ఏప్రిల్ నుంచి బెజవాడలో సీఎం
వారానికి రెండు రోజులు బస
ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంపు ఆఫీస్
విజయవాడ బ్యూరో: విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులు ఈ నెల మూడోవారం నుంచి మొదలవనున్నాయి. ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారానికి రెండు రోజులు ఇక్కడే ఉండేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది. ఇక్కడుండే రెండు రోజులూ అధికారిక సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు వీలుగా వసతులు కల్పించనున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, మరో నలుగురు మంత్రులకూ ఇక్కడే ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయనున్నారు.
ఇటీవల విజయవాడకు తరచూ వస్తోన్న సీఎం చంద్రబాబు తన క్యాంపు ఆఫీస్‌ను నగరానికి మధ్యనున్న ఇరిగేషన్ భవనంలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భావించారు. ఇంతకుముందు క్యాంపు కార్యాలయంగా నిర్ణయించుకున్న స్టేట్ గెస్ట్‌హౌస్ వాస్తుపరంగా సరిగా లేదన్న భావన నేపథ్యంలో కొత్త ప్రాంగణం కోసం అన్వేషిస్తున్న అధికారులకు ఇరిగేషన్ భవనం అనుకూలంగా కనిపించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బాబు, కృష్ణాడెల్టా సీఈ సుధాకర్‌లు ఏర్పాట్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీంతో సీఎం క్యాంపు ఆఫీస్ అధికారికంగా ఖరారైంది. ప్రభుత్వం దీనిని వెల్లడిస్తూ ఇటీవల ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. దీంతో ఇరిగేషన్ భవనంలో మార్పులతో కూడిన పనులు మొదలయ్యాయి. ‘యూ’ ఆకారంలో ఉండే నీటిపారుదలశాఖ భవనంలో ఇప్పటివరకూ రెండంతస్తులు మాత్రమే ఉన్నాయి. మొదటి అంతస్తులోని నైరుతి భాగాన ఉన్న నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా కార్యాలయాన్ని, దానిపక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాలుతోపాటు ఆ ఫ్లోరులోని అన్ని గదులనూ సీఎం ఆఫీసుకోసం కేటాయించేందుకు నిర్ణయించారు. మంత్రి ఉమా కార్యాలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లోని మెట్లకు ఎడమవైపున ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.
మరోవైపు ఇక్కడ కుడివైపునున్న ఐదు గదులను మంత్రులకోసం కేటాయించే వీలుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఎడమ వైపున చివర్లో ఉన్న జాతీయ జల రవాణా కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసి వేరొకచోటకు పంపే ఆలోచన ఉందంటున్నారు. ఈనెల 24లోగా కొద్దిపాటి మరమ్మతులన్నీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే భవనం పైనున్న ‘ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల-ఆయకట్టు అభివృద్ధి శాఖ’ బోర్డును తొలగించారు. కలెక్టర్ బాబు ఇప్పటికే ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆర్ అండ్ బీ, ప్రణాళిక శాఖల అధికారులతో సమావేశమై సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటుపై చర్చించారు.
మరమ్మతులకు రూ.50 లక్షలపైనే...
సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేయాలంటే.. ప్రత్యేక వసతులు కల్పించాల్సి ఉంది. ఏసీలు, విద్యుత్ సదుపాయం, మంచినీరు, డిజిటల్, ఎలక్ట్రానిక్, సెక్యూరిటీ పరికరాల ఏర్పాట్లకు ఎంత మేరకు వ్యయమవుతుందో అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్‌లో జరుగుతున్న మరమ్మతులు, లిఫ్టులు, ఏసీల ఏర్పాటు పనులకు సుమారు రూ.50 లక్షలపైనే అవుతుందని భావిస్తున్నారు.