ఎక్కడి వారు అక్కడికెళ్తే ఓకే!
* తెలంగాణ సర్కారు సిద్ధం
* ఏపీ అభిప్రాయమే కీలకం
* నేడు ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో కమిటీ, అధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో.. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఉద్యోగుల పంపిణీ సులభతరం కానుంది. లేదంటే ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ చిక్కుముడిగా మారి మరింత కాలం గందరగోళం తప్పకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కమలనాథన్ కమిటీకి ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎటువంటి వైఖరిని తెలియజేయలేదు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి, అలాగే తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే కమలనాథన్ కమిటీ అందుకు అనుగుణంగా ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేయడానికి ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును రెండు సంవత్సరాలు పెంచిన నేపథ్యంలో ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కొంతమంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ఇష్టపడటంలేదు.
ఇష్టపడని ఉద్యోగులను అక్కడే ఉండేలాగ, ఇష్టపడిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించేలాగ రెండు విధానాలను అవలంబించడం సాధ్యం కాదనేది కమలనాథన్ కమిటీ అభిప్రాయంగా ఉంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. కమలనాథన్ కమిటీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయడానికి సోమవారం సాయంత్రం 4-30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కార్యాలయంలో సమావేశం కానుంది.
ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతో పాటు తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్, కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనావర్మలు కూడా పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో తెలంగాణకు చెందిన ఉద్యోగులు జిల్లాలతో సహా ఆంధ్రాలో పనిచేస్తున్న వారు 3,000 మంది వరకు ఉంటారని, అలాగే రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు జిల్లాలతో సహా తెలంగాణలో పనిచేస్తున్న వారు 4,000 మంది ఉంటారని అంచనా వేశారు.