Irrigation office
-
కలగానే ఇరిగేషన్ సర్కిల్!
సాక్షి, విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు గత ప్రభుత్వం కలగా మార్చేసింది. బొబ్బిలి సర్కిల్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం వేరు పడిన తరువాత జిల్లాలోని ఇరిగేషన్‌శాఖను ఒకే సర్కిల్ పరిధిలోకి తీసుకురావాలన్న అధికారుల ఆలోచన నెరవేరలేదు. దీనిపై రెండున్నరేళ్ల క్రితమే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించి పంపినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం. దీనివల్ల ఇటు అధికారులు, అటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి నుంచి వేరు పడిన శ్రీకాకుళం.. విజయనగరం నీటిపారుదలశాఖలో వింత పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖ అంతా ఒక గొడుగు కింద లేదు. మధ్య, చిన్ననీటిపారుదలశాఖకు విజయనగరం, పార్వతీపురం డివిజన్లు ఉన్నాయి. ఇందులో విజయనగరం డివిజన్ విశాఖపట్నం సర్కిల్ పరిధిలో ఉంది. ఈ సర్కిల్లో పనులను విశాఖపట్నం ఎస్ఈ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు సంబంధించి బొబ్బిలిలో సర్కిల్ కార్యాలయం ఉన్నా విజయనగరం డివిజన్‌ను అందులోకి తీసుకురాలేదు. ఒకప్పుడు పార్వతీపురం డివిజ న్తోపాటు శ్రీకాకుళం జిల్లా అందులో ఉండేది. మూడేళ్ల క్రితం శ్రీకాకుళంలో ప్రత్యేకంగా ఒక ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసి ఆ జిల్లా ఇరిగేషన్ శాఖను ఆ పరిధిలోకి తీసుకొచ్చారు. అయినా విజయనగరం జిల్లాలో రెండు డివిజన్లను ఒకే సర్కిల్ పరిధిలోకి తీసుకురాలేదు. రెండు సర్కిళ్లతో ఇబ్బందులు.. వాస్తవానికి విజయనగరం చిన్న జిల్లా. బొబ్బిలి డివిజన్లో గతంలో శ్రీకాకుళం మొత్తం ఉండడంతో పని భారం వల్ల విజయనగరం డివి జన్ను విశాఖపట్నంలో కలిపారు. కానీ బొబ్బిలి సర్కిల్ ఒక్క పార్వతీపురానికి పరిమితమైన నేపథ్యంలో విజయనగరంలో కలిపితే భౌగోళికంగా, పరిపాలనాపరంగా ఇబ్బందులు తొలుగుతాయి. ఇలా కాకుండా రెండు వేర్వేరు సర్కిల్లో డివిజన్లు ఉండడం వల్ల అధికారులకు, రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. విజయనగరం డివిజన్‌కు చెందిన రైతులు విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోంది. అంతేగాకుండా నీటిపారుదల వనరుల అభివృద్ధికి సంబంధించి స్పష్టత లేకపోయింది. రెండు డివిజన్లకు సంబంధించి ఇద్దరు ఈఈలతోపాటు ఇద్దరు ఎస్ఈలను అడిగితేగానీ కుదరట్లేదు. దీనివల్ల ప్రగతి కొంతవరకు కుంటుపడుతోంది. ఈ విషయం గుర్తించిన అప్పటి కలెక్టర్ ఎం. ఎం.నాయక్ రెండు డివిజన్లను ఒక సర్కిల్ పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సిఫా ర్సు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బొబ్బిలిలో ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం విజయనగరానికి మార్చాలని కోరారు. దీనిపై జెడ్పీ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు విజయనగరంలో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. ఉన్నతాధికారులు ఆలోచించాల్సిందే... గత ప్రభుత్వంలో పని చేసిన జిల్లాకు చెందిన మంత్రి, ఇతర పాలకులు పట్టించుకోకపోవడం కారణమైతే జెడ్పీ సమావేశంలో చేసిన తీర్మానంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చేయడంలో ఏ ఎమ్మెల్యేగానీ, ఎమ్మెల్సీగానీ ప్రయత్నించలేదు. దీనివల్ల విజయనగరంలో సర్కిల్ ఏర్పాటు, ఒకే గొడుకు కిందకు మొత్తం ఇరిగేషన్ డిపార్టుమెంట్ రాలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున సమస్య గుర్తించి విజయనగరానికి సర్కిల్ ఇస్తారన్న ఆశతో జిల్లా రైతాంగం భావిస్తోంది. -
ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం.. ఇక రాజభవన్
సాక్షి, అమరావతి : విజయవాడలోని సూర్యారావుపేట పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..ఇక రాజభవన్‌గా వెలుగొందనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం గతంలో మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నర్సింహన్ వ్యవహరించారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు దాటినప్పటికీ గత చంద్రబాబు సర్కారు గవర్నర్ కోసం రాజభవన్ను కూడా నిర్మించకపోవడంతో..గవర్నర్ విజయవాడకు వచ్చినప్పుడల్లా ప్రైవేట్ హోటల్లో బస చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియామకం జరగడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాన్ని రాజభవన్‌గా ప్రకటించడమే కాకుండా అందుకనుగుణంగా ఆ కార్యాలయాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. -
ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగుల నిరసన
బొబ్బిలి : బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న ఆర్ అప్పారావు తీరుపై అక్కడి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడి ఎస్ఈ కార్యాలయం వద్ద సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మూకుమ్మడి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేకర్లకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతీ పనికీ కొర్రీలు వేస్తున్నారనీ, అందరి సీట్ల వద్దకు వచ్చి వేధిస్తున్నారని, మహిళలు అని చూడకుండా గౌరవం లేకుండా ఏకవచనంతో సంభోదిస్తున్నారని, ఇంటికి పోతావ్ జాగ్రత్త, సస్పెండ్ చేయిస్తానని హుకుం జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన్ని నోడల్ అధికారిగా సాలూరులో నియమించినా నేటికీ వెళ్లలేదని, ఇప్పటికే ఈ విషయం కలెక్టర్, సీఈ, జేసీ, మంత్రి సుజయ్‌కృష్ణకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పైళ్లను తన వద్ద ఉంచుకుని తమను తీసుకురమ్మంటున్నారని, ప్రతీ చిన్న విషయానికీ పనిష్మెంట్ ఇవ్వాలి, ఎస్సార్ తీసుకురండంటూ భయపెడుతున్నారని వాపోయారు. ఇన్నాళ్లూ మౌనంగా భరించినా వేధింపులు ఎక్కువైపోతుండడంతో ఇలా బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో ధవళేశ్వరంలో పనిచేసినప్పుడు ఉద్యోగిపై చేయి చేసుకుని సస్పెండ్ అయ్యారని తెలిపారు. నిత్యం ఏదో సమస్య సృష్టిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఆయన మానసిక స్థితి బాగాలేదని, ఆయన తీరుతో ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోతున్నామని తెలిపారు. ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదని, ఎన్నాళ్లీ ఇబ్బందులన వారు ప్రశ్నిస్తున్నారు. సుమారు 36 మంది ఉద్యోగులు ఆయన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ ఎస్ఈ అప్పారావును వివరణ కోరగా విషయం చెప్పలేదు. సక్రమంగా వివరణ కూడా ఇవ్వలేదు. వారినే అడగండంటూ నవ్వేయడం కొసమెరుపు. -
తాగునీటి కోసం ధర్నా
భీమడోలు: మంచినీటి కోసం కొల్లేరు వాసులు గుండుగొలను ఇరిగేషన్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. లంక గ్రామాలకు మంచినీటిని అందించేంత వరకు తాము ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరం గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది మహిళలు, యువకులు బైఠాయించారు. మూడున్నర గంటల పాటు ఆందోళన చేశారు. సంబంధిత అధికారుల వద్ద నీళ్ల కోసం మొరపెట్టుకున్నా హామీ రాలేదు. కొల్లేరు వాసులకు నీరందించే ఆగడాలలంక చానల్ బద్దలు కొట్టైనా నీటిని తీసుకుని వెళ్తామంటూ చానల్ వద్దకు తరలివెళ్లారు. దాంతో చానల్ వద్దకు అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అక్కడ కొల్లేరు గ్రామాల పెద్దలకు, అధికారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితుల్లో గుండుగొలను ఇరిగేషన్ కార్యాలయానికి డీఈ ఏబీ నాయక్ వచ్చారన్న సమాచారం అందుకున్న కొల్లేరు గ్రామాల ప్రజలు అక్కడి నుంచి ఆటోల్లో కార్యాలయానికి చేరుకున్నారు. డీఈతో