ramakuppam
-
శుభ కార్యానికి వెళ్లి వస్తుండగా..
సాక్షి,రామకుప్పం( చిత్తూరు): శుభ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా టాటాఏస్ బోల్తా పడి ఆరుగురు గాయపడిన ఘటన బుధవారం రామకుప్పం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటశివకుమార్ కథనం.. దేవరాజపురానికి చెందిన పలువురు కుప్పం మండలం చందం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు టాటాఏస్ వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆరివనుపెంట వద్ద టాటాఏస్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దేవగి(62), జగన్నాథ్ (52), కనగ(45), కోమది(45), ప్రశాంత్(14), రాహుల్ (12) తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ వెంకటశివకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని 108లో క్షతగాత్రులను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. జగన్నాథ్, కోమది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పావని మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, చిత్తూరు: వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతి పావని కేసు విషాదాంతమైంది. ఓ వ్యవసాయ బావిలో మంగళవారం ఆమె మృతదేహం లభ్యమైంది. రామకుప్పం (మ) మునింద్రంకు చెందిన పావని వారం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. కాగా, పావని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె స్నేహితుడు మునిరత్నమే పావనిని హత్య చేశాడని ఆరోపిస్తూ అతని ఇంటిపై దాడి చేశారు. అయితే, వారు దాడికి దిగిన సమయంలో పరారీలో ఉన్న నిందితుడు మునిరత్నం ముణేంద్రం సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
వైఎస్సార్ సీపీలోకి 100 మంది టీడీపీ నాయకులు
రామకుప్పం : ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైఎస్సార్ సీపీలో చేరవచ్చునని ఆ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన సభలో ఆయన ఈమేరకు ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం వీర్నమల పంచాయతీ వేమనపల్లెకి చెందిన దాదాపు 100 మంది యువకులు తెలుగుదేశం నుంచి చంద్రమౌళి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వీర్నమల గ్రామంలో పార్టీ జెండాను చంద్రమౌళి ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వీర్నమల పంచాయతీని 4 చిన్న పంచాయతీలు గా విభజించి అభివృద్ధి జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేయాలి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంను వదిలి తన స్వంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి పోటీ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవీ డిమాండ్ చేశారు. ఆదివారం వీర్నమలలో జరిగిన సభకు మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి జీవితం అబద్ధాల పుట్టని విమర్శించారు. స్వంత నియోజక వర్గంలో గెలవలేకనే కుప్పం ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, బాబురెడ్డి, రవి నాయక్, చిన్నరాజు నాయక్, మోహన్ నాయక్, భాస్కర్ నాయక్, కుమార్, గోవిందప్ప, నారాయణస్వామి, బరకత్, రామేగౌడు, మునెమ్మ, ఇంద్రప్ప, మునెప్ప, గంగయ్య, సిద్ధప్ప, మురళి, అప్పి తదితరులు పాల్గొన్నారు. -
రామకుప్పంలో ఏనుగుల బీభత్సం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని లింగాపురం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం ఉదయం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు స్థానిక ఇళ్లపై దాడి చేశాయి. అనంతరం పక్కనే ఉన్న పొలాల్లో దిగి పంటలను నాశనం చేశాయి. అయితే గత కొన్నేళ్లుగా ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయని, చేతికందిన పంటలను నాశనం చేస్తున్నాయిని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారమిచ్చినా తాత్కాలిక పరిష్కారంతో సరిపెడుతున్నారని మండిపడుతున్నారు. ఏగుగుల దాడితో ప్రాణనష్టం జరుగుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
నన్యాలలో జల్లికట్టు.. ఒకరు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండలం నన్యాలలో జరగుతున్న జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ఎద్దు ఒకటి జనంలోకి వచ్చి కుమ్మడంతో కుప్పంలోని చందం ఎస్ సీ కాలనీకి చెందిన గుణశేఖర్(22) మృతిచెందారు. గుణశేఖర్ జల్లికట్టు వీక్షించడానికి చందం ఎస్సీకాలనీ నుంచి నన్యాల వచ్చారు. -
ప్రేమ మత్తులో ఆ తల్లి ఎంత పని చేసింది..!
రామకుప్పం(చిత్తూరు): కామంతో కళ్ళు మూసుకు పోయి ఓ తల్లి కన్న బిడ్డలనే హతమార్చింది. ఆమెను, ప్రియుడిని పోలీసులు కటకటాల పాలు చేసిన సంఘటన మండలంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలివి.. కవ్వంపల్లె గ్రామానికి చెందిన వివాహిత పవిత్ర భర్త ఉన్నా కూడా మరో యువకుడితో వివాహేతర సంబంధం సాగించింది. అంతటితో ఆగకుంగా ప్రియుడితో కలిసి పరారైంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పవిత్రను వెతికి పట్టుకొని ప్రియుడు వేమన్నకు పోలీసులు తమదైన శైలీలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఆమె ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. రహస్యంగా ప్రియుడితో కలుస్తూ వచ్చింది. అతడి సలహాతో తన ఇద్దరు బిడ్డలను ఇంట్లో ఉరివేసి చంపేసి ప్రియుడి వద్దకు పారిపోయింది. కుటుంబీకులు బిడ్డలను చంపి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పవిత్ర ప్రియుడు వేమన్న కోసం బిడ్డలను తానే చంపానని విచారణలో ఒప్పుకుంది. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
ఏనుగుల దాడుల నివారణకు పటిష్ట చర్యలు
– 95 శాతం రక్షణ చర్యలు పూర్తి – నష్టపరిహారం త్వరలో అందిస్తాం – డీఎఫ్‌వో చక్రపాణి చిత్తూరు(కార్పొరేషన్) : కుప్పం, రామకుప్పం ప్రాంతాల్లో ఏనుగుల దాడులు అధికంగా ఉన్నాయనీ, వాటి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెస్ట్ డీఎఫ్‌వో చక్రపాణి తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎలిఫెంట్ ఫ్రూఫ్ ట్రెంచ్ 201 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 118 ఆర్సీసీ పిల్లరు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో 58 నిర్మాణం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 60 నిర్మాణ దశలో ఉన్నట్టు చెప్పారు. అక్టోబరులో వాటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. గజరాజుల దాడుల్లో వందలాది ఏకరాలు పంట నష్టపోయిన రైతులకు రూ.14 లక్షలు పరిహార నివేదిక కలెక్టర్‌కు పంపించామన్నారు. ఆయన అనుమతి జారీచేస్తే బాధితులకు పరిహారం అందజేస్తామన్నారు. ఈ వర్షాకాల సీజన్లో మొత్తం 320 హెక్టార్లలో ఆరు లక్షల మొక్కల పెంపకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ 77 వాహనాల అంచనా విలువ రవాణా అధికారులు వేసిన వెంటనే బహిరంగ వేలం నిర్వహించి విక్రయిస్తామని తెలిపారు. -
రామకుప్పంలో ఏనుగుల బీభత్సం
రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్.గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామ శివారులోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు మిర్చీ, టమాట పంటను తొక్కి నాశనం చేస్తున్నాయి. ఇది గమనించిన గ్రామస్థులు బాణాసంచా కాలుస్తూ ఏనుగులను తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తమ పంటలు పాడవుతుండటం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని గ్రామాలైన పల్లికుప్పం, రామానాయక్ తండాలోని పంటపొలాలపై ఏనుగులు ముకుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో అరటి, బీన్స్, టమెట పంటలు పూర్తిగా ధ్వంసమైనాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల దాడిపై రైతులు సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. -
నీటితొట్టెలో తల్లీకూతుళ్ల మృతదేహాలు
రామకుప్పం (చిత్తూరు జిల్లా) : రామకుప్పం మండలం కొంగనపల్లి గ్రామంలో తల్లీకూతుళ్లు నీటి తొట్టెలో శవాలై తేలారు. వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన సరస్వతి, ఆమె కుమార్తె పవిత్ర (13)లు పొలాల్లోని నీటితొట్టెలోనిర్జీవులై ఉండగా కొందరు రైతులు శనివారం మధ్యాహ్నం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సరస్వతి భర్త రామకృష్ణప్ప ఆచూకీ లేకుండాపోవడంతో గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై దాడి
రామకుప్పం: తమ దందాకు అడ్డువస్తున్నాడనే అక్కసుతో వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెరియప్ప పొలానికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆయన కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పరారయ్యారు. అయితే, దాడికి పాల్పడిన వ్యక్తి సెల్‌ఫోన్ స్థానికులకు లభించింది. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, నిందితుని ఫోన్‌ను కూడా అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులపై చర్య తీసుకోవాలని..
రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లేపల్లి సమీపంలో ఆదివారం వేకువజామున విజయకుమార్ అనే వ్యక్తి మరణానికి కారణమైన పోలీసులపై చర్యతీసుకోవాలని డిమాండ్ చేస్తూ జల్దిగానిపల్లి గ్రామస్తులు ఆదివారం మధ్యాహ్నం రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జల్దిగానిపల్లికి చెందిన విజయకుమార్ షామియానాలు, వంటపాత్రల సప్లయర్ షాపు నడిపేవాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పొరుగూరికి పోయి స్నేహితుడి ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనుకనుంచి రామకుప్పం పోలీసులు వెంబడించి వెనుక కూర్చున్న విజయకుమార్ చొక్కా పట్టి లాగారు. దాంతో కిందపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం నడుపుతున్న వ్యక్తికీ గాయాలయ్యాయి. తమ కారణంగా వ్యక్తి చనిపోయినా పోలీసులు ఆగకుండా వెళ్లిపోయారు. ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులందరూ చేరి జాతీయరహదారిపై బైఠాయించారు. విజయకుమార్ మృతికి కారణమైన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన రామకుప్పం సీఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి బయలుదేరారు. గ్రామస్తుల ఆందోళనతో నాలుగు కిలోమీటర్లమేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
ఆటోమొబైల్ షాపు దగ్ధం
రామకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా రామకుప్పంలోని బజారువీధిలో ఉన్న కార్తీక్ ఆటో మొబైల్ షాపు ఆదివారం ఉదయం దగ్ధమైంది. తమిళనాడుకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఈ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దుకాణంలో నుంచి మంటలు, పొగలు రావడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోగానే దుకాణం కాలిబూడిదైంది. దాదాపు లక్ష రూపాయల మేర నష్టం వాటినల్లినట్లు యజమాని కార్తీక్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్లే అగ్నిప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. -
భారీవర్షాలకు రెండిళ్లు ధ్వంసం: చెరువుకు గండి
రామకుప్పం (చిత్తూరు జిల్లా) : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా రామకుప్పం, ముద్దనపల్లె గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం రెండు ఇళ్లు కూలిపోయాయి. రామకుప్పంలో ఒక ఇల్లు ధ్వంసం కాగా, ముద్దనపల్లెలో మరో ఇల్లు కూలిపోయింది. అలాగే ఎస్.గొల్లపల్లె చెరువుకు గండి పడింది. గ్రామస్తులు ఇసుక బస్తాలను వేసినా ప్రయోజనం లేకపోయింది. చెరువులో నీళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. -
లాటరీల పేరుతో మోసం: ముఠా అరెస్ట్
రామకుప్పం(చిత్తూరు): లాటరీల పేరుతో మోసం చేస్తున్న ముఠాను పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు బృందంగా ఏర్పడి లాటరీల పేరుతో రామకుప్పం మండలంలో 500 మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. అయితే లాటరీలు మాత్రం బినామీలకే దక్కుతున్నాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
3.5టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
రామకుప్పం (చిత్తూరు) : అనుమతులు లేకుండా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడు నుంచి ఆదివారం ఉదయం 3.5 టన్నుల బియ్యాన్ని లారీలో తరలించేందుకు సిద్ధమవ్వగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు పరారయ్యారు. అధికార పార్టీ నేతల అండతోనే ఈ తంతు కొనసాగుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. -
బావిలో పడ్డ ఏనుగు పిల్ల
-
బావిలో పడ్డ ఏనుగు పిల్ల : ఏనుగుల బీభత్సం
రామకుప్పం (చిత్తూరు జిల్లా) : మందతో వెళ్తున్న ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు నీరు లేని బావిలో పడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిక్కపల్లితండా గ్రామంలో ఆదివారం వేకువజామున జరిగింది. వివరాల ప్రకారం.. చిక్కపల్లితండా గ్రామంలోకి వేకువజామున ఏనుగులు ప్రవేశించాయి. అయితే అవి మందగా వెళ్తుండగా ఏడాది వయసున్న ఓ ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు నీళ్లు లేని బావిలో పడింది. దీంతో మిగిలిన ఏనుగులు ఘీంకారం చేస్తూ ఆ ప్రాంతంలోని పంట పొలాల్లో బీభత్సం సృష్టించాయి. దీంతో వేరుశనగ, వరి, టమాటా పంటలు నాశనమయ్యాయి. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఏనుగులను అడవిలోకి పంపించారు. అనంతరం బావిలో ఉన్న ఏనుగు పిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
