గుండుగొలనులో ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన లంక గ్రామస్తులు
భీమడోలు: మంచినీటి కోసం కొల్లేరు వాసులు గుండుగొలను ఇరిగేషన్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. లంక గ్రామాలకు మంచినీటిని అందించేంత వరకు తాము ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరం గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది మహిళలు, యువకులు బైఠాయించారు. మూడున్నర గంటల పాటు ఆందోళన చేశారు. సంబంధిత అధికారుల వద్ద నీళ్ల కోసం మొరపెట్టుకున్నా హామీ రాలేదు. కొల్లేరు వాసులకు నీరందించే ఆగడాలలంక చానల్ బద్దలు కొట్టైనా నీటిని తీసుకుని వెళ్తామంటూ చానల్ వద్దకు తరలివెళ్లారు. దాంతో చానల్ వద్దకు అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అక్కడ కొల్లేరు గ్రామాల పెద్దలకు, అధికారులు,
పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితుల్లో గుండుగొలను ఇరిగేషన్ కార్యాలయానికి డీఈ ఏబీ నాయక్ వచ్చారన్న సమాచారం అందుకున్న కొల్లేరు గ్రామాల ప్రజలు అక్కడి నుంచి ఆటోల్లో కార్యాలయానికి చేరుకున్నారు. డీఈతో తమ గోడును ఏకరువు పెట్టారు. తన చేతుల్లో ఏమీ లేదని డీఈ బీఎన్ నాయక్ చేతులేత్తేశారు. దీంతో ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా దుర్వాసన కొట్టే నీటిని తాగుతున్నామని ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. ఇటీవల దళితతేజం–తెలుగుదేశం కార్యక్రమానికి ఆగడాలలంకకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే చెరువులు అడుగంటి పోయి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి వెళ్లారన్నారు. ఆ క్రమంలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని, చెర్వులను నింపుతామని హామీ ఇచ్చి వెళ్లారని రోజులు గడిచినా చుక్క నీరు లేకపోయిందని వారంతా గగ్గోలు పెట్టారు. ఆందోళన ఉధృతమవుతుందని తెలుసుకున్న భీమడోలు తహసీల్దార్ మార్ని గంగరాజు కార్యాలయానికి వచ్చి కొల్లేరు వాసులను శాంతింప చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. ఇక్కడ పరిస్థితిని ఆర్‌డీఓ చక్రధర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు తెలియజేశారు.
చర్చలు సఫలం : గుండుగొలను ఇరిగేషన్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ శిరిబత్తిన కొండబాబు, ఆగడాలలంక గ్రామ సర్పంచ్ చిగురుపాటి యోహోషువ, ఎంపీటీసీ మద్దాల పాపారావు, నీటి సంఘం అధ్యక్షుడు బాదర్వాడ ప్రసాదరాజు తదితరులు తహసీల్దార్ మార్ని గంగరాజు, ఇరిగేషన్ డీఈ ఏబీ నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నాగేశ్వరరావులతో చర్చించారు. కొల్లేరు గ్రామాలకు మంచినీటిని అందిస్తామని హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి తరలి వెళ్తామని ఆందోళనకారులు అధికారులకు తేల్చి చెప్పారు. గోదావరి, సీలేరులోను నీళ్లు లేవు. సాగును గట్టెక్కించడమే పెద్ద సవాల్‌గా మారింది. మంచినీటి చెర్వుల్లో నీరు నింపడం కష్టమే. అయినప్పటికీ గ్రామాలకు నిత్యం నీరు ఇచ్చేందుకు శనివారం నుంచి రెండు పాయింట్లను తెరుస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తామని వారు వివరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మోరు కొండలు, కె.నాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment