బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి మరో షాక్‌ | State Finance Corporation Notices To BRS Ex MLA Jeevan Reddy | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి మరో షాక్‌

Published Tue, Dec 12 2023 9:05 AM | Last Updated on Tue, Dec 12 2023 9:05 AM

State Finance Corporation Notices To BRS Ex MLA Jeevan Reddy - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. 

అయితే, మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డి పేరు జీవన్‌ రెడ్డి ఈలోన్‌ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. దీంతో, అసలు ప్లస్‌ వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. కాగా, నోటీసుల అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

బకాయిల వసూలుకు నోటీసులు..
ఇదిలా ఉండగా, అంతకుముందు.. జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్‌ ఇచ్చారు. ఆర్మూర్‌ పట్టణంలోని టీఎస్‌ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్‌ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్‌ అండ్‌ మల్టిప్లెక్స్‌ పేరిట ఐదు అంతస్తుల భారీ షాపింగ్‌ మాల్‌ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్‌లో రిలయన్స్‌ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్‌ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్‌ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు.

దీంతో విష్ణుజిత్‌ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె  7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు  2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు.

మూడు రోజుల్లో చెల్లించాలి
ఆర్టీసీ నిజామాబాద్‌ ఆర్‌ఎం జానీరెడ్డి, ఆర్మూర్‌ డిపో ఇన్‌చార్జి మేనేజర్‌ పృథ్వీరాజ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్‌ మాల్‌లో హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్‌ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్‌ ఏడీఈ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్‌ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement