రైతు పంట ఉత్పత్తుల అమ్మకాల్లో దళారుల చేతిలో దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో చేపట్టిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ పనులు పూర్తయ్యాయి.
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్:
రైతు పంట ఉత్పత్తుల అమ్మకాల్లో దళారుల చేతిలో దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో చేపట్టిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ పనులు పూర్తయ్యాయి. పంట ఉత్పత్తుల అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని, రైతు మార్కెట్‌లో అక్రమార్కులు చేతిలో నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో మోడల్‌గా ఆరు మార్కెట్‌లలో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వీటిలో ఖమ్మం, వరంగల్, కేసముద్రం, నిజామాబాద్, మిర్యాలగూడెం, గుంటూరు వ్యవసాయ మార్కెట్‌లు ఉన్నాయి. అయితే వీటిలో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ పనులు పూర్తి చేసుకున్నది ఖమ్మం వ్యవసాయ మార్కెటేనని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత మార్చి నెలలో ప్రభుత్వం ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, పనుల పర్యవేక్షణ బాధ్యతలను ముంబైకి చెందిన ఎన్‌సీడీఈఎక్స్(నేషనల్ కమాడిటివ్స్ అండ్ డెరివేటివ్స్ ఎక్చేంజ్) అనే సంస్థకు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పడిన కమిటీ నిర్ణయించిన విధంగా పత్తి మార్కెట్ యార్డ్‌లోని రైతు సమాచార కేంద్రంలో రెండు హాళ్లను ఆధునికీకరించారు.
ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌కు అవసరమైన అన్ని రకాల పరికరాలను కొనుగోలు చేసి ఆయా గదుల్లో ఏర్పాటు చేశారు. 25 కంప్యూటర్లను, 10సీసీ కెమెరాలను అమర్చారు. మూడు సెక్యూరిటీ గార్డు రూములు నిర్మించారు. మార్కెట్ ఉద్యోగులకు కంప్యూటర్ శిక్షణను కూడా ఇప్చించారు. మరో ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మొత్తానికి దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేశా రు. మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వటంతో మన రాష్ర్టంలో కూడా అమలు చేసేందుకు మోడల్‌గా ఆరు మార్కెట్‌లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆరింటిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసింది. తూకాల్లో జరిగే మోసాలను అరికట్టేందుకు కాంటాలను కంప్యూటర్లకు అనుసంధానం చేసే విధంగా ప్రాజెక్టును రూపొందించారు. పత్తి సీజన్ ప్రారంభంలోగా ఎలక్ట్రానిక్ బిడ్డింగా విధానం ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ చెర్మైన్ మానుకొండ రాధాకిషోర్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావిద్ తెలిపారు.