నెల్లూరు (రవాణా): ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు పెంచిన విద్యుత్ చార్జీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజలపై రాష్ట్రప్రభుత్వం మరోమారు భారం మోపింది. నెలకు 200 యూనిట్లపైన వాడే వినియోగదారులపై 5 శాతం చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మధ్యతరగతికి చెందిన వారిపై భారం పడింది. ఇప్పటికే గ్యాస్, రేషన్, పింఛన్ తదితర లబ్ధిదారులను భారీగా కుదించారు. మరోవైపు నిత్యావరసర ధరలు చుక్కలంటుతున్నాయి. తాజాగా పెంచిన విద్యుత్ చార్జీలతో జిల్లాపై సుమారు రూ.7 కోట్ల భారం పడనుంది. అలాగే ప్రజలపై పరోక్షంగా మరికొంత భారం పడనుంది. వ్యాపారులు పెరిగిన విద్యుత్‌చార్జీల భారాన్ని వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది.
రోజుకు 99 లక్షల యూనిట్ల వినియోగం
జిల్లాలో మొత్తం 11,86,838 మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో గృహ అవసరాలనకు 9,06,973, వాణిజ్య అవసరాలకు 73,992, పరిశ్రమలకు 42,112, వ్యవసాయానికి 1,45,000, వీధిదీపాలు 7,119, తాగునీటి అవసరాలకు 3,330, భారీ పరిశ్రమలు 495తో కలిపి ఇతర అవసరాలకు 7,943 సర్వీసులున్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో రోజుకు ప్రస్తుతం 99 లక్షల యూనిట్లు విద్యుత్ వినియోగం జరుగుతుంది. దీని ద్వారా విద్యుత్‌శాఖకు నెలకు రూ.114 కోట్లు రెవెన్యూ వస్తోంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 200 యూనిట్లపైన వాడే వినియోగదారులు 1.25 లక్షలమంది ఉన్నట్లు సమాచారం. అయితే 0-200 వరకు వినియోగం ఉన్న వారిపై ఎలాంటి చార్జీలు పెంచలేదు. వ్యవసాయం, కుటీర, చక్కెర, ఫౌల్ట్రీ తదితర పరిశ్రమలను చార్జీల పెంపు నుంచి మినహాయించారు.
ప్రజలపై పరోక్ష భారం
చార్జీలు పెంపు నిర్ణయంతో జిల్లా ప్రజలపై సుమారు నెలకు రూ.7కోట్లు భారం పడనుంది. అధికారులు లెక్కలు ప్రకారం నెలకు 201 నుంచి 300 వరకు యూనిట్లు వినియోగించేవారు 61,943 మంది, 301 నుంచి 400 వరకు 29,646 మంది, 401 నుంచి 500 వరకు 15,638 మంది, 500 పైబడి 35,499 మంది వినియోగదారులు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం లోటెన్షన్ విభాగంలో రూ.9.98 కోట్లు, పరిశ్రమల నుంచి రూ.17.91 కోట్లు, హెచ్‌టీ విభాగంలోని పరిశ్రమల నుంచి రూ.44.24 కోట్లు, వాణిజ్య సర్వీసులనుంచి రూ. 7.71 కోట్లు రెవెన్యూ వస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ సర్వీసులకు చెందిన వినియోగదారులపై అదనపు భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఆయా రంగాలకు చెందిన వస్తువులు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రజలపై పరోక్షంగా భారం పడనుంది.
అధికారికంగా సమాచారం లేదు.
విద్యుత్ చార్జీల పెంపు విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. సమాచారం వచ్చిన వెంటనే తెలియజేస్తాం.
- నాగశయనరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
ప్రభుత్వం పెంచిన చార్జీలు
యూనిట్లు పాత కొత్త
201 -300 వరకు (యూనిట్‌కు) రూ. 6.38 6.70
301 - 400 వరకు రూ. 7.38 7.75
401 - 500 వరకు రూ. 7.88 8.27
500 పైన రూ. 8.38 8.80లు