సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు అధ్వానంగా మారాయి. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలతో కొందరు ఇంజినీరింగ్ అధికారులు కుమ్మక్కై నాణ్యతా ప్రమాణాలకు నీళ్లొదిలారు. ఎస్టీ కాలనీల్లో 1,116 పనుల కోసం రూ.66.60 కోట్లు వెచ్చించగా, కనీసం రెండు నెలలైనా గడవక ముందే సిమెంట్ కాంక్రీట్(సీసీ) రోడ్లు, మురికికాల్వలు ఆనవాళ్లు కోల్పోయాయి. సీసీ రోడ్లు పగుళ్లు చూపి అస్తవ్యస్తంగా మారగా, మురికికాల్వలు శిథిలావస్థకు చేరా యి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో కొందరు డివిజన్‌స్థాయి ఉన్నతాధికారులు సూ త్రధారులుగా, కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న నాయకులు పాత్రదారులుగా ఉంటూ దోచుకుం టున్నారన్నది బహిరంగ రహస్యం. బహిరంగ దోపిడీపై ఉన్నతాధికారులు స్పందించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు కోరుతున్నా ఇంజినీరింగ్ అధికారుల నుంచి స్పందన లేదు.
సీసీ రోడ్ల పనుల్లో డొల్లతనం
ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురికికాల్వలు నిర్మించేందుకు 2012-13 ఆర్థిక సంఘం కింద నిధులు మంజూరు చేసింది. షెడ్యూల్ తెగలకు చెందిన కాలనీల్లో 1,116 సీసీ రోడ్లు, మురికికాల్వల పనుల కోసం రూ.66.60 కోట్లు మంజూరయ్యాయి. ఆయా కాలనీల్లో పనులు చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన కొందరు నాయకులు ముం దుకొచ్చారు. ఈ పనులపై ముందే కాంట్రాక్టర్లు, అధికారులు 25 శాతానికి పైగా కమీషన్ పంచుకున్నట్లు ప్రచారం ఉంది. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేయకున్నా బిల్లులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి తదితర డివిజన్లలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు రెండు నెలలైనా గడవక ముందే ఆనవాళ్లు కోల్పోతుండటం కాంట్రాక్టర్లు, అధికారుల డొల్లతనానికి అద్దం పడుతోంది. ఉట్నూరు, ఖానాపూర్, కోటపల్లి, వేమనపల్లి, నేరడిగొండ, మందమర్రి మండలాల్లో కడుతుందగానే కూలిపోయిన సందర్భాలున్నాయి.
మచ్చుకు కొన్ని..
ఖానాపూర్ మండల కేంద్రంలో రూ.3.23 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు చేపట్టారు. ఈ పనుల్లో పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతో పక్షం రోజులు గడవక ముందే పగుళ్లు తేలాయి. అత్యధికంగా క్యూరింగ్ కూడా చేయకుండా వదిలేయడంతో రోడ్లు దెబ్బతినగా, పలు ప్రాంతాల్లో సైడ్ డ్రెయిన్లు లేకుండా సీసీ రోడ్లు నిర్మించారు.
నేరడిగొండ మండలంలో రూ.1.65 కోట్లతో 37 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టగా, ఆ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఉట్నూరు అంగడిబజార్‌తోపాటు ఆరు గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి.
మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో రూ.8.95 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నాసిరకం సిమెంటు, ఇసుక వాడగా పక్షం రోజులకే దెబ్బతింది.
జైపూర్, జైనూర్, సిర్పూర్(యు), సారంగాపూర్, లక్ష్మణచాంద, కుభీర్, కౌటాలతోపాటు పలుచోట్ల నిర్మించిన రహదారులు, డ్రెయినేజీల పరిస్థితి దారుణంగా ఉంది. నాణ్యతా ప్రమాణాలు తుంగలో తొక్కి ఈ పనులకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు కాగా, ఈ బాగోతంపై విచారణ జరపాలని కొందరు ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు అధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రోడ్లు వేసి ఐదు నెలలే అయ్యింది..
రోడ్లు వేసి 5 నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పుడే చెదిరిపోయి కంకర తేలింది. నాసిరంకంగా నిర్మించడంతో ఈ దుస్థితి నెలకొంది. ఎక్కువ రోజులు నిలిచే పరిస్థితి లేదు. రోడ్లు వేసిన తర్వాత నీళ్లు పట్టించడంలో కాంట్రాక్టర్లు అశ్రద్ధ చేశారు. నాసిరకం పనులు చేసి చేతులు దులుపుకున్నారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారు.
- ఆది రాజేందర్, ఆదిల్‌పేట్, మందమర్రి
రోడ్లు వేశారు.. డ్రైయినేజీలు మరిచారు..
రోడ్ల నిర్మాణంతోపాటు డ్రైయినేజీలూ నిర్మించాలి. కానీ.. కోన్ని చోట్ల అసలు డ్రెయినేజీలు నిర్మించలేదు. దీంతో రోడ్లు ఎత్తుగా అయిపోయి.. మా ఇండ్లు కిందికి అయ్యాయి. చిన్నపాటి వర్షాలు పడితే నీరు ఇళ్లలోకి వస్తోంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మురికి నీరు ఇంటి ముందు నిల్చి దుర్వాసన వస్తంది. రోడ్లు వేసి ఐదు నెలలే అవుతున్నా చెదిరిపోతున్నాయి.
- తాడికొండ పోశం, ఎస్సీ కాలనీ, పొన్నారం, మందమర్రి
రూ.66 కోట్లు హాంఫట్
Published Mon, Sep 30 2013 2:39 AM | Last Updated on Sat, Sep 15 2018 3:18 PM
Advertisement
Advertisement