► ఆక్రమణలకు గురవుతున్న పోలీస్ శాఖ స్థలాలు
► వినుకొండ, మాచర్ల, రేపల్లెలో అన్యాక్రాంతం
► గుర్తించిన రూరల్ ఎస్పీ తొలిగించాలంటూ ఆదేశాలు
సార్.. దౌర్జన్యంగా నా ఇంటిని ఆక్రమించారు... నా భూమిని రియల్ మాఫియా కబ్జా చేసింది...న్యాయం చేయండి.. అంటూ నిత్యం బాధితులు పోలీసులను ఆశ్రయించడం చూస్తూనే ఉంటాం. ఇదంతా మామూలే అనుకుంటాం. కానీ.. పోలీసు శాఖకు చెందిన స్థలాలే ఆక్రమణకు గురవుతున్నాయంటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. స్వయానా పోలీసు ఉన్నతాధికారులే ఈ విషయాన్ని గుర్తించారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు తమ స్థలాలను ఎలా రక్షించుకుంటారో వేచి చూడాలి..
సాక్షి, గుంటూరు : జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ పాత భవనాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మించిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కోట్ల విలువచేసే స్థలాలు ఆక్రమణల చెరలోకి వెళ్లాయి. ముఖ్యం గా శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్‌లో సిబ్బంది ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఎవరూ లేరుకదా అని కొందరు వీటిని ఆక్రమించేశారు. అనేక ఏళ్లుగా ఈ ఆక్రమణలు కొనసాగుతున్నా అప్పటి పోలీసు అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. తర్వాత వచ్చిన పోలీసులు మనకెందుకే గొడవ.. అన్ని మిన్నకున్నారు. పోలీస్ స్థలాలు కబ్జాకు గురవుతున్నా కనీసం ఫిర్యాదు చేసేవారు లేకపోవడం, పోనీ మనశాఖ స్థలాలే కదా సుమోటోగా కేసులు నమోదు చేద్దాం అనే ఆలోచన ఏ ఒక్క పోలీస్ అధికారికీ రాకపోవడం శోచనీయం.
ఎస్పీ పర్యటనతో వెలుగులోకి..
గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ జిల్లాలో పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు ఇటీవల విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో మాచర్ల, కారంపూడి, వినుకొండ, రేపల్లెతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో పోలీస్‌శాఖ స్థలాలు ఆక్రమణలో ఉన్నట్లు ఆయన గుర్తించినట్లు తెలిసింది. దీంతో అక్కడి ఆక్రమణదారులను ఖాళీ చేయించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలని అక్కడి పోలీస్ అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం.
ఆక్రమణలకు గురైన స్థలాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సేకరించినట్లు తెలిసింది. స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను బయటకుతీసి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆక్రమణల్లో ఉన్న పోలీస్ స్థలాలను వెనక్కు తీసుకుని సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించి తిరిగి వాటిని వినియోగంలోకి తేవాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఐదు పాత పోలీస్‌స్టేషన్ల స్థానంలో నూతన భవనాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. ఆక్రమణలను తొలగిస్తే స్థలం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఖాకీ జాగా.. అయినా పాగా!
Published Mon, May 18 2015 2:19 AM | Last Updated on Tue, Aug 21 2018 8:41 PM
Advertisement