‘అర్హత’ ఎంత మందికో? | 'Eligible' How mandiko? | Sakshi
Sakshi News home page

‘అర్హత’ ఎంత మందికో?

Published Sat, Jul 12 2014 12:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

'Eligible' How mandiko?

  •      మళ్లీ రుణం కార్డుల పంపిణీ హడావుడి
  •      స్పష్టంగా తేలని కౌలు రౌతుల సంఖ్య
  •      క్షేత్రస్థాయిలో పరిశీలనలో లోపాలు
  •      ఏటా అన్యాయమైపోతున్న అర్హులు
  • అనకాపల్లి : జిల్లాలో మళ్లీ కౌలు రైతుల మాట వినిపిస్తోంది. వీరికి రుణ అర్హత కార్డులు మంజూరు చేసేందుకు అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించాక అర్హులకు కార్డులు మంజూరు చేస్తారు. చెప్పుకోవడానికి ఇదంతా బాగున్నా వాస్తవంగా కౌలు రైతులకు కార్డులు దక్కుతున్నాయా? అసలు ఎవరు కౌలు రైతు అని నిర్థారించే యంత్రాంగం మనకు ఉందా? అంటే సమాధానం కరువవుతుంది.

    జిల్లాలో 2.96 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఏటా 2.16 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తుంటారు. అది కూడా ఖరీఫ్‌లోనే. రబీలో 40 వేల హెక్టార్లలోపే పంట సాగవుతుంది. భూస్వామ్య, సన్న, చిన్నకారు, కౌలు రైతులు ఆరుగాలం శ్రమిస్తేనే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయంలో కౌలు రైతులు, రైతు కూలీల పాత్ర అత్యంత కీలకం. కూలీలు రోజూ వేతనంపై పనిచేస్తారు కావున వారికి లాభనష్టాలతో పనిలేదు. ఇక మిగిలింది కౌలు రైతులే. వీరి పరిస్థితే దీనాతిదీనం.

    సెంటు భూమిలేకపోయినా వ్యవసాయమే జీవనాధారం కావడంతో యజమానుల నుంచి భూమి కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు. వీరి సంఖ్యపై సరియైన గణాం కాలు లేవు. అసలు భూ యజమానులెంతంటే కూడా లెక్కల్లేవు. కాకిలెక్కల మేరకు జిల్లాలో లక్ష మంది వ్యవసాయం చేసేవారున్నారని అంచనా. వీరిలో 30 వేల మంది కౌలురైతులంట. కానీ గత ఏడాది 3,143 మందికే రుణ అర్హత కార్డులు పంపిణీ చేశారు.

    ఈ సంఖ్య వాస్తవమైతే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? కౌలు రైతుకు రుణ అర్హత కార్డు ఇవ్వాలంటే యజమాని అనుమతితోపాటు భూమిపై ఎటువంటి రుణం ఉండకూడదు. రుణమాఫీ వంటి పథకం పొందాలంటే రుణ అర్హత కార్డులోనైనా కౌలు రైతు పేరుండాలి.

    రుణాలు తీసుకున్న నిజమైన రైతులకే మాఫీపై ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఏ ఆధారంలేని కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? అంటే సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో నిజమైన కౌలు రైతులు ఎంతమందికి కార్డులందుతాయన్నది అనుమానమే. గతంలో తుఫాన్లు, భారీ వర్షాలు సంభవించినప్పుడు పరిహారం పంపిణీలో ఎన్నోలోపాలు వెలుగు చూశాయి. ఎంతోమంది కౌలు రైతులకు న్యాయం జరగలేదు.

    ఈ పరిస్థితుల్లో రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయంతో క్షేత్ర స్థాయిలో సాగుచేసే భూయజమానులు, కౌలు రైతులను గుర్తించేందుకు స్పష్టమైన యంత్రాం గం ఉంటేనే ప్రభుత్వ పథకాల వల్ల అర్హులకు న్యాయం జరుగుతుంది. రాజకీయ సిఫారసులు, సిబ్బంది కొరత నేపథ్యంలో కౌలు అధీకృత చట్టం లక్ష్యాలు నెరవేరాలంటే ఎటువంటి ఒత్తిడులకు లొంగని ప్రభుత్వ యంత్రాంగం ఉండాలి. అప్పుడే నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు ఓదార్పు లభిస్తుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement