సాక్షి, గుంటూరు: పల్లెలపై విద్యుత్ పిడుగు పడింది. అనుకున్న విధంగానే పంచాయతీల నుంచి కరెంటు బిల్లులను ముక్కు పిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా అసలే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలపై కరెంటు బిల్లుల భారం తడిసి మోపెడు కానుంది. జిల్లాలోని 1,010 పంచాయతీలకు గత ఏడాది నవంబరు నాటికి రూ. 37.71 కోట్ల మేర కరెంటు బిల్లుల బకాయిలున్నాయి.
వీటిని 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నిధుల నుంచి చెల్లించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీలు విధిగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కనీసం కొన్ని పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు నిర్వహణ కష్టతరంగా మారింది. దీంతో అభివృద్ధి పనులపై పంచాయతీల పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
విద్యుత్ అధికారుల నోటీసులు...
కనెక్షన్ల నిలుపుదల.. జిల్లాలోని నాలుగు డివిజన్లలోని అధిక శాతం పంచాయతీలు కరెంటు బిల్లులను గత రెండేళ్ల నుంచి చెల్లించడం లేదు. అన్ని పంచాయతీల్లో కరెంటు బిల్లుల బకాయిలు రూ.37,71,29,000 పేరుకుపోయాయి. పలు దఫాలు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసి కరెంటు సరఫరా నిలిపేసిన సందర్భాలున్నాయి. పల్లెలన్నీ అంధకారంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణ, వీధి దీపాలకే కరెంటు బిల్లులు ఒక్కో పంచాయతీలో రూ.లక్షల్లో బకాయిలున్నాయి.
మహానేత వై.ఎస్. ఉన్నప్పుడు కరెంటు బిల్లుల భారం ప్రభుత్వానిదే..
మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేజరు, మైనర్ పంచాయతీల కరెం టు బిల్లుల భారం ప్రభుత్వమే భరి ంచేది. ఆయన మరణం తర్వాత విద్యుత్ బిల్లుల భారం పంచాయతీలపై మోపారు. పంచాయతీలకు ఎన్నికలు జరగకుండా సుదీర్ఘకాలం ఉండటంతో నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. దీంతో పంచాయతీలకు రావాల్సిన ఆదాయ వనరులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇంటి పన్ను బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఇటీవల విడుదలైన 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను కరెంటు బకాయిలకు మళ్లింపు చేయాలని ఆదేశాలు రావడంతో పంచాయతీల్లోని అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
పల్లెలపై విద్యుత్ పిడుగు
Published Wed, Jan 8 2014 4:04 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement