అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ మూడు దశల్లో ఏర్పాటు బందరు రోడ్డులో సిద్ధం
ఎల్ అండ్ టీతో డీపీఆర్ తయారీకి యత్నాలు
విజయవాడ: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తన క్యాంపు కార్యాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా పూరిగుడిసెలు లేకుండా చేయడమే కాదు.. అందంగా తీర్చిదిద్దాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అప్పుడప్పుడు అభివృద్ధి పనుల్ని ఆయనే స్వయంగా పరిశీలిస్తున్నారు.
గన్నవరంలో ఆకస్మిక తనిఖీలు..
ఇటీవల ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వస్తూ గన్నవరం వెటర్నరీ కాలేజ్ వద్ద తన కాన్వాయ్‌ను అకస్మాత్తుగా ఆపుచేసి తనిఖీలు ప్రారంభించారు. రోడ్డు అందంగా ఉన్నా పక్కనే విద్యుత్ స్తంభాలు రోడ్డుకు, జాతీయ ర హదారికి అడ్డంగా తీగలు కనపడ్డాయి. ఆయన కలెక్టర్ బాబు.ఏ, సీఆర్‌డీఏ అధికారులను నిలదీసినట్లు సమాచారం. తాను ఎంతో కష్టపడి ఈ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దేదుకు ప్రయత్నిస్తుంటే విద్యుత్ స్తంబాలు, తీగలు ఆక ర్షణీయంగా లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గమంతా అండర్‌గ్రౌండ్ కేబులింగ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
కదిలిన విద్యుత్ అధికారులు..
సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ ఎస్పీడీసీఎల్ అధికారుల్ని పిలిచి తక్షణం ఆ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలని ఆదేశించినట్లు తెలిసింది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సీఎం క్యాంపు ఆఫీసు వరకు ఎక్కడ విద్యుత్ స్తంభాలు, తీగలు కనపడకూడదని ఆదేశాలు జారీ చేశారు.
మూడు దశల్లో పనులకు యోచన..
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రింగ్‌రోడ్డు వరకు, రింగ్‌రోడ్డు నుంచి బెంజిసర్కిల్ వరకు, బెంజిసర్కిల్ నుంచి సీఎం క్యాంపు ఆఫీసు వరకు మూడు దశల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలని ఎస్సీడీసీఎల్ అధికారులు భావిస్తున్నారు. ఈ వర్క్‌కు సమగ్ర నివేదిక(డీపీఆర్) తయారు చేస్తే దానికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. పనులకు డీ పీఆర్‌ను సాధ్యమైనంత త్వరగా తయారు చేయించేందుకు ప్రముఖ సంస్థలతో సంప్రదిస్తున్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్‌కు సుమారు రూ.వంద కోట్లు వరకు ఖర్చు అవుతుందని అంచనాలు వేస్తున్నారు. డీపీఆర్ వచ్చిన తరువాత ప్రభుత్వ అనుమతితో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
బందరు రోడ్డుకు గ్రీన్‌సిగ్నల్..
బందరురోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలనే మరొక ప్రతిపాదన అధికారులు వద్ద సిద్ధంగా ఉంది. దీనికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల పన్నులు పెంచడంతో ఆదాయం పెరిగిందని, అందువల్ల బందరురోడ్డుకు అండర్‌గ్రౌండ్ కేబుల్ వంటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయవచ్చని ఆయన అధికారుల వద్ద వ్యాఖానించినట్లు సమాచారం. దీనిపై ఎస్పీడీసీఎల్ అధికారులు త్వరగా స్పందిస్తే నిధులు ఇస్తానని మంత్రి చెప్పినట్లు తెలిసింది.