5 టన్నుల బియ్యం పట్టివేత
రామకుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లాలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన ఐదు టన్నులు బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలోని రామకుప్పం మండల పరిధిలోని అట్టికుప్పం గ్రామంలో ఓ వ్యక్తి తమిళనాడులో ఉచితంగా పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని కొని తన ఇంట్లో నిల్వ చేశాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాడి చేసి యాజమానిపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని సీజ్ చేశారు. -
రామకుప్పంలో ఏనుగుల భీభత్సం
రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. గుట్టూరుతండాకు చెందిన ఒక రైతు ఏనుగుల దాడిలో గాయపడ్డాడు. తండాకు చెందిన గోపాల్‌నాయక్ మంగళవారం రాత్రి వేరుశెనగ చేనుకు కాపలాగా వెళ్లగా ఏనుగుల గుంపు పంటను ధ్వంసం చేసింది. అదే క్రమంలో అక్కడున్న గోపాల్‌నాయక్ పై దాడి చేసిన ఏనుగు తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని కుప్పం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఏనుగుల గుంపు గ్రామానికి పొరుగునే ఉన్న పందేలమడుగు, గొల్లపల్లి గ్రామాల రైతులు సాగు చేసిన టమాటా, వరి, చెరుకు పంటలను ధ్వంసం చేశాయి. గత నెల రోజులుగా రాత్రి వేళల్లో ఈ గ్రామాలపై ఏనుగులు విరుచుకుపడుతున్నాయి. వాటి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇటుకల ట్రాక్టర్ బోల్తా : కూలీ మృతి
రామకుప్పం (చిత్తూరు) : సిమెంటు ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మండలంలోని శాంతిపురం నుంచి వీర్నమల గ్రామం వైపు వెళ్తున్న సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ వీర్నమల వద్ద బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కూలీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
రామకుప్పం మండలంలో గజరాజుల బీభత్సం
రామకుప్పం : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని పెద్దూరు, రామాపురం తండా, ఎస్.గొల్లపల్లి గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి పొలాల్లోకి ప్రవేశించి పంటలపై దాడి చేశాయి. టమాట, సోయాబీన్స్, అరటి పంటలకు సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అడవిలో తినడానికి ఆహారం, తాగడానికి నీరు దొరక్కపోవడంతో ఏనుగుల గుంపు రామకుప్పం మండలంలో నిత్యం ఎక్కడో చోట దాడులకు దిగుతూనే ఉంది. దీంతో గ్రామస్తులకు రాత్రిపూట నిద్ర కరువైంది. పొలాలకు రక్షణగా కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. మండలంలోని ఎద్దులగడ్డ, గోవిందరాజపురం గ్రామాల్లోని పొలాల్లోకి గురువారం అర్ధరాత్రి 15 ఏనుగులు ప్రవేశించి బీభత్సం సృష్టించాయి. దీంతో భారీ మొత్తంలో పంట నష్టం సంభవించింది. ఈ హఠాత్పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. -
ఖాళీ ఖజానా - ముళ్ల కిరీటం : చంద్రబాబు
చిత్తూరు: సీఎం పదవి పూల కిరీటం కాదని, ముళ్ల కిరీటం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఖాళీ ఖజానా ఇచ్చారు, జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవని వాపోతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం మీ ఆశీస్సులు కావాలని ప్రజలను కోరారు. రామకుప్పంలో ఈరోజు చంద్రబాబు పలు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. బోరులు ఎండిపోయాయని చెప్పారు. నీరు-మీరు లాంటి పనులు ద్వారా భూగర్భ నీటిమట్టాన్ని పెంచుతామన్నారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. -
ఎస్ఐపై తెలుగు తమ్ముళ్లు రాళ్ల దాడి
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగ సముద్రంలో ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు బుధవారం రాళ్లదాడికి దిగారు. ఆ ఘటనలో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని కుప్పంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలింగ్ బూత్ వద్ద ప్రలోభ పెడుతున్న టీడీపీ కార్యకర్తలను ఎస్ఐ అడ్డుకున్నారు. దాంతో సదరు కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ ఎస్ఐపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఎస్ఐ సునీల్ కుమార్‌పై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఆయన్ని హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐపై దాడిని పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.