తమ గోడును ఏకరువు పెట్టారు. తన చేతుల్లో ఏమీ లేదని డీఈ బీఎన్ నాయక్ చేతులేత్తేశారు. దీంతో ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా దుర్వాసన కొట్టే నీటిని తాగుతున్నామని ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. ఇటీవల దళితతేజం–తెలుగుదేశం కార్యక్రమానికి ఆగడాలలంకకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే చెరువులు అడుగంటి పోయి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి వెళ్లారన్నారు. ఆ క్రమంలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని, చెర్వులను నింపుతామని హామీ ఇచ్చి వెళ్లారని రోజులు గడిచినా చుక్క నీరు లేకపోయిందని వారంతా గగ్గోలు పెట్టారు. ఆందోళన ఉధృతమవుతుందని తెలుసుకున్న భీమడోలు తహసీల్దార్ మార్ని గంగరాజు కార్యాలయానికి వచ్చి కొల్లేరు వాసులను శాంతింప చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. ఇక్కడ పరిస్థితిని ఆర్డీఓ చక్రధర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. చర్చలు సఫలం : గుండుగొలను ఇరిగేషన్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ శిరిబత్తిన కొండబాబు, ఆగడాలలంక గ్రామ సర్పంచ్ చిగురుపాటి యోహోషువ, ఎంపీటీసీ మద్దాల పాపారావు, నీటి సంఘం అధ్యక్షుడు బాదర్వాడ ప్రసాదరాజు తదితరులు తహసీల్దార్ మార్ని గంగరాజు, ఇరిగేషన్ డీఈ ఏబీ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ నాగేశ్వరరావులతో చర్చించారు. కొల్లేరు గ్రామాలకు మంచినీటిని అందిస్తామని హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి తరలి వెళ్తామని ఆందోళనకారులు అధికారులకు తేల్చి చెప్పారు. గోదావరి, సీలేరులోను నీళ్లు లేవు. సాగును గట్టెక్కించడమే పెద్ద సవాల్‌గా మారింది. మంచినీటి చెర్వుల్లో నీరు నింపడం కష్టమే. అయినప్పటికీ గ్రామాలకు నిత్యం నీరు ఇచ్చేందుకు శనివారం నుంచి రెండు పాయింట్లను తెరుస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తామని వారు వివరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మోరు కొండలు, కె.నాని పాల్గొన్నారు. -
ఇరిగేషన్ కార్యాలయాన్ని తరలిస్తే ఆందోళనే: ఉద్యోగుల హెచ్చరిక
విజయవాడ: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యాలయం తరలింపుపై ఉద్యోగులు ఆందోళనకు గురౌతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం కోసం తమ కార్యాలయాన్ని తరలించడం అన్యాయమని, దీనికి నిరసిస్తూ ఉద్యోగులు సీనియర్ ఇంజనీర్ కు ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. తమకు విజయవాడలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీటిపారుదల కార్యాలయాన్ని తరలిస్తే ఆందోళన చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఏప్రిల్ నుంచి బెజవాడలో సీఎం
వారానికి రెండు రోజులు బస ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంపు ఆఫీస్ విజయవాడ బ్యూరో: విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులు ఈ నెల మూడోవారం నుంచి మొదలవనున్నాయి. ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారానికి రెండు రోజులు ఇక్కడే ఉండేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది. ఇక్కడుండే రెండు రోజులూ అధికారిక సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు వీలుగా వసతులు కల్పించనున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, మరో నలుగురు మంత్రులకూ ఇక్కడే ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల విజయవాడకు తరచూ వస్తోన్న సీఎం చంద్రబాబు తన క్యాంపు ఆఫీస్‌ను నగరానికి మధ్యనున్న ఇరిగేషన్ భవనంలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భావించారు. ఇంతకుముందు క్యాంపు కార్యాలయంగా నిర్ణయించుకున్న స్టేట్ గెస్ట్‌హౌస్ వాస్తుపరంగా సరిగా లేదన్న భావన నేపథ్యంలో కొత్త ప్రాంగణం కోసం అన్వేషిస్తున్న అధికారులకు ఇరిగేషన్ భవనం అనుకూలంగా కనిపించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బాబు, కృష్ణాడెల్టా సీఈ సుధాకర్‌లు ఏర్పాట్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీంతో సీఎం క్యాంపు ఆఫీస్ అధికారికంగా ఖరారైంది. ప్రభుత్వం దీనిని వెల్లడిస్తూ ఇటీవల ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. దీంతో ఇరిగేషన్ భవనంలో మార్పులతో కూడిన పనులు మొదలయ్యాయి. ‘యూ’ ఆకారంలో ఉండే నీటిపారుదలశాఖ భవనంలో ఇప్పటివరకూ రెండంతస్తులు మాత్రమే ఉన్నాయి. మొదటి అంతస్తులోని నైరుతి భాగాన ఉన్న నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా కార్యాలయాన్ని, దానిపక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాలుతోపాటు ఆ ఫ్లోరులోని అన్ని గదులనూ సీఎం ఆఫీసుకోసం కేటాయించేందుకు నిర్ణయించారు. మంత్రి ఉమా కార్యాలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లోని మెట్లకు ఎడమవైపున ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఇక్కడ కుడివైపునున్న ఐదు గదులను మంత్రులకోసం కేటాయించే వీలుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఎడమ వైపున చివర్లో ఉన్న జాతీయ జల రవాణా కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసి వేరొకచోటకు పంపే ఆలోచన ఉందంటున్నారు. ఈనెల 24లోగా కొద్దిపాటి మరమ్మతులన్నీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే భవనం పైనున్న ‘ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల-ఆయకట్టు అభివృద్ధి శాఖ’ బోర్డును తొలగించారు. కలెక్టర్ బాబు ఇప్పటికే ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆర్ అండ్ బీ, ప్రణాళిక శాఖల అధికారులతో సమావేశమై సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటుపై చర్చించారు. మరమ్మతులకు రూ.50 లక్షలపైనే... సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేయాలంటే.. ప్రత్యేక వసతులు కల్పించాల్సి ఉంది. ఏసీలు, విద్యుత్ సదుపాయం, మంచినీరు, డిజిటల్, ఎలక్ట్రానిక్, సెక్యూరిటీ పరికరాల ఏర్పాట్లకు ఎంత మేరకు వ్యయమవుతుందో అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్‌లో జరుగుతున్న మరమ్మతులు, లిఫ్టులు, ఏసీల ఏర్పాటు పనులకు సుమారు రూ.50 లక్షలపైనే అవుతుందని భావిస్తున్నారు. -
రూపాయి కూడా వెనక్కి వెళ్లనీయొద్దు
దేవినేని ఉమా విజయవాడ : ప్రభుత్వం మంజూరు చేసిన ఒక్క రూపాయి కూడా వెనక్కిపోవడానికి వీలు లేదని, అందుబాటులో ఉన్న నిధులతో చెరువులు, కాలువల్లో పనులు చేపట్టాలని ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. ఇరిగేషన్ కార్యాలయంలో డ్వామా అధికారులతో నీరు-చెట్టు పథకంపై సోమవారం ఆయన సమీక్ష జరిపారు. అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు చేయడంలో అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల అవి మురిగిపోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద పెండింగులో ఉన్న రూ.116 కోట్లు వెంటనే ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఏదైనా క్షేత్ర స్థాయి ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతానన్నారు. ఇరిగేషన్, అటవీ శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో డ్వామా అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. డెల్టా ప్రాంతంలో కాలువలలో తూడు తొలగింపు, గుర్రపు డెక్క నిర్మూలన పనులు చేపట్టాల్సి ఉందని అధికారులకు సూచించారు. ఉపాధి కల్పన సంచాలకులు వి.కరుణ, డ్వామా పథక సంచాలకులు పి.మాధవిలత, ఇరిగేషన్ ఎస్ఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమీక్ష లేదు... చెప్పింది వినడమే!
బీసీ సంక్షేమ మంత్రి రవీంద్ర తీరు సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో బుధవారం హడావుడి నెలకొంది. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు. సమీక్ష సుమారు ఒంటిగంటకు మొదలైంది. రెండు మాటలు మాట్లాడిన తరువాత మంత్రి ఉమా కలెక్టర్‌తో తన చాంబర్లో సీఎం పర్యటన షెడ్యూలు రూపొందించేం పనిలో నిమగ్నమయ్యారు. సమీక్షలో మంత్రి ఏమి అడుగుతారనే భయంతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సీనియర్ వార్డెన్లను వెంటబెట్టుకొని పక్కా సమాచారంతో వచ్చారు. మంత్రి ఒక్కో జిల్లా నుంచి అధికారిని మాట్లాడాల్సిందిగా కోరారు. జిల్లాలోని హాస్టళ్లలో పిల్లలు ఎంత మంది ఉన్నారు.. సీట్ల ఖాళీలు.. మెనూ తదితర వివరాలను అధికారులు చెప్పారు. సీట్ల భర్తీ, హాజరు శాతం పెంచడం వంటి అంశాలపై చర్చించలేదు. కేవలం అధికారులు చెప్పే అంకెలు, వారు వివరించిన అంశాలు వినటానికే మంత్రి సమయం కేటాయించారు. ఇందుకోసం ఇక్కడదాకా తమకు ఎందుకు పిలవడం.. అని పలువురు అధికారులు వ్యాఖ్యానించారు. నేడు హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు సమావేశం సమీక్ష సమావేశం అనంతరం దేవినేని ఉమ విలేకరులతో మాట్లాడుతూ నాగార్జున సాగర్ నుంచి తాగునీరు, సాగునీరు ఎలా పొందాలనే విషయంపై గురువారం హైదరాబాద్‌లో కృష్ణాబోర్డు సమావేశం జరుగుతుందన్నారు. -
జోరువానలోనూ సమైక్య హోరు
సాక్షి, విజయవాడ : తలకిందులుగా తపస్సుచేసి అయినా రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ నాగాయలంకలో గురువారం జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పలువురు తలకిందులుగా నిలబడి జైసమైక్యాంధ్ర, తెలంగాణ వద్దు-సమైక్యాంధ్రముద్దు అంటూ నినాదాలు చేశారు. విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద జోరువానలో ఎన్జీవోలు, ఇరిగేషన్ ఉద్యోగులు భోజనవిరామ సమయంలో ధర్నా చేశారు. కైకలూరు వెలంపేటకు చెందిన మహిళా కార్యకర్తలు రిలే దీక్షల్లో కూర్చున్నారు. నందివాడ మండలం టెలిఫోన్ నగర్లో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు హైస్కూల్ విరామ సమయంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. తిరువూరులో సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు 21వ రోజు కొనసాగాయి. చల్లపల్లిలో 76వరోజుకు దీక్షలు చేరాయి. చల్లపల్లి మండలంలోని మాజేరుకు చెందిన మహిళలు దీక్ష చేశారు. అవనిగడ్డలో 63వరోజు చేరుకున్నాయి. అవనిగడ్డలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ యూత్‌కు చెందిన వేకనూరు యువకులు దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ యూత్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. యూత్ మండల కన్వీన ర్ చామల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు, వివిధ మండలాల కన్వీనర్లు, నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, పాఠశాలల ముందు రాష్ట్ర విభజనకు నిరసనగా నినాదాలు చేశారు. ఆగిరిపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 32వ రోజూ రిలే నిరహార దీక్షలు జోరువానలో కొనసాగాయి.పామర్రు ఏపీఎన్జీవో సంఘం పిలుపు మేరకు . పామర్రు కంచర్ల రామారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మధ్నాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేశారు. చిన్నగాంధీబొమ్మ సెంటరులో జేఏసీ ఆధ్వర్యంలోని రిలేదీక్ష శిబిరాన్ని విశాలాంధ్రమహాసభ రాష్ట్రఅధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ శిబిరంలో పట్టణంలోని శారదా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు, త్రివిధ, కుమార్, విజేత ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. సెయింట్‌జోన్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు చిన్నగాంధీబొమ్మ సెంటరులో వర్షం పడుతున్నా గొడుగులు వేసుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 59వ రోజుకు చేరాయి. పట్టణంలోని బాపునగర్‌కు చెందిన కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఏపీఎన్జీవోల అధ్వర్యంలో మైలవరం పంచాయతీ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మైలవరం నియోజక వర్గ సమన్వయ కర్త జోగిరమేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగుసెంటర్లో వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర నాయకులు అశోక్‌బాబు పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నభోజన సమయంలో నిరసన వ్యక్తం చేశారు. నందివాడ మండలంలోని టెలిఫోన్ నగర్ కాలనీలోని సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు గురువారంతో 54వ రోజుకు చేరుకున్నాయి. అరిపిరాల గ్రామానికి చెందిన రైతులు దీక్షలో కూర్చున్నారు. -
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : సాగునీరు విడుదల చేయాలంటూ బందరు రైతులు ఆదివారం రోడ్డెక్కారు. మం డలంలోని సుల్తానగరం, ఎస్.ఎన్.గొల్లపాలెం, సీతారామపురం గ్రామాల రైతులు సుల్తానగరంలో మచిలీపట్నం-విజయవాడ రహదారిపై బైఠాయించి గంటసేపు రాస్తారోకో చేశారు. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. రైతులకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని), జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకే వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు తోట శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం, మంత్రి కొలుసు పార్థసారథి, ఇరిగేషన్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో విషయం తెలిసిన గూడూరు ఎస్ఐ వై.సత్యరమేష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని రైతులను కోరారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి బందరు కాలువకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చేంత వరకూ తాము ఆందోనను విరమిం చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో ఎస్ఐ, రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ జిల్లా మంత్రి కేపీసారథి కంకిపాడు నుంచి దిగువకు సాగునీటిని విడుదల చేయకుండా ఇరిగేషన్ అధికారులను నియంత్రిస్తున్నందునే తమ పొలాలకు నీరు రావడంలేదని ఆరోపించారు. చివరకు ఇరిగేషన్ అధికారులు వస్తున్నట్లు సమాచారం రావడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఎస్ఎన్ గొల్లపాలెం మాజీ సర్పంచులు రామచంద్రరావు, జి.వెంకటేశ్వరరావు, సుల్తానగరం సర్పంచి మట్టా వెంకట దాసు, మాజీ వైస్ ఎంపీపీ కాగిత అమ్మయ్య తదితరులు నాయకత్వం వహించారు. ఇరిగేషన్ కార్యాలయాలను దిగ్బంధనంచేస్తాం : పేర్ని బందరు కాలువకు సోమవారం నాటికి సాగునీటిని విడుదల చేయకుంటే ఇరిగేషన్ కార్యాల యాలను దిగ్బంధిస్తామని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) హెచ్చరించారు. మంత్రి కేపీ సారథిని బందరు ప్రాంత రైతులు అడ్డుకుంటారని పేర్కొన్నారు. రాస్తారోకో వద్దకు వచ్చిన నాని రైతులకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు నీరు ఇస్తామని మంత్రి సారథి హామీ ఇచ్చినందునే రైతులు ఎకరాకు రూ.5 వేలు ఖర్చు చేసి నారుమడులు పోశారన్నారు. వేల క్యూసెక్కుల కృష్ణానది నీటిని సముద్రం పాల్జేస్తున్న పాల కులు, పొలాలకు ఇవ్వకపోడం ఏమిటని ప్రశ్నించారు. కంకిపాడు నుంచి దిగువనున్న ఆకుమర్రు, రామరాజుపాలెం లాకులకు నీటి చుక్క రావడం లేదన్నారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి దిగువకు సాగునీరు విడుదల చేయొద్దని ఇరిగేషన్ అధికారులను మంత్రి సారథి ఆదేశించారని విమర్శించారు.