అంతా ఆర్భాటమే
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ పంచాయతీ హోదా పెరిగి రెండున్నరేళ్లయినా, సమస్యలు మాత్రం తీరడం లేదు. అధికారుల ఆర్భాటమే తప్ప, అభివృద్ధి కనిపించడంలేదు. కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నా, వినియోగంలో జాప్యం నెలకుంటోంది. ఇప్పటి వరకు నగర పంచాయతీకి మంజూరైన సుమారు రూ.5.70 కోట్లకుపైగా నిధుల్లో కేవలం కోటిన్నర విలువైన పనులు మాత్రమే జరిగాయి. మరో కోటిన్నర విలువైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ కింద మంజూరైన రూ.2.2 కోట్ల నిధుల విడుదలకు కూడా ఇన్నాళ్లూ ఎన్నికల ‘కోడ్’ అడ్డంకిగా నిలిచింది. ఇక నగర పంచాయతీ ప్రజలకు వరప్రదాయినిగా మారనున్న గజ్వేల్-సింగూర్ నీటి పథకానికి రూ.195 కోట్ల మంజూరులో జాప్యం నెలకొంది.
ఆశలు.. అడియాశలు
2012 జనవరిలో గజ్వేల్ నగర పంచాయతీగా ఆవిర్భవించింది. మేజర్ పంచాయతీ నుంచి అప్‌గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలంతా భావించారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. పారిశుద్ధ్యలోపం, అధ్వాన్నంగా మారిన అంతర్గత రోడ్లు ప్రజలకు నరకం చూపుతున్నాయి. మురుగునీటి కాల్వల వ్యవస్థ సక్రమంగా లేక ఇక్కడ ప్రతిఏటా విషజ్వరాలు విజృంభిస్తూ వందల మంది రోగాల బారిన పడుతున్నారు. అడపాదడపా నిధులు మంజూరవుతున్నా, వినియోగంలో మాత్రం జాప్యం నెలకొంది.
ఏడాది కిందట నగర పంచాయతీకి ప్రారంభ నిధి కింద రూ.2 కోట్లు రాగా, రూ.50 లక్షలు మున్సిపల్ భవన నిర్మాణానికి కేటాయించారు. కానీ ఈ పనులు ఇంత వరకూ ప్రారంభం కాలేదు. మిగిలిన రూ.1.5 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ వంటి పనులు చేపట్టారు. ఇదే క్రమంలో 13వ ఆర్థిక సంఘం, రోడ్డు గ్రాంట్, బీఆర్‌జీఎఫ్ పథకాల కింద మరో కోటిన్నర మంజూరు కాగా, ఈ నిధులతో కూడా వివిధ వార్డుల్లో కాల్వలు, అంతర్గత రోడ్లు, తాగునీటి పైప్‌లైన్‌ల నిర్మాణం వంటి పనులు ప్రారంభించారు. ఈ పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. నాలుగు నెలల కిందట ఎస్‌ఎఫ్‌సీ ద్వారా మంజూరైనా రూ.2.22 కోట్లకు ఎన్నికల ‘కోడ్’ అడ్డంకిగా మారటంతో వినియోగానికి అవకాశం లేకుండాపోయింది. నగర పంచాయతీకి ఆశాదీపంలా మారనున్న గజ్వేల్-సింగూర్ నీటి పథకానికి సంబంధించిన రూ. 195 కోట్ల మంజూరులోనూ జాప్యం నెలకొంది.