త్వరలో గుంటూరు – గుంతకల్ డబ్లింగ్ లైన్ పనులు పూర్తి
గుంటూరు రైల్వే డివిజన్‌ను పరిశీలించిన రైల్వే జీఎం వినోద్
సాక్షి, లక్ష్మీపురం (గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే డివిజన్ పరిధిలోని మంగళగిరి, గుంటూరు, నల్లపాడు రైల్వేస్టేషన్‌లను పరిశీలించానని తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో వెయిటింగ్ హాల్ పనులు, ప్లాట్ ఫాం నెం–1 ఎక్స్‌టెన్షన్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొత్త ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌ను 1వ నెంబర్ ప్లాట్‌ఫాం నుంచి 8వ నెంబర్ ప్లాట్‌ఫాం వరకు 2018–19లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
డిసెంబర్‌లోగా గుంటూరు–గుంతకల్ విద్యుత్ లైను పనులు పూర్తి
గుంటూరు నుంచి గుంతకల్ వరకు రైల్వే విద్యుత్ లైన్ పనులు ఈ ఏడాది డిసెంబర్ 17లోగా పూర్తి కానున్నాయని రైల్వే జీఎం తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి గుంటూరు డివిజన్ మీదుగా ఎలక్ట్రిక్ రైలు రానుందని చెప్పారు. గుంటూరు – గుంతకల్ రైల్వే డబ్లింగ్ లైన్ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. రెండు గ్రామాల్లో భూసేకరణ సమస్య వల్ల గుంటూరు–తెనాలి మధ్య రైల్వే డబ్లింగ్ లైన్ పనులు పూర్తి కాలేదని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు రైల్వే డీఆర్‌ఎం వి.జి.భూమా, ఏడీఆర్‌ఎం రంగనాథ్, సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు, డివిజన్ పరిధిలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.