రామకుప్పం : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని పెద్దూరు, రామాపురం తండా, ఎస్.గొల్లపల్లి గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి పొలాల్లోకి ప్రవేశించి పంటలపై దాడి చేశాయి. టమాట, సోయాబీన్స్, అరటి పంటలకు సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అడవిలో తినడానికి ఆహారం, తాగడానికి నీరు దొరక్కపోవడంతో ఏనుగుల గుంపు రామకుప్పం మండలంలో నిత్యం ఎక్కడో చోట దాడులకు దిగుతూనే ఉంది. దీంతో గ్రామస్తులకు రాత్రిపూట నిద్ర కరువైంది. పొలాలకు రక్షణగా కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.