ఎస్సీ, ఎస్టీ పేదలకు చార్జీల షాక్
- ‘ఉప ప్రణాళిక’ ఆర్భాటమే
- అమలుకు నోచుకోని పథకం
- 1.90 లక్షల కుటుంబాలకు ఆశాభంగం
- బిల్లుల వసూలుకు అధికారులు సిద్ధం
ఎస్సీ, ఎస్టీ పేదలపై విద్యుత్ బిల్లుల భారం పడనుంది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారిని ఆదుకుంటామంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడంతో ఆయా వర్గాల వారు బిల్లులు చెల్లించలేదు. నేడు వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ రాకపోవడంతో అధికారులు బకాయిల వసూలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఆ బకాయిలన్నీ చెల్లించేదెలా అని ఎస్సీ, ఎస్టీ పేదలు గగ్గోలు పెడుతున్నారు.
తిరువూరు : గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పేదలకు ఆశాభంగమే ఎదురవుతోంది. 2013 ఏప్రిల్‌లో ప్రకటించిన ఈ పథకంలో 50 యూనిట్ల లోపు నెలవారీ కరెంటు వినియోగం ఉన్న కుటుంబాల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంపై బుర్రకథ దళాలతో, కళాజాతాలతో ఊరూరా విస్తృత ప్రచారం చేయించారు. గ్రామసభలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీల నుంచి దరఖాస్తులు, కులధృవీకరణ పత్రాలు తీసుకున్నారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 90 వేల కనెక్షన్లకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా లబ్ధి చేకూరుతుందని అధికారులు అంచనా వేశారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఈ ప్రణాళిక ప్రకారం 50 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుల సొమ్ము అందకపోవడంతో విద్యుత్ అధికారులు బకాయిల వసూలుకు రంగంలోకి దిగారు. గ్రామీణ ప్రాంతాలకే ఈ పథకం పరిమితమవుతుందని, పట్టణాల్లోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు పాత పద్ధతిలో కరెంటు బిల్లులు చెల్లించక తప్పదని అధికారులు చెబుతున్నారు.
నెలవారీ 50 కంటే ఒక్క యూనిట్ అధికంగా నమోదైనా మొత్తం బిల్లు చెల్లించవలసి ఉంటుందని కూడా పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జిల్లాలో ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు, విద్యుత్, రెవెన్యూ అధికారులు బకాయిలున్న వినియోగదారుల సర్వీసులను నిలిపివేస్తున్నారు. గత పాలకులు చెప్పిన మాటలు నమ్మి కరెంటు బిల్లులు చెల్లించలేదని, ఇప్పుడు పెద్ద మొత్తంలో బకాయి చెల్లించడం తమకు సాధ్యపడదని పలువురు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారు వాపోతున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద ప్రభుత్వం నుంచి ఇంతవరకు రూ.5 కోట్ల బకాయిలు రావలసి ఉందని విజయవాడ సర్కిల్ గణాంకాధికారి సత్యనారాయణ తెలిపారు.