ముందుంది ముంచేకాలం
Published Fri, Dec 6 2013 3:37 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
సాక్షి, గుంటూరు :ముందుంది మరింత మంచికాలం అంటూ ప్రచార హోరెత్తిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు విద్యుత్ చార్జీల రూపంలో జనాన్ని ముంచేలా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. నాలుగేళ్ల నుంచి ఇంధన వ్యయ సర్దుబాటు చార్జీల(ఎఫ్‌ఏసీ) కింద కరెంటు చార్జీలు పెంచి వినియోగదారుడి నడ్డి విరిచిన ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఏకంగా విద్యుత్తు చార్జీలను భారీగా పెంచి కోలుకోలేని విధంగా దెబ్బతీయనుంది. ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ)కు డిస్కంలు సమర్పించిన పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిపి ఆమోదం తెలిపితే ఏప్రిల్ నుంచి పెరిగిన కరెంటు చార్జీలు అమల్లోకి రానున్నాయి. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్తు చార్జీలను చూస్తే వినియోగదారుడి గుండె గు‘బిల్లు’ మనాల్సిందే.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో సర్దుబాటు భారాన్ని సైతం జనంపై పడకుండా చూశారు. కానీ ప్రస్తుతం పాలకులు ప్రజా సంక్షేమాన్ని మరిచి చార్జీల బాదుడికే మొగ్గు చూపిస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలే టార్గెట్‌గా పెంచుతున్న విద్యుత్తు చార్జీలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో అన్ని కేటగిరీల కింద కరెంటు వినియోగిస్తున్నవారు 15 లక్షల మంది ఉన్నారు. వీరికి కరెంటు చార్జీల పెంపు పిడుగు లాంటి వార్తే. జిల్లాలో గృహ సర్వీసులు 13,09,239 ఉన్నాయి. కమర్షియల్ సర్వీసులు 92,920, ఎల్‌టీ ఇండస్ట్రియల్ సర్వీసులు 11,324, కాటేజీ ఇండస్ట్రీస్ అండ్ ధోభీ ఘాట్ సర్వీసులు 701 ఉన్నాయి. హెచ్‌టీ సర్వీసులు 723 వరకు ఉన్నాయి. వీటన్నిటిపై 50 పైసల నుంచి రూ.4.87 వరకు భారం పడనుంది.
యూనిట్‌కి సగటున రూపాయి పెంపు..
వచ్చే ఏడాది నుంచి కరెంటు చార్జీలు పెంచితే జిల్లాపై నెలకు రూ.30 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. 50 యూనిట్ల లోపు వినియోగించే వారిని వదిలి పెట్టకుండా డిస్కంలు ప్రతిపాదనలు అందించాయి. సగటున యూని ట్‌కు రూపాయికి పైగా పెరగనుంది. జిల్లాకు రోజుకు 10 మిలియన్ల యూనిట్లు సరఫరా జరుగుతోంది. అంటే నెలకు 300 మిలియన్ యూనిట్లకు పైగా జిల్లాలో కరెంటు విని యోగిస్తున్నట్లు లెక్క. అన్ని కేటగిరీల్లో సగటున యూనిట్‌కు రూపాయికి పైగా పెరిగితే జిల్లాపై నెలకు రూ.30 కోట్లకు పైగా భారం పడుతుందన్న మాట. ప్రస్తుతం జిల్లాలో నెలకు విద్యుత్తు డిమాండ్ రూ.165 కోట్ల వరకు ఉంది. చార్జీలు పెరిగితే వచ్చే ఏడాది నుంచి అదనంగా రూ.30 కోట్లు ముక్కు పిండి వసూలు చేయనున్నారు. అంటే మొ త్తం డిమాండ్ రూ.195 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కరెంటు చార్జీలు ఈ రకంగా పెరిగితే బుడ్డి దీపాల విని యోగం తప్పేలా లేదని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement