భారంగా.. బతుకు బండి.. | Electricity charges increment | Sakshi
Sakshi News home page

భారంగా.. బతుకు బండి..

Published Sat, Dec 28 2013 4:02 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

Electricity charges increment

విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగిందని, ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం కష్టంగా ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ గత ఏప్రిల్ నుంచి చార్జీల మోత్త మోగించింది. ఈ ప్రభావం జిల్లాలోని కనెక్షన్లపై 41 శాతానికిపైగా భారం పడింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా ప్రజలపై నెలకు సుమారు రూ. 10 కోట్లకుపైగా భారం పడినట్లు అంచనా. అదే విధంగా పాత విద్యుత్ వినియోగంపై సర్దుబాటు పేరుతో చార్జీలను ముక్కుపిండి వసూలు చేశారు. పాత బకాయిల పేరుతో జిల్లా వినియోగదారులపై యూనిట్‌కు రూ. 0.14 పైసల  నుంచి రూ. 1.22 పైసల వరకు ప్రతీ నెల బిల్లలో జమ చేసింది.

 డిస్ట్రీబ్యూషన్ కంపెనీల లెక్కల ప్రకారం  సగటున యూనిట్‌కు రూ. 0.63 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.  దీంతో జిల్లా విద్యుత్ వినియోగదారులపై (వ్యవసాయం మినహా) రూ. 90కోట్ల మేరకు అదనపు భారం పడింది. దీంతో పాటు విద్యుత్ వినియోగదారులకు ఫిక్స్‌డ్ చార్జీల పేరుతో అదనపు భారం మోపింది. ఈ ఫిక్స్‌డ్ చార్జీలు గత ఏప్రిల్ నెల నుంచి క్యాటగిరి-2( వ్యాపార విద్యుత్ వినియోగదారులు) వినియోగదారులపై కిలోవాట్‌కు రూ. 50 చొప్పున అదనపు భారం మోపారు. ఇలా ప్రతీ నెలకు రూ. 49లక్షల మేరకు అదనపు బారం పడింది. ఇలా చార్జీల పెంపు, సర్దుబాటు బాదుడు, ఫిక్స్‌డ్ చార్జీల పేరుతో మొత్తం సంవత్సరానికి రూ. 220కోట్లకు పైగా జిల్లా ప్రజలపై భారం పడింది.

 భారమైన బస్సు ప్రయాణం
 ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ చార్జీలను పెంచిన సర్కారుకు అహం తీరలేదు. బస్సు చార్జీలు, సర్వీస్ చార్జీలు, చివరకు విద్యార్థుల బస్ పాసులపై కూడా అదనపు భారం మోపింది. వీటన్నింటి రూపేణ సంవత్సరానికి  జిల్లా ప్రజలపై రూ. 18 కోట్లకుపైగా భారం పడినట్లు అధికారుల అంచనా. ఏసీ, సూపర్ లగ్జరీ, ఎక్స్‌పెస్ చార్జీలతోపాటు పేద, మధ్య తరగతి వర్గాలు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులను కూడా వదలకుండా చార్జీలు పెంచారు. ఏసీ బస్సులపై 12శాతం, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌లపై 10శాతం, పల్లెవెలుగు బస్సులపై 8శాతం అదనంగా చార్జీలు పెంచారు.

 దీంతో జిల్లా ప్రజలపై నెలకు  సుమారుగా రూ.2 కోట్లు అదనపు భారం పడింది. దీంతోపాటు సర్వీసు చార్జీల పేరిట ప్రతీ టికెట్టుకు రూపాయి చొప్పున పెంచి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా వ్యవహరించింది. వీటితోపాటు పేద విద్యార్థులకు అందించే బస్సు పాస్‌లపై కూడా అదనపు భారం మోపారు. దీంతో జిల్లాలోని 38వేల మంది విద్యార్థుల ద్వారా నెలకు సుమారు రూ. 40లక్షల మేరకు విద్యార్థుల ముక్కుపిండి వసూలు చేశారు.
 చుక్కల్లో
 నిత్యావసరాల ధరలు...
 మరోపక్క నిత్యావసరాల ధరలు అదుపు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. నిరుపేదలకు సరఫరా చేసే నిత్యావసరాలను అంతంత మాత్రంగానే అందజేయడంతో మిగిలినవి కొనుగోలు చేయడానికి ప్రజలు బెంబేలెత్తారు. ఉల్లి గడ్డలు పేదవారికి కన్నీటినే మిగిల్చాయి. కిలో రూ. 60 నుంచి కిందకు దిగలేదు. అలాగే బియ్యం కిలో రూ. 50ల పైమాటే ఉంది. మంచినూనె, కూరగాయలు, అల్లం, పప్పులు, ఉప్పులు, గ్యాస్, దుస్తులు ఒక్కటా.. రెండా...ఇలా అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఈ ఏడాదిలో మొత్తం రూ. 750కోట్ల మేరకు అదనపు భారం పడినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
 మిన్నంటిన నిరసనలు
 విద్యుత్ చార్జీలు, సర్దుబాటు, ఫిక్స్‌డ్ చార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ బస్సు చార్జీలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, దుస్తులు ఇలా అన్ని రకాల వస్తువులపై పన్నులతో ధరలు పెం చడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతు కు భారంగా మారింది. దీంతో జిల్లాలో వివిధ  రాజకీయ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.

ధరలు తగ్గించాలని ఉద్యమాలు చేశారు. బంద్‌లు పాటిం చారు. అధికారులను నిలదీశారు. కలెక్టరేట్ ముట్టడించారు. బస్సు లు నడవనీయలేదు. పేదలపై భారం మోపిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని, ధరలు పెంచి న కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌కు తగిన సమయంలో తగిన విధంగా ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. మొత్తం మీద 2013వ సంవత్సరం పేద మధ్య తరగతి ప్రజల నుంచి అన్నివర్గాల వారిని ఆర్థికంగా ఇబ్బందుల కు గురి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement