చిలకలపూడి (మచిలీపట్నం) : అవనిగడ్డ సబ్ ట్రెజరీ పరిధిలోని పంచాయతీలకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1,16,37,962 నిధులు విడదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు రూ.78,61,516 మాత్రమే ఖర్చు చేశారు. విజయవాడ సబ్ ట్రెజరీ పరిధిలోని పంచాయతీలకు రూ.2,46,52,302 విడుదల కాగా, రూ.1,50,46,518 ఖర్చు చేశారు.
జిల్లాలోని 970 పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విడుదలైన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. దీంతో అభివృద్ధి కుంటుపడటంతోపాటు రెండో విడత నిధుల మంజూరుకు బ్రేక్ పడే అవకాశం ఉంది. నిధులున్నా వినియోగించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి నానాటికీ కుంటుపడుతోంది. గ్రామాల్లో తాగునీరు సక్రమంగా సరఫరా చేయడంలేదు. వీధిలైట్లు వెలగడంలేదు. సైడ్ కాలువలు ధ్వంసమై మురుగునీరు కదలడంలేదు. దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది.
నిధులు వినియోగించకపోతే రావాల్సిన గ్రాంట్లకు బ్రేక్
జిల్లాలోని పంచాయతీలకు కేటాయించిన నిధులను సకాలంలో సక్రమంగా వినియోగించి వాటి వినియోగపత్రాలను అధికారులు ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో పంచాయతీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 13వ ఆర్థిక సంఘం మలి విడత నిధులు విడుదల చేయనున్నట్లు లేఖ రాసినట్లు సమాచారం. గతంలో ఇచ్చిన నిధుల వినియోగ పత్రాలను కేంద్రానికి సమర్పిస్తేనే ప్రస్తుతం నిధులు విడుదల చేస్తామని మెలికపెట్టినట్లు తెలిసింది.
సగం కూడా వినియోగించని వైనం...
జిల్లాలోని పంచాయతీలకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సబంధించి మొదటి విడతగా 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ.18,14,57,200, స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1,69,56,200 విడుదలయ్యాయి. ఈ నిధులను 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా పంచాయతీలకు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు సాధారణ నిధులు రూ.18,96,300 పంచాయతీల్లో ఉన్నట్లు తెలిపారు. కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు 50 శాతం కూడా పంచాయతీల్లో ఖర్చు చేయలేదని అధికారిక లెక్కలు స్పష్టంచేస్తున్నాయి.
పాలకవర్గాలు ఏర్పడినా...
పాలకవర్గాలు లేక ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని గతంలో విమర్శలు వచ్చాయి. ఏడాది కిందట పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడినా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. అయితే వరుస ఎన్నికలతో కోడ్ అమలులో ఉండటంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని పాలకవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి అందుబాటులో ఉన్న నిధులను వినియోగించి గ్రామాలను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త నిధుల మంజూరుకు మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉంది.
నిధుల వినియోగం లేదా!
Published Thu, Aug 7 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement