నిరసన తెలుపుతున్న సర్కిల్ కార్యాలయ ఉద్యోగులు
బొబ్బిలి : బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్న ఆర్ అప్పారావు తీరుపై అక్కడి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడి ఎస్‌ఈ కార్యాలయం వద్ద సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మూకుమ్మడి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేకర్లకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతీ పనికీ కొర్రీలు వేస్తున్నారనీ, అందరి సీట్ల వద్దకు వచ్చి వేధిస్తున్నారని, మహిళలు అని చూడకుండా గౌరవం లేకుండా ఏకవచనంతో సంభోదిస్తున్నారని, ఇంటికి పోతావ్ జాగ్రత్త, సస్పెండ్ చేయిస్తానని హుకుం జారీ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆయన్ని నోడల్ అధికారిగా సాలూరులో నియమించినా నేటికీ వెళ్లలేదని, ఇప్పటికే ఈ విషయం కలెక్టర్, సీఈ, జేసీ, మంత్రి సుజయ్‌కృష్ణకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పైళ్లను తన వద్ద ఉంచుకుని తమను తీసుకురమ్మంటున్నారని, ప్రతీ చిన్న విషయానికీ పనిష్మెంట్ ఇవ్వాలి, ఎస్సార్ తీసుకురండంటూ భయపెడుతున్నారని వాపోయారు. ఇన్నాళ్లూ మౌనంగా భరించినా వేధింపులు ఎక్కువైపోతుండడంతో ఇలా బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు.
గతంలో ధవళేశ్వరంలో పనిచేసినప్పుడు ఉద్యోగిపై చేయి చేసుకుని సస్పెండ్ అయ్యారని తెలిపారు. నిత్యం ఏదో సమస్య సృష్టిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఆయన మానసిక స్థితి బాగాలేదని, ఆయన తీరుతో ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోతున్నామని తెలిపారు. ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదని, ఎన్నాళ్లీ ఇబ్బందులన వారు ప్రశ్నిస్తున్నారు. సుమారు 36 మంది ఉద్యోగులు ఆయన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ ఎస్‌ఈ అప్పారావును వివరణ కోరగా విషయం చెప్పలేదు. సక్రమంగా వివరణ కూడా ఇవ్వలేదు. వారినే అడగండంటూ నవ్వేయడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment