తాగునీరివ్వాలంటూ ధర్నా
-
బుజబుజనెల్లూరులో 20 రోజులుగా సరఫరా బంద్
-
అధికారులపై తీరుపై ప్రజల ఆగ్రహం
నెల్లూరు(అర్బన్): శివారు ప్రాంతమైన బుజబుజనెల్లూరులో తాగునీటి ఎద్డడి నెలకొన్నా, పాలకులు నిర్లక్ష్యాన్ని అవలంబించడంతో ప్రజలు భగ్గుమన్నారు. బుజబుజనెల్లూరు రామ్‌నగర్‌లోని పలు వీధుల ప్రజలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లోనే అతిపెద్ద వార్డయిన బుజబుజనెల్లూరులో దాదాపు 18 వేల మంది నివసిస్తున్నారు. రామ్‌నగర్‌లో మూడు నుంచి ఏడో వీధి వరకు కుళాయిల్లో నీరొదిలి 20 రోజులైంది. సమస్యను పాలకులకు తెలియజేసేందుకు స్థానికులు ఫోన్ చేసినా వారు తీయడంలేదు. కొందరు స్థానికులు పాలకుల ఇళ్లకు వెళ్తే, బావిలో నీరు అడుగంటిందని, మోటార్లు మరమ్మతులకు గురైతే తామేమి చేయగలమని వారు పేర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు రెండు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. అధికార పార్టీ కార్యకర్తల ఇళ్ల వద్దకు ట్యాంకర్లను పంపుతూ, తమను విస్మరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు.
నీరు లేకపోతే ఎలా?: జమీలా, రామ్‌నగర్ ఐదో వీధి
30 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నా. గతంతో పోలిస్తే నీటి సమస్య తీవ్రంగా ఉంది. ట్యాంకర్ వచ్చి ఐదు రోజులైంది. మనిషికి నాలుగు బిందెలు కూడా దొరకడంలేదు. గెలిచిన పెద్దలకు ఫోన్ చేసినా స్పందించడంలేదు.
అధికారులు పట్టించుకోలేదు: సుబ్బరాయుడు, రిటైర్డ్ ఎంపీడీఓ, రామ్‌నగర్ ఆరో వీధి
నీరు రాక ఎన్నో రోజుల నుంచి అల్లాడుతున్నాం. మేము ఇబ్బందులు పడుతున్నా, కార్పొరేషన్ అధికారులకు పట్టడంలేదు. ట్యాంకర్ వచ్చినా రెండు వీధులు దాటి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది.
బోరును వేయించరూ: రాజేశ్వరి, న్యూ కాలనీ
మూడు నెలల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని గతంలో మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం నీటి సమస్య తీవ్రమైనా వారు పట్టించుకోవడంలేదు. పిల్లలను పాఠశాలలకు ఉదయం పంపాలన్నా నీరు లేదు. మా ప్రాంతంలో బోరును వేయించి ఆదుకోవాలి.