కష్టం ఆహుతైంది..గుండె ఆగిపోయింది
తిమిడి (శృంగవరపుకోట రూరల్) : ఎస్.కోట మండలం తిమిడి గ్రామ రాజివీధి లో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల పెంకుటిల్లు దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.2.50 లక్షల నగదుతోపాటు, ఆరు తులాల బంగారు నగలు అగ్నికి ఆహుతయ్యూయి. కష్టార్జితం కళ్ల ముందే కాలి బూడిదవుతుంటే.. ఆ ఇంటి యజమాని తట్టుకోలేకపోయూడు. అక్కడే కుప్పకూలిపోయూడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించారు.
అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిమిడి గ్రామానికి చెందిన తొత్తడి ఎర్నాయుడు.. శనివారం రాత్రి భార్య, కుమారుడు, కుమార్తెలతో కలిసి ఇంటి ఆరుబయట నిద్రించారు. అర్ధరా త్రి సమయంలో ఇంట్లో నుంచి వాసన వస్తుండడంతో లేచి చూశారు. ఇంట్లో నుంచి మంటలు రావడంతో వెంటనే ఎస్.కోట అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అప్పటికే ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు దినుసులతోపాటు దుస్తు లు, ఇతర సామగ్రి, నగదు, నగలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యూయి. అగ్నిమాపక సిబ్బందికి ఇంటి యజ మాని ఎర్నాయుడు కూడా సహకారం అందించాడు. ఇటీవల పొలం అమ్మగా వచ్చిన రూ. 2.50 లక్షల నగదుతోపాటు, బంగారు నగలు, బియ్యం, ఇతర సామగ్రిని ఇంట్లో ని ట్రంకు పెట్టెలో ఎర్నాయుడు కుటుంబ సభ్యులు భద్రపరిచారు. ప్రమాదంలో మొత్తం దగ్ధమవ్వడాన్ని కళ్లారా చూసిన ఇంటి యజమాని ఎర్నాయుడు తట్టుకోలేకపోయూడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయూడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఎమ్మెల్యే పరామర్శ
ప్రమాద వార్త తెలుసుకున్న ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఘటనా స్థలానికి చేరుకు ని పరిశీలించారు. ఎర్నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధుల మంజూరుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఇందిర కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేశారు.