ఎన్‌కౌంటర్ జరిగిందిలా...
శేషాచలం అడవుల్లోకి 150 మంది ఎర్రకూలీలు వచ్చినట్టు సోమవారం సాయంత్రం 7 గంటలకు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది.టాస్క్‌ఫోర్స్ డీఐజీ ఆదేశాల మేరకు 24 మందితో కూడిన సిబ్బంది బృందం ఆయుధాలతో శ్రీవారిమెట్టు నుంచి రాత్రి 8 గంటలకు కూంబింగ్ మొదలుపెట్టారు.
మంగళవారం ఉదయం 5 గంటలకు శ్రీవారిమెట్టు సమీపంలోని చీక టీగల కోన, సచ్చినోడు బండవద్ద 100 మంది ఎర్రకూలీలు టాస్క్‌ఫోర్స్ బృందాలకు ఎదురుపడ్డారు. ఆయుధాలతో ఉన్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని చూడగానే వారు రాళ్లు, గొడ్డళ్లతో దాడులకు దిగారు. పోలీసులు కాల్పులు జరిపారు.
ఉదయం 6 గంటల వరకు జరిగిన కాల్పుల అనంతరం 20 మంది కూలీల మృతదేహాలు పడి ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ డీఐజీ వెంటనే అర్బన్ ఎస్పీ, జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మిగిలిన కూలీలు కోసం ఉదయం 9 గంటల వరకు కూంబింగ్ కొనసాగింది. అప్పటి వరకు మీడియాను అనుమతించలేదు. కూంబింగ్ పూర్తయి, కూలీలు పరారయ్యారని నిర్ధారించుకున్న తర్వాత అనుమతించారు.
10 గంటలకు టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్, తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మెజిస్టీరియల్ విచారణ ఆఫీసర్‌గా నియమితులైన చిత్తూరు డీఆర్‌వో విజయచంద్ర ఘటనా స్థలం చేరుకుని మృతదేహాలకు పంచనామా నిర్వహించారు.మధ్యాహ్నం 2 గంటలకు రేంజ్ ఐజీ గోపాలకృష్ణ, డీఐజీ బాలకృష్ణ, అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి హెలికాప్టర్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఏరియల్ సర్వే చేశారు.సాయంత్రం 5 గంటలకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.