అయ్యన్న ‘మంత్రా’ంగంతో రూ.21.24కోట్లు కేటాయింపు
ఇతర ‘దేశం’ ఎమ్మెల్యేలకు రూ.4 కోట్ల లోపే
మరమ్మతుల పేరిట స్వాహాకు తమ్ముళ్ల యత్నం
వైఎస్సార్‌సీపీ సెగ్మెంట్ల పట్ల వివక్ష
నోరుంటే చాలు.. ఊళ్లు దోచుకోవచ్చు అన్న రీతిలో ఉంది అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల తీరు. ఉపాధిహామీ నిధుల పంపకం
ఇందుకు నిదర్శనం. అధికారులపై ఒత్తిడి తెచ్చి రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖమంత్రి అయ్యన్న పాత్రుడు తాను ప్రాతినిధ్యం వహించే నర్సీపట్నం నియోజక వర్గానికి సగం నిధులు రాబట్టుకున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు అరకొరగా కేటాయించి కొత్తసంస్కృతికి నాంది పలికారు. ‘మంత్రా’ంగం జరిగిపోవడంతో పనులు దక్కించుకుని ఆ నిధులను దోచుకు తినేందుకు తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు.
విశాఖపట్నం: ఉపాధి హామీ పథకంలో జిల్లాకు 321 పంచాయతీ, 39 స్త్రీ శక్తి భవనాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలు తుదిదశకు చేరేసరికి నిధుల సమస్య తలెత్తింది. అదనపు నిధులు కోరగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డబ్ల్యూబీఎం రహదారుల నిర్మాణంతో పాటు చెక్‌డామ్‌ల మరమ్మతులకు కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. ఇలా జిల్లాకు ఏ కంగా రూ.40.2 కోట్లు విడుదలయ్యాయి. మరమ్మతుల పేరిట 223 పంచాయతీ భవనాలకు రూ.6కోట్ల 87లక్షల 86వేలు, 20 స్త్రీ శక్తి భవనాలకు కోటి 6లక్షల 60 వేలు, 375 చెక్‌డామ్‌లకు రూ.9కోట్ల 45లక్షల 89వేలు మంజూరు చేశారు. కొత్తగా గ్రామాల్లో 344 అంతర్గత సీసీరోడ్ల కోసం రూ.16కోట్ల 31 లక్షల 50 వేలు, మండల కేంద్రాలకు 29 డబ్ల్యూబీఎం రహదారుల కోసం రూ.ఆరు కోట్ల 52లక్షల 50 వేల చొప్పున మంజూరు చేశారు. సాధారణంగా ఈ నిధులను అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సమానంగా ఖర్చు చేయాలి.
కానీ నోరున్నవాడిదే రాజ్యం అన్నట్టుగా రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖమంత్రి అయ్యన్న పాత్రుడు అడిగింతే తడవుగా ఆయన ప్రాతినిధ్యం వహించే నర్సీపట్నం నియోజక వర్గానికి ఈ నిధుల్లో సగానికి పైగా అంటే ఏకంగా రూ.21కోట్ల 24లక్షల 15వేలు అధికారులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే మరే ఇతర నియోజక వర్గాలకు ఈస్థాయిలో నిధుల కేటాయింపు జరగలేదు. నర్సీపట్నం తర్వాత మిగిలిన తొమ్మిది గ్రామీణ నియోజకవర్గాలకు రూ.18.96 కోట్లు మాత్రమే కేటాయించారు. పాడేరు, అరకు, మాడుగుల నియోజకవర్గాలకు రూ.4కోట్లు, మిగిలిన ఆరింటికి 15.86కోట్లు కేటాయించారు.
మంత్రి గారి నియోజకవర్గంలో...
నర్సీపట్నంలో మరమ్మతుల పేరిట 64 పంచాయతీ భవనాలకు రూ.2కోట్ల 80లక్షల 15వేలు, మూడుస్త్రీశక్తి భవనాలకు రూ.12.45లక్షలు, 78 చెక్‌డామ్‌లకు కోటి 59లక్షల 15వేలు కేటాయించారు. ఇక అత్యధికంగా 152 సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఏకంగా 10కోట్ల 23లక్షల 50వేలు, అలాగే 28డబ్ల్యూబీఎం రహదారుల కోసం ఆరుకోట్ల 48లక్షల 90వేలతో ప్రతిపాదించారు. పాయకరావుపేట నియోజకవర్గానికి మాత్రమే అత్యధికంగా రూ.4కోట్ల 29లక్షల 95 వేలు దక్కగా, యలమంచలికి రూ.3కోట్ల 90లక్షల 56వేలు, చోడవరానికి రూ.2కోట్ల 61లక్షల 81 వేలు,పెందుర్తికి రూ.2కోట్ల 11లక్షల 72వేలు, భీమిలికి రూ.కోటి 78లక్షల 52వేలు కేటాయిం చగా,అత్యల్పంగా అనకాపల్లి నియోజకవర్గానికి కేవలం రూ.5.2 లక్షలు మాత్రమే దక్కాయి. మరొక పక్క ఈ పనులను అడ్డంపెట్టుకుని ఉపాధి నిధులను దోచుకుతినేందుకు అధికార పార్టీనేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ పనులను పూర్తిగా తమ కార్యకర్తలతోనే చేయించేందుకు రంగం సిద్ధం చేశారు.
ప్రతిపక్షం పట్ల మళ్లీ వివక్షత
ఇక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలైన పాడేరుకు కోటి ఆరులక్షలు, అరకుకు కోటి 38లక్షలు, మాడుగలకు కోటి 74 లక్షలు కేటాయించారు. అవికూడా తప్పనిసరిపరిస్థితుల్లో ఏజెన్సీలో ఎక్కువగా ఉండే చెక్‌డామ్‌ల మరమ్మతులకు కేటాయించారు. మాడుగులకు మినహా మిగిలిన అరకు,పాడేరు నియోజకవర్గాలకు పంచాయతీ, స్త్రీ శక్తి భవనాల మరమ్మతులకు రూపాయికూడా కేటాయించలేదు. అరకు, పాడేరులలో ఒక్క సీసీ రోడ్డుకుకూడా నిధులివ్వలేదు. మాడుగులకు మాత్రం 31 సీసీరోడ్లకు రూ.70లక్షలు, ఒక డబ్ల్యూ బీఎం రోడ్‌కు రూ.3.6లక్షలు కేటాయించారు. ప్రభుత్వపెద్దల ఒత్తిడిమేరకే ఈనియోజకవర్గాలకు అరకొరగా కేటాయింపులు జరుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉపాధి నిధులకు నర్సీ పట్టం
Published Fri, Feb 20 2015 1:03 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement