విద్యుత్ కోతలిక అధికారికం
సాక్షి, విశాఖపట్నం: కోత కష్టాలు మొదలయ్యాయి. వేసవి పూర్తి స్థా యిలో ఆరంభంకాకమునుపే తడా ఖా చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు లోడ్ రిలీఫ్(ఎల్‌ఆర్) పేరిట అనధికారిక కోతలు అమలవుతున్నాయి. గ్రా మీణ ప్రాంతాల్లో ఈ కోతలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. పట్టణ ప్రాంతాలకు కాస్త మినహాయింపునిచ్చారు. మంగళవారం నుంచి ఈ ప్రాంతాల్ని కూడా కలిపి అధికారిక కోతలకు ఈపీడీసీఎల్ షెడ్యూల్ ఖరారు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 11.05 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇది పెరిగే అవకాశాలున్నాయి.
ఆదివారం రాత్రి జిల్లాలో ఏకంగా 423 మెగావాట్లు పీక్ డిమాండ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఇది 500 మెగావాట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. ఆ స్థాయికి డిమాండ్ చేరితే మరింతగా కోతలు తప్పకపోవచ్చని సమాచారం.
కోతల వేళలు
గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 , మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మూడేసి గంటలు చొప్పున విద్యుత్ సరఫరా నిలిపేస్తారు.
మండల కేంద్రాల్లో ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నరపాటు కోత విధిస్తారు..మున్సిపాలిటీల్లో కూడా అటూఇటుగా ఇలాగేఉంటాయి. విద్యుత్ లభ్యత ఆధారంగా మార్పులు చేర్పులుంటాయి.
ఆస్పత్రులపై కరుణ.. : ఆస్పత్రుల్లో ఇబ్బందులు కలగకుండా వ్యవహరిఇంచాలని ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు అధికారులకు సూచించారు. ఉదయం కోతల్లో కాస్త మార్పులుండే అవకాశాలున్నాయి. డెడికేటెడ్ ఫీడరున్న కేజీహెచ్‌కు అనివార్య పరిస్థితుల్లో మినహా విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులతోపాటు, పేదలుండే ఫీడర్లలో కూడా వీలున్నమేరకు మినహాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.