- టీఎన్జీజీవో కార్యవర్గ సమావేశం తీర్మానం
- 2న ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి ప్రతిపాదించిన 11 తీర్మానాలను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాష్ర్ట విభజన ప్రక్రియ జరుగుతున్నా.. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను వెల్లడించకపోవడంపై సమావేశం నిరసన వ్యక్తం చేసింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించడానికి తాత్కాలిక జాబితాను రూపొందిస్తే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. సమావేశంలో కేంద్ర సంఘం నాయకులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
సమావేశం చేసిన తీర్మానాలివీ...
- ఎన్నికల్లో ఉద్యోగుల పాత్రకు అభినందనలు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల వేతనం ప్రోత్సాహకంగా ఇవ్వాలి.
- స్థానికత ఆధారంగానే గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం దాకా ఉద్యోగుల విభజన జరగాలి. రాష్ట్ర, జోనల్ స్థాయిలో పనిచేస్తున్నవారిని ఆంధ్రప్రదేశ్‌కు పంపాలి.
- జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలి. అమరవీరులకు నివాళులు అర్పించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి, కొత్తరాష్ట్రంలో విధులకు హాజరుకావాలి.
- స్థానికత పేరుమీద తప్పుడు ధ్రువపత్రాలను సమర్పిస్తున్నవారిపై సమగ్ర పరిశీలన జరిపి, చర్యలు తీసుకోవాలి.
- ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలు ఇచ్చిన హామీలను అమలుచేసే విధంగా ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తేవాలి.
- గిర్‌గ్లానీ నివేదికను, 610 జీవోను అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పదో పీఆర్‌సీ అమలు, ఆరోగ్యకార్డుల జారీ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి.
- పోలవరం ముంపు గ్రామాల ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలి. తెలంగాణలోనే ఉండాలంటూ ముంపు గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలి.
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని సంస్కృతిని పెంచడానికి అన్ని జిల్లాల్లో సెమినార్లు నిర్వహించాలి. పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేయాలి.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత అన్ని శాఖల్లో జరిగిన ప్రమోషన్లు, నియామకాలపై విచారణ జరపాలి. అక్రమ నియామకాలు, పదోన్నతులను నిలిపివేయాలి.
‘ముంపు’ ఉద్యోగులు తెలంగాణకే..
Published Tue, May 6 2014 2:19 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement