రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లేపల్లి సమీపంలో ఆదివారం వేకువజామున విజయకుమార్ అనే వ్యక్తి మరణానికి కారణమైన పోలీసులపై చర్యతీసుకోవాలని డిమాండ్ చేస్తూ జల్దిగానిపల్లి గ్రామస్తులు ఆదివారం మధ్యాహ్నం రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జల్దిగానిపల్లికి చెందిన విజయకుమార్ షామియానాలు, వంటపాత్రల సప్లయర్ షాపు నడిపేవాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పొరుగూరికి పోయి స్నేహితుడి ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనుకనుంచి రామకుప్పం పోలీసులు వెంబడించి వెనుక కూర్చున్న విజయకుమార్ చొక్కా పట్టి లాగారు. దాంతో కిందపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం నడుపుతున్న వ్యక్తికీ గాయాలయ్యాయి. తమ కారణంగా వ్యక్తి చనిపోయినా పోలీసులు ఆగకుండా వెళ్లిపోయారు.
ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులందరూ చేరి జాతీయరహదారిపై బైఠాయించారు. విజయకుమార్ మృతికి కారణమైన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన రామకుప్పం సీఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి బయలుదేరారు. గ్రామస్తుల ఆందోళనతో నాలుగు కిలోమీటర్లమేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.