ఎప్పటికప్పుడు షాకిద్దాం | Electricity tariff to be revised time to time | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడు షాకిద్దాం

Published Fri, Nov 8 2013 1:50 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM

ఎప్పటికప్పుడు షాకిద్దాం - Sakshi

ఎప్పటికప్పుడు షాకిద్దాం

ఎప్పటికప్పుడు విద్యుత్ సర్దుబాటు చార్జీల మోత మోగించేందుకు సర్కారు సిద్ధమవుతోంది.

తెరపైకి కొత్త విద్యుత్ సర్దుబాటు చార్జీల విధానం
ఈఆర్‌సీ అనుమతీ అవసరం లేదు
విద్యుత్ పంపిణీ సంస్థలకే సర్వాధికారాలు
3 నెలలకోసారి ఎడాపెడా చార్జీల వడ్డనకు మార్గం సుగమం
2014 ఏప్రిల్ నుంచి అమలుకు సర్కారు సిద్ధం
ప్రజలపై భారం తప్పదంటున్న విద్యుత్‌రంగ నిపుణులు
 
సాక్షి, హైదరాబాద్:
ఎప్పటికప్పుడు విద్యుత్ సర్దుబాటు చార్జీల మోత మోగించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇందుకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకే (డిస్కంలు) సర్దుబాటు చార్జీలకు సంబంధించిన సర్వాధికారాలు కట్టబెట్టనుంది. తాజా విధానం వినియోగదారులపై అధిక భారం మోపేందుకే దోహదపడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి.. ఎలాంటి జాప్యం జరగకుండా త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రజల నుంచి విద్యుత్ సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఎస్‌ఏ) వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త సర్దుబాటు చార్జీల విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఇంధనశాఖ వర్గాలు వెల్లడించాయి. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఆ మూడు నెలల్లో విద్యుత్ ఉత్పత్తికి అయిన అదనపు వ్యయాన్ని ఎఫ్‌ఎస్‌ఏ రూపంలో డిస్కంలు వసూలు చేస్తాయన్నమాట. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలకు ముందు సర్దుబాటు చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ మళ్లీ సర్దుబాటు చార్జీలు బాదేందుకు సిద్ధం అవుతుండటాన్ని బట్టి.. రద్దు ప్రకటనను కేవలం 2013-14 ఆర్థిక సంవత్సరానికే సర్కారు పరిమితం చేయనుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి యధావిధిగా ఎప్పటికప్పుడు సర్దుబాటు చార్జీల మోత మోగనుంది.
 
 రద్దు ప్రకటనతో మభ్యపెట్టిన ప్రభుత్వం
 ఇంధన సరఫరాలో వ్యత్యాసాల వల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే హైడల్ (జల) విద్యుత్ తగ్గి.. బొగ్గు, గ్యాసు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరిగితే విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. దీనితో పాటు దేశీయ బొగ్గు అందుబాటులో లేని కారణంగా అధిక ధరకు విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్న ఫలితంగా కూడా విద్యుత్ ఉత్పత్తికి అదనపు వ్యయం అవుతుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి అయిన అదనపు ఖర్చును వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) పేరిట ప్రభుత్వం వసూలు చేస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ మేరకు గృహ వినియోగదారులపై పడే భారాన్ని ప్రభుత్వమే భరించేది. ఆయన మరణానంతరం ప్రభుత్వం క్రమం తప్పకుండా సర్దుబాటు షాకులిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు మాత్రం 2013-14 ఆర్థిక సంవత్సరానికి సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు కొత్త సర్దుబాటు చార్జీల విధానాన్ని తెరమీదకు తెస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 ఇప్పుడిక డిస్కంల ఇష్టారాజ్యం
  సర్దుబాటు చార్జీలు ఎప్పుడు వసూలు చేయాలన్నా డిస్కంలు నెలరోజుల ముందే ఈఆర్‌సీకి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్‌సీ ప్రజల నుంచి అభిప్రాయాలను బహిరంగ విచారణ ద్వారా సేకరిస్తుంది. తగు కసరత్తు అనంతరమే తుది ఆదేశాలను జారీచేస్తుంది. ఆ మేరకే డిస్కంలు వినియోగదారుల నుంచి చార్జీలను వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే ఈఆర్‌సీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంధన ధరల్లో వ్యత్యాసాలను డిస్కంలే లెక్కిస్తాయి. ఈ లెక్కల ఆధారంగా యూనిట్‌పై పడే అదనపు భారాన్ని మూడు నెలలు ముగిసిన వెంటనే వినియోగదారుల నుంచి వసూలు చేసేస్తాయన్న మాట. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఈఆర్‌సీ ఈ వ్యవహారాన్ని పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేస్తుందని ఇంధనశాఖ వర్గాలు వివరిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుత విధానంలో డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్‌సీ యధాతథంగా అనుమతించడం లేదు. ఉదాహరణకు 2009-10, 2010-11 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.8 వేల కోట్ల సర్దుబాటు చార్జీలను డిస్కంలు ప్రతిపాదిస్తే... ఈఆర్‌సీ రూ.6 వేల కోట్లకే అనుమతించింది. అంటే రూ.2 వేల కోట్ల సర్దుబాటు చార్జీలను డిస్కంలు అధికంగా లెక్కించాయన్నమాట. ఈఆర్‌సీ కోత వల్ల ఆ మేరకు వినియోగదారులపై భారం తప్పిపోయిందన్న మాట. ప్రస్తుత విధానంలో ముందుగా ఈఆర్‌సీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో డిస్కంలు యధేచ్చగా వినియోగదారులపై చార్జీలు మోపే ప్రమాదం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత తీరిగ్గా ఈఆర్‌సీ తక్కువ మొత్తానికి ఆదేశాలు ఇచ్చినా.. అప్పటికే వినియోగదారుల నుంచి వసూలు చేసేసి ఉండటంతో.. అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులకు వెనక్కి ఇవ్వాలని ఈఆర్‌సీ ఆదేశించే అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలు, కుటీర పరిశ్రమలను సర్దుబాటు చార్జీల నుంచి పూర్తిగా మినహాయించాలని విద్యుత్‌రంగ నిపుణులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement