వదలని వరద
ముంపులోనే లంకలు, పంటలు జల దిగ్బంధంలోనే ఏజెన్సీ గ్రామాలుఅనుక్షణం
పర్యవేక్షిస్తున్న కలెక్టర్, అధికారులు
సాక్షి, ఏలూరు : లంకలను ముంచేస్తూ.. పంటల్ని మింగేస్తూ వరద గోదారి ఉరకలేస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు. కొవ్వూరు, ఆచంట, నరసాపురం, నిడదవోలు, పోలవరం ప్రాం తాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 16.10 అడుగులకు చేరడంతో ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి మరింత పెరిగితే జాతీయ విపత్తు నివార (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను రంగంలోకి దించుతామని అధికారులు చెబుతున్నారు. 11.70 వేల హెక్లార్లలో అరటి, 4.80 వేల హెక్టార్లలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
జల దిగ్బంధంలో లంక గ్రామాలు
వశిష్టగోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండడంతో ఆచంట మండలంలో లంక గ్రామాలైన అనగారలంక, అయోధ్యలంక, కోడేరులంక, మర్రిమూల, పుచ్చల్లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు కోడేరు, భీమలాపురం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏటిగట్టు దిగువన ఉన్న కాపులపాలెంలోకి వరదనీరు చేరింది. దాదాపు 70 కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెండు పడవలను అందుబాటులో ఉంచారు. లంక వాసులకు మంచినీటి ప్యాకెట్లు, చిన్నారులకు పాలు, రొట్టెలు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఎత్తై ప్రదేశాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. వరదనీరు ప్రవేశించడంతో లంకగ్రామాల్లో కూరగాయ పంటలు వేసిన రైతులు భయపడుతున్నారు. పంటలు 24గంటలపాటు వరద నీటిలోనే ఉంటే కుళ్లిపోతాయి. ఆచంట మండలం పెదమల్లంలోని ప్రసిద్ధ మాచేనమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. లంకగ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం ముంపులోనే ఉంది. కొవ్వూరు మండలం మద్దూరులంక వాసులకు పునరావాసం కల్పించారు. పంటలు నీట మునగడంతో ఇక్కడి లంక రైతులకు అపార నష్టం వాటిల్లింది. పెరవలి మండలంలోని లంకలు పూర్తిగా వరద నీటిలోనే ఉన్నాయి. అరటి, బొప్పాయి, కంద పంటలను కాపాడుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీలోని 26 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలి చిపోయాయి. గిరిజనులు జ్వరాల బారినపడుతున్నారు. వారిని అతికష్టంపై పడవల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నరసాపురం ప్రాంతంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల ద్వారా వరద నీరు పట్టణంలోకి చొచ్చుకొస్తోంది. దీంతో ఏటిగట్టు ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. మునిసిపల్ సిబ్బంది ఎప్పటికప్పడు మోటా ర్లు సహాయంతో నీటిని తోడిస్తున్నారు.
కొనసాగుతున్న వరద ఉధృతి
కొవ్వూరు : వరదనీరు పెరగడంతో మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం గరిష్టంగా 16.10 అడుగులకు చేరింది. సాయంత్రం 6 గంటల వరకు ఇదే మట్టం నిలకడగా కొనసాగింది. పౌర్ణమి రోజులు కావడంతో సముద్రంలో పోటు అధికంగా ఉంది. ఈ పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ధవళేశ్వరం ఆనకట్ట నుంచి డిశ్చార్జి చేసే మిగులు జలాల్లో క్రమేపీ పెరుగుదల కనిపించింది. సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి 16,44,339 క్యూసెక్కులు విడిచిపెట్టగా, సాయంత్రం 6 గంటలకు 16,51,433 క్యూసెక్కులకు పెరిగింది. భద్రాచలం వద్ద మధ్యాహ్నం 12 గంట లకు నీటిమట్టం 52.70 అడుగులకు తగ్గింది. దీంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 6 గంటలకు అక్కడ నీటిమట్టం 50.80 అడుగులకు తగ్గింది. అయితే భద్రాచలం దిగువన ప్రాంతాల్లో నీటిమట్టాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కూనవరంలో 20.23 మీటర్లు, కుంటలో 11.36, పోలవరం 14.14, కొవ్వూరు రోడ్ కం రైలు వంతెన వద్ద 17.69 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. గత ఏడాది ఆగస్టు 4వ తేదీన గోదావరి నీటిమట్టం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 19 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రకటించిన రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం అర్థరాత్రికి నీటిమట్టం స్వల్పంగా పెరిగి, ఆ తరువాత నుంచి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామని నీటిపారుదల శాఖ హెడ్ వర్క్స్ ఈఈ పీవీ తిరుపతిరావు తెలిపారు.
రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు
కొవ్వూరు మండలంలోని మద్దూరులంకలో 18 కుటుంబాలకు చెందిన 45 మందిని మద్దూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వాడపల్లి గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉంటున్న ఐదు కుటుంబాలకు చెందిన 15 మందికి స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆశ్రయం కల్పిస్తున్నారు.
ముంపులోనే గోష్పాద క్షేత్రం
గోష్పాద క్షేత్రంలో ఉన్న ఆలయాలన్నీ ముంపు బారినపడ్డాయి. గీతా మందిరంలో మూడు అడుగుల మేర నీరు చేరింది. క్షేత్రంలో సుమారు ఆరు అడుగులు మేర వరద నీరు ప్రవహిస్తోంది. బుధవారం సాయంత్రానికి ఆలయాలు ముంపునుంచి తేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.