సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజారవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో సిబ్బంది సంఖ్యను యాజమాన్యం ప్రతిఏటా గణనీయంగా తగ్గిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఆర్టీసీలో 2011–12లో 64,639 మంది ఉద్యోగులు పని చేసేవారు. ఈ ఏడాది జూన్ నాటికి ఈ సంఖ్య 54,489కు పడిపోయింది. అంటే దాదాపు 10 వేల మందికి పైగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఏపీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకుంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇంకా చాలామంది ఉద్యోగులను తొలగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
అవసరానికి మించి ఉన్నారట!
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించారు. గత రెండేళ్లలోనే 7,317 మంది ఉద్యోగుల కుదింపు జరిగింది. సంస్థలో సిబ్బంది అవసరానికి మించి ఉన్నారనే సాకుతో వారిని విధుల నుంచి తొలగించడానికి ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పదవీ విరమణలతో ఖాళీ అయ్యే పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. 2015–16లో సంస్థలో 59,372 మంది ఉండగా, కేవలం ఏడాది కాలంలో ఆ సంఖ్య 56,592కి తగ్గిపోయింది. గత మూడేళ్ల కాలంలో 650 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 350 మంది కాంట్రాక్టు కండక్లర్లను తొలగించారు. గత ఆరేళ్లలో ఆర్టీసీలో 9,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు.
బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ అంతేనా?
ఆర్టీసీలో కారుణ్య నియామకాలను యాజమాన్యం నిలిపివేసింది. ప్రస్తుతం దాదాపు 1,500 కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయడం లేదు. సంస్థలో చివరిసారిగా 2007లో రిక్రూట్‌మెంట్లు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పదేళ్లుగా ఖాళీల భర్తీ ఊసే ఎత్తడం లేదు.
అమలు కాని 60 ఏళ్ల వయో పరిమితి
ఆర్టీసీలో పదవీ విరమణ వయసు పెంపు విషయంలో టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం పెంపును వర్తింపజేయడం లేదని మండిపడుతున్నారు. సంస్థలో పదవీ విరమణ వయోపరిమితి పెంపును అమలు చేస్తే సిబ్బంది కొరత కొంతవరకు తీరుతుందని అంటున్నారు.
అధికార పార్టీ నేతలకు ఉపాధి కేంద్రం
ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని టీడీపీ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కేంద్రంగా మార్చేసింది. సంస్థలో ఖాళీలను భర్తీ చేయకపోగా, అధికార పార్టీ నేతల కోసం జోనల్ ఛైర్మన్ల వ్యవస్థను పునరుద్ధరించింది. వారికి ఛాంబర్లు, ఆర్భాటాల కోసం రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్టీసీలో ఆశ్రయం పొందుతున్న టీడీపీ నేతల హంగూ ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్న నిధులతో ఎన్నో కొత్త బస్సులు కొనుగోలు చేయవచ్చని కార్మికులు చెబుతున్నారు.
సిబ్బందిని కుదించడం దారుణం
‘‘నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఆర్టీసీలో సిబ్బంది సంఖ్యను కుదించడం అన్యాయం. గత రెండేళ్లలోనే 6,000 మందిని తొలగించారు. సంస్థకు నష్టాలు వస్తే ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి గానీ ఉద్యోగులను తొలగించడం దారుణం. జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామంటున్నారు. విమానాల్లో తిరిగేది పేదలు కాదుకదా. పేదల కోసం బస్సులు నడిపే ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి. బస్సులు, ఉద్యోగుల సంఖ్యను పెంచాలి’’
– పలిశెట్టి దామోదర్‌రావు, రాష్ట్ర అదనపు కార్యదర్శి, ఈయూ
ప్రైవేటీకరణకు సర్కారు కుట్ర
‘‘ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అందుకోసమే సంస్కరణల పేరుతో సిబ్బందిని తొలగిస్తోంది. టిమ్ మిషన్లు, ఓడీ డ్యూటీలు ప్రవేశపెట్టి సిబ్బంది సంఖ్యను తగ్గిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 డిపోలకు మేనేజర్లు కొరత ఉంది. బస్సులు, ఉద్యోగుల సంఖ్యను పెంచి ఆర్టీసీని బలోపేతం చేయాలి’’
– సీహెచ్ సుందరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్‌డబ్యూఎఫ్
Comments
Please login to add a commentAdd a comment