
బాలరాజు ఇంటిని ముట్టడించిన ఉద్యోగుల భార్యలు
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్రకు మద్దతుగా తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పాడేరులోని గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు ఇంటిని ఉద్యోగుల భార్యలు ముట్టడించారు. తమ భర్తలు జీతభత్యాలు మానుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొంటుంటే సీమాంధ్ర మంత్రులు పదవులు పట్టుకొని వేలాడటం దారుణమని నినాదాలు చేశారు. సుమారు గంట పాటు మంత్రి ఇంటి ముందు బైఠాయించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. బాలరాజు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసునాయుడును ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఆమదాలవలసలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతిని ఇంతవరకు ఎందుకు రాజీనామా ఎందుకు చేయలేదని ఉపాధ్యాయులు నిలదీశారు. కర్నూలులో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌ను వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు అడ్డుకున్నారు.
ఉద్యమం పేరుతో పబ్లిసిటీ జిమ్మిక్కులా?
మంత్రి గంటా ఫ్లెక్సీ చించి తొలగించిన ఉద్యమకారులు
విశాఖ నగరంలో 55 ఉద్యోగ, ప్రజా సంఘాలు రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమైక్యగర్జనసభకు సమీపంలో మంత్రి గంటాశ్రీనివాసరావు ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడంపై ఉద్యోగ,ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఫ్లెక్సీని తక్షణం తొలగించాలని పట్టుబట్టాయి. దీంతో ‘సమైక్య సఖ్యత కోసం కదలివస్తోన్న ప్రజానీకానికి స్వాగతం’ అంటూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వద్దకు కొందరు యువకులు వెళ్లి వెళ్లి దాన్ని చింపేశారు. వెంటనే అక్కడున్న ఉద్యమకారులు చప్పట్లతో స్వాగతించారు.