75శాతం పనులు సాకుగా చూపిస్తూ..
500 మంది సిబ్బంది తొలగింపునకు సన్నాహాలు?
కొత్త ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక గ్రామ కమిటీలకే
ఆందోళనలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
పార్వతీపురం: ఉపాధి హామీ పథకంలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలను భారీ సంఖ్యలో తొలగించేందుకు సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు జనవరిలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న ఖాళీలను, ఇప్పుడు తాజాగా లేనిపోని నిబంధనలతో చేస్తున్న ఖాళీలను భర్తీ చేసే అధికారాన్ని, దాదాపు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలకు అప్పగించి, ఆయా ఖాళీలలో పార్టీ కార్యకర్తలకే స్థానం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భోగట్టా. జిల్లాలోని 925 పంచాయతీలలో సుమారు 200 మంది ఫీల్డు అసిస్టెంట్ల పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 725 మందికి గత ఏడాది పనులపై ఈ ఏడాది 75శాతం పనులు చేయాలంటూ నిబంధనలు విధించారు.
అయితే పనులు కల్పిస్తున్న వేతనదారులకు జనవరి నుంచి బిల్లులివ్వకపోవడం, ఇటీవల బడ్జెట్ విడుదలయ్యాక పోస్టల్ సిబ్బంది సమ్మెలోకి దిగడం తదితర కారణాల వల్ల, వేతనదారులు పనులపై ఇష్టం చూపకపోవడ ంతో తాము లక్ష్యాలను
చేరుకోలేకపోతున్నామని ఉపాధి సిబ్బంది వాపోతున్నారు. అయితే ఇందులో ఎంపీడీఓలది పూర్తి బాధ్యత అయినప్పటికీ 75శాతం పనులను సాకుగా చెప్పి ఔట్‌సోర్సింగ్‌లో ఉన్న ఫీల్డు అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, ఏపీఓలను తప్పించి తమ ఉపాధిని పోగొట్టడం తగదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో ఫీల్డు అసిస్టెంట్లు, క్లస్టర్ స్థాయిలో టీఏలు, సాంకేతిక సహాయకులను, మండల స్థాయిలో ఏపీఓలను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పరిస్థితి ఏమిటంటూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
మార్చి పూర్తయితే గానీ చెప్పలేం
ఏపీడీ అప్పలనాయుడు అదనపు పథక సంచాలకులు, డ్వామా
ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయితే గానీ 75శాతం లేబర్ బడ్జెట్ మీట్ అయ్యారా ? లేదా? అనేది చెప్పలేం. ఏప్రిల్ వస్తేగాని అటువంటి ఎనాలిసిస్‌కు వెళ్లలేం. అటువంటి ఆదేశాలు ఏవీ రాలేదు. ఒకవేళ వచ్చినా జిల్లాకు అంత ప్రమాదం ఉండదు. రాష్ట్రస్థాయిలో రూ. 2.04కోట్లు లేబర్ బడ్జెట్‌ను చేరుకుని జిల్లా ముందంజలో ఉంది. రూ.1.83కోట్లతో విశాఖ జిల్లా, రూ. 1.78 కోట్లతో శ్రీకాకుళం జిల్లాలున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దాదాపు 200 మంది ఫీల్డు అసిస్టెంట్లు లేక ఆయా ప్రాంతాలు అవస్థలు పడుతున్నాయి.
ఉపాధి ఔట్?
Published Mon, Mar 23 2015 3:55 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement