఖీల తర్వాత వాస్తమైతేనే తొలగించాం. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కేవలం ఓటరు నమోదుకు మాత్రమే అది కూడాఈ నెల 15వ తేదీ వరకే అనుమతి ఉంది.కొత్తగా 13 లక్షల ఓట్లు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment