State Finance Corporation
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డి పేరు జీవన్ రెడ్డి ఈలోన్ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. దీంతో, అసలు ప్లస్ వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. కాగా, నోటీసుల అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బకాయిల వసూలుకు నోటీసులు.. ఇదిలా ఉండగా, అంతకుముందు.. జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట ఐదు అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
Hyderabad: రూ.500 కోట్ల విలువైన భూములకు ఎసరు
సాక్షి, హైదరాబాద్: స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ)కి కేటాయించిన స్థలాన్ని అక్రమార్కులు హారతి కర్పూరంలా కరిగిస్తున్నారు. ఇక్కడి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. సర్వే నంబర్ల మాయాజాలంతో కొండలను పిండి ప్లాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లకు పైగా విలువచేసే 50 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలు కట్టారు.. ఇదేమని ప్రశ్నించేవారే లేకపోవడంతో కబ్జాదారుల ఆటలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఒకవైపు రెవెన్యూ.. మరోవైపు ఎస్ఎఫ్సీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2007లో ఎస్ఎఫ్సీకి కేటాయింపు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్వేనంబర్ 307లోని 317 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సుమారు 249 ఎకరాలకుపైగా స్థలాన్ని 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఎఫ్సీకి స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ఆ స్థలానికి ఎటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాదారులకు కలిసి వచ్చింది. దీంతో పక్కనే ఉన్న సర్వే నంబర్ల ఆధారంగా పెద్ద పెద్ద కొండలను కరిగించి ప్లాట్లు చేస్తూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ వచ్చారు. ఇలా ఏకంగా 50 ఎకరాలకు పైగానే అన్యాక్రాంతమైందని రెవెన్యూ అధికారుల సర్వేలో తేలింది. ఇంత జరుగుతున్నా ఇప్పుడు ఆ స్థలాలను కా పాడే రెవెన్యూ అధికారులు, ఎస్ఎఫ్సీ సిబ్బంది కబ్జాదారులకు వత్తాసుగా నిలవడంతో ఆ స్థలం మొత్తం అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నా యని పలువురు అధికారుల తీరుపై అనుమానా లు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ స్థలం విషయంపై హైకోర్టులో కేసు నడుస్తుండగా ఢిల్లీలో జరిగిన విభజన హామీ విషయంలో మొదటి ప్రాధాన్యం ఈ స్థలంపైనే ఉండడం విశేషం. ప్రైవేటు స్థలమంటూ.. ∙సర్వే నంబర్ 307 ప్రభుత్వ స్థలంలో చుట్టూ సర్వే చేసిన మ్యాప్‌ను కబ్జాదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సర్వే నంబర్ 325, 326ల పక్కనే ఓ కొండ ఉండేది. ఇప్పుడు అది కనిపించకుండా పోయింది. దీని వెనక సూత్రధారులు.. పాత్రధారులు ఎవరనే విషయం అంతు చిక్కకుండా మారింది. ప్రభుత్వ సర్వే నంబర్‌ను ఆనుకొని ఉన్న ఈ కొండ మాయం కావడం వెను క ఓ మండల రెవెన్యూ ‘సర్వే’ అధికారి అన్నీ తా నే చూసుకోగా కబ్జాదారులు తమ పని పూర్తి చేశా రు. ఏకంగా సుమారు 30 ఎకరాలపై గాని కలుపుకొని ప్లాటింగ్ చేసి ఎటువంటి అనుమతులు లేకుండా గదులు నిర్మించి ఖాళీగా వదిలేశారు. ఎక్కడైనా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేయాల్సిన బాధ్యత రెవిన్యూ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఎస్ఎఫ్సీ అధికారుల బాధ్యత. కానీ ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపే నాథుడే లేకుండా పోయాడు. దీంతో ఎస్ఎఫ్సీ భూములు రోజురోజుకూ హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. అధికారులు మేల్కొనకపోతే మిగిలిన స్థలం సైతం ప్రైవేట్ సర్వే నంబర్లతో ప్లాట్లు చేసి అక్రమార్కులు విక్రయించే ప్రమాదం పొంచి ఉంది. ఎవరినీ వదిలిపెట్టం.. ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ ఫోర్స్ ఎక్కువగా కావాలి. ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమవుతోంది. తప్పకుండా వారం పది రోజుల్లో ఎస్ఎఫ్సీ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తాం. ఇప్పటికే పలువురుపై ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేస్తాం. ఇక్కడ జరుగుతున్న అనుమతుల వెనక ఎవరు ఉన్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమార్కులపైపై కఠిన చర్యలు తీసుకుంటాం. - సంజీవరావు, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ -
నిధుల వినియోగం లేదా!
చిలకలపూడి (మచిలీపట్నం) : అవనిగడ్డ సబ్ ట్రెజరీ పరిధిలోని పంచాయతీలకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1,16,37,962 నిధులు విడదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు రూ.78,61,516 మాత్రమే ఖర్చు చేశారు. విజయవాడ సబ్ ట్రెజరీ పరిధిలోని పంచాయతీలకు రూ.2,46,52,302 విడుదల కాగా, రూ.1,50,46,518 ఖర్చు చేశారు. జిల్లాలోని 970 పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విడుదలైన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. దీంతో అభివృద్ధి కుంటుపడటంతోపాటు రెండో విడత నిధుల మంజూరుకు బ్రేక్ పడే అవకాశం ఉంది. నిధులున్నా వినియోగించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి నానాటికీ కుంటుపడుతోంది. గ్రామాల్లో తాగునీరు సక్రమంగా సరఫరా చేయడంలేదు. వీధిలైట్లు వెలగడంలేదు. సైడ్ కాలువలు ధ్వంసమై మురుగునీరు కదలడంలేదు. దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. నిధులు వినియోగించకపోతే రావాల్సిన గ్రాంట్లకు బ్రేక్ జిల్లాలోని పంచాయతీలకు కేటాయించిన నిధులను సకాలంలో సక్రమంగా వినియోగించి వాటి వినియోగపత్రాలను అధికారులు ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో పంచాయతీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 13వ ఆర్థిక సంఘం మలి విడత నిధులు విడుదల చేయనున్నట్లు లేఖ రాసినట్లు సమాచారం. గతంలో ఇచ్చిన నిధుల వినియోగ పత్రాలను కేంద్రానికి సమర్పిస్తేనే ప్రస్తుతం నిధులు విడుదల చేస్తామని మెలికపెట్టినట్లు తెలిసింది. సగం కూడా వినియోగించని వైనం... జిల్లాలోని పంచాయతీలకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సబంధించి మొదటి విడతగా 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ.18,14,57,200, స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1,69,56,200 విడుదలయ్యాయి. ఈ నిధులను 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా పంచాయతీలకు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు సాధారణ నిధులు రూ.18,96,300 పంచాయతీల్లో ఉన్నట్లు తెలిపారు. కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు 50 శాతం కూడా పంచాయతీల్లో ఖర్చు చేయలేదని అధికారిక లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. పాలకవర్గాలు ఏర్పడినా... పాలకవర్గాలు లేక ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని గతంలో విమర్శలు వచ్చాయి. ఏడాది కిందట పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడినా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. అయితే వరుస ఎన్నికలతో కోడ్ అమలులో ఉండటంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని పాలకవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి అందుబాటులో ఉన్న నిధులను వినియోగించి గ్రామాలను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త నిధుల మంజూరుకు మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉంది. -
అంతా ఆర్భాటమే
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ పంచాయతీ హోదా పెరిగి రెండున్నరేళ్లయినా, సమస్యలు మాత్రం తీరడం లేదు. అధికారుల ఆర్భాటమే తప్ప, అభివృద్ధి కనిపించడంలేదు. కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నా, వినియోగంలో జాప్యం నెలకుంటోంది. ఇప్పటి వరకు నగర పంచాయతీకి మంజూరైన సుమారు రూ.5.70 కోట్లకుపైగా నిధుల్లో కేవలం కోటిన్నర విలువైన పనులు మాత్రమే జరిగాయి. మరో కోటిన్నర విలువైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ కింద మంజూరైన రూ.2.2 కోట్ల నిధుల విడుదలకు కూడా ఇన్నాళ్లూ ఎన్నికల ‘కోడ్’ అడ్డంకిగా నిలిచింది. ఇక నగర పంచాయతీ ప్రజలకు వరప్రదాయినిగా మారనున్న గజ్వేల్-సింగూర్ నీటి పథకానికి రూ.195 కోట్ల మంజూరులో జాప్యం నెలకొంది. ఆశలు.. అడియాశలు 2012 జనవరిలో గజ్వేల్ నగర పంచాయతీగా ఆవిర్భవించింది. మేజర్ పంచాయతీ నుంచి అప్‌గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలంతా భావించారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. పారిశుద్ధ్యలోపం, అధ్వాన్నంగా మారిన అంతర్గత రోడ్లు ప్రజలకు నరకం చూపుతున్నాయి. మురుగునీటి కాల్వల వ్యవస్థ సక్రమంగా లేక ఇక్కడ ప్రతిఏటా విషజ్వరాలు విజృంభిస్తూ వందల మంది రోగాల బారిన పడుతున్నారు. అడపాదడపా నిధులు మంజూరవుతున్నా, వినియోగంలో మాత్రం జాప్యం నెలకొంది. ఏడాది కిందట నగర పంచాయతీకి ప్రారంభ నిధి కింద రూ.2 కోట్లు రాగా, రూ.50 లక్షలు మున్సిపల్ భవన నిర్మాణానికి కేటాయించారు. కానీ ఈ పనులు ఇంత వరకూ ప్రారంభం కాలేదు. మిగిలిన రూ.1.5 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ వంటి పనులు చేపట్టారు. ఇదే క్రమంలో 13వ ఆర్థిక సంఘం, రోడ్డు గ్రాంట్, బీఆర్జీఎఫ్ పథకాల కింద మరో కోటిన్నర మంజూరు కాగా, ఈ నిధులతో కూడా వివిధ వార్డుల్లో కాల్వలు, అంతర్గత రోడ్లు, తాగునీటి పైప్లైన్ల నిర్మాణం వంటి పనులు ప్రారంభించారు. ఈ పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. నాలుగు నెలల కిందట ఎస్ఎఫ్సీ ద్వారా మంజూరైనా రూ.2.22 కోట్లకు ఎన్నికల ‘కోడ్’ అడ్డంకిగా మారటంతో వినియోగానికి అవకాశం లేకుండాపోయింది. నగర పంచాయతీకి ఆశాదీపంలా మారనున్న గజ్వేల్-సింగూర్ నీటి పథకానికి సంబంధించిన రూ. 195 కోట్ల మంజూరులోనూ జాప్యం నెలకొంది. -
పల్లెలపై విద్యుత్ పిడుగు
సాక్షి, గుంటూరు: పల్లెలపై విద్యుత్ పిడుగు పడింది. అనుకున్న విధంగానే పంచాయతీల నుంచి కరెంటు బిల్లులను ముక్కు పిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా అసలే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలపై కరెంటు బిల్లుల భారం తడిసి మోపెడు కానుంది. జిల్లాలోని 1,010 పంచాయతీలకు గత ఏడాది నవంబరు నాటికి రూ. 37.71 కోట్ల మేర కరెంటు బిల్లుల బకాయిలున్నాయి. వీటిని 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధుల నుంచి చెల్లించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీలు విధిగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కనీసం కొన్ని పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు నిర్వహణ కష్టతరంగా మారింది. దీంతో అభివృద్ధి పనులపై పంచాయతీల పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. విద్యుత్ అధికారుల నోటీసులు... కనెక్షన్ల నిలుపుదల.. జిల్లాలోని నాలుగు డివిజన్లలోని అధిక శాతం పంచాయతీలు కరెంటు బిల్లులను గత రెండేళ్ల నుంచి చెల్లించడం లేదు. అన్ని పంచాయతీల్లో కరెంటు బిల్లుల బకాయిలు రూ.37,71,29,000 పేరుకుపోయాయి. పలు దఫాలు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసి కరెంటు సరఫరా నిలిపేసిన సందర్భాలున్నాయి. పల్లెలన్నీ అంధకారంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణ, వీధి దీపాలకే కరెంటు బిల్లులు ఒక్కో పంచాయతీలో రూ.లక్షల్లో బకాయిలున్నాయి. మహానేత వై.ఎస్. ఉన్నప్పుడు కరెంటు బిల్లుల భారం ప్రభుత్వానిదే.. మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేజరు, మైనర్ పంచాయతీల కరెం టు బిల్లుల భారం ప్రభుత్వమే భరి ంచేది. ఆయన మరణం తర్వాత విద్యుత్ బిల్లుల భారం పంచాయతీలపై మోపారు. పంచాయతీలకు ఎన్నికలు జరగకుండా సుదీర్ఘకాలం ఉండటంతో నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. దీంతో పంచాయతీలకు రావాల్సిన ఆదాయ వనరులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇంటి పన్ను బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఇటీవల విడుదలైన 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను కరెంటు బకాయిలకు మళ్లింపు చేయాలని ఆదేశాలు రావడంతో పంచాయతీల్లోని అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. -
మున్సిపాలిటీలకు రూ.48 కోట్లు
మదనపల్లె, న్యూస్‌లైన్ : రాయలసీమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్ఎఫ్సీ) నిధులు రూ.48 కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ తెలిపారు. గురువారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎస్ఎఫ్సీ నిధులతో మున్సిపాలిటీలకు విద్యుత్‌బిల్లులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో ఒక్కో మునిసిపాలిటీకి రూ.60 లక్షల నుంచి రూ.రెండు కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. రీజనల్ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎస్సీ,ఎస్టీ కాలనీల అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి 42 శాతం ఆస్తిపన్నులు వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నాటికి 90 శాతం పన్నులు వసూలు చేసేలా కమిషనర్లు, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు. చెత్తపై కొత్త సమరం కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిపై జనవరి 28, 29, 30 తేదీల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని బాగా అమలు చేసిన మున్సిపాలిటీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో ఇన్చార్జ్ కమిషనర్ తులసీరామ్, డీఈ నీలకంఠనాయుడు, మేనేజర్ రాంబాబులు పాల్గొన్నారు.