అయ్యో బిడ్డా..ఎల్లిపోతివా... ఎంత పనైందమ్మా.. ఏమైందమ్మా నీకు... మమ్మల్ని వదిలి ఎలా ఎల్లిపోతివమ్మా... ఆ ట్రాక్టర్ నిన్నే కొట్టాల్నా.. అంటూ ఓ మాతృమూర్తి ‘తల్లి’డిల్లిపోయింది. ‘ఆరుబయట’కు వెళ్లిన చిన్నారిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. బతికుండగా తమ చిన్నారి చేసిన ముద్దు ముద్దు మాటలను తల్చుకుని ఆ చిన్నారి తల్లి ఏడ్చిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది.
- గూడూరు
గూడూరు దళితవాడకు చెందిన బెక్కం జ్యోతి, రాజు దంపతుల ముద్దుల కుమార్తె సుకన్య(4) రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడింది. శనివారం ఇంటి ముందు ‘ఆరుబయట’కు వెళ్లిన సందర్భంలో సమీపంలోని మురుగు కాలువలో నుంచి ఓ పంది పరిగెత్తుకు రావడం చూసిన సుకన్య భయంతో పరుగులు తీసింది. అదే సమయంలో ఆర్.ఖానాపురం వైపు నుంచి గూడూరుకు వచ్చిన ట్రాక్టర్ ఆమెను ఢీకొంది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.
ఏడుపులు.. పెడబొబ్బలతో...
ట్రాక్టర్ ఢీకొని తమ కుమార్తె మరణించిందన్న సమాచారం అందిన వెంటనే జ్యోతి, రాజు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. అక్కడ రక్తపు మడుగులో విగతజీవిగా మారిన చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. అప్పటి వరకు తమ ఇంట్లో ముద్దుముద్దు మాటలతో అందరినీ నవ్వించిన తమ కంటిదీపం ఇలా ఆరిపోవడంతో జ్యోతి కన్నీరుమున్నీరైన తీరు కఠిన హృదయాలను సైతం కరిగించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలిని ఎస్‌ఐ సునీల్‌కుమార్ తమ సిబ్బందితో కలసి సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎల్లిపోతివా బిడ్డా..
Published Sun, Nov 23 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement