రాణిఛత్రం షాపింగ్ రూమ్‌ల బహిరంగ వేలంలో కూర్చున్న జితేంద్రనాథ్ (వృత్తంలోని వ్యక్తి), అదే లైన్‌లో ఎస్‌ఐ పక్కన నిలబడిన ఈఓ శ్రీనివాసులు
హుండీలు మాయమవుతున్నాయి. దేవుడి పేరుతో వసూళ్లకు తెగబడుతున్నారు. దేవాలయ ఆదాయంలో చేతివాటం ప్రదర్శిస్తూ ఏకంగా దేవునికే శఠగోపం పెడుతున్నారు. తాజాగా ఫోర్జరీ సంతకంతో ఓ చిరుద్యోగి సంవత్సరాల తరబడి పాతుకుపోయి పెత్తనం చెలాయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ‘గుమస్తా’గిరికి రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి గాంచిన జంబుకేశ్వరస్వామి దేవాలయం వేదికగా నిలిచింది. జితేంద్రనాథ్ అనే వ్యక్తి ఏకంగా ట్రస్ట్ చైర్మన్ టి.నీలకంఠప్ప సంతకాన్ని ఫోర్జరీ చేసి గుమస్తాగా చెలామణి అవుతూ.. ఈవోలను మించిన దర్పం ప్రదర్శిస్తుండటం దేవాలయ వర్గాలతో పాటు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం,రాయదుర్గం : గుంతకల్లు నియోజకవర్గం కసాపురం గ్రామానికి చెందిన జితేంద్రనాథ్ 1974లో జన్మించాడు. 1991–1993 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. తిరిగి 1995 మేలో ఇంటర్ పాసయ్యాడు. అదే సంవత్సరం 19 ఏళ్ల వయస్సుకే రాయదుర్గం ప్రాంతంతో సంబంధం లేకపోయినా జంబుకేశ్వరస్వామి ఆలయంలో గుమస్తాగా కుదురుకున్నాడు. అది కూడా ట్రస్ట్ చైర్మన్ నీలకంఠప్ప సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగం పొందినట్లు విమర్శలు ఉన్నాయి. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ నిజంగా గుమస్తాను నియమించినా.. అది కేవలం ఆ దేవాలయానికే పరిమితం అవుతుంది. అయితే జితేంద్రనాథ్ గ్రూపు దేవాలయాలకు అధికారిగా చెలామణి అవుతుండటం గమనార్హం. 2000 సంవత్సరంలో అప్పటి దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహరాజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, దేవదాయ శాఖ ద్వారా వేతనం పొందేందుకు సహాయం చేశారు. అయితే సర్వీసు రిజిష్టర్‌లో పేరు చేర్చకపోవడంతో ఇప్పటికీ ఆయన ఎస్‌ఆర్ ఉన్నతాధికారులకు చేరని పరిస్థితి ఉంది.
సమాచారహక్కు చట్టంతో వెలుగులోకి
జితేంద్రనాథ్ వ్యవహారశైలి నచ్చకపోవడతంతో బొమ్మనహాళ్‌కు చెందిన పయ్యావుల వెంకటరమణప్ప సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు కోరడంతో జితేంద్రనాథ్ బాగోతం బట్టబయలైంది. అప్పట్లో జంబుకేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న టి.నీలకంఠప్ప సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు రుజువైంది. దొంగదారిలో గుమస్తాగా చేరిన జితేంద్రనాథ్‌పై చర్యలు తీసుకోవాలని పయ్యావుల వెంకటరమణప్ప దేవదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కర్నూలు డిప్యూటీ కమిషనర్ 2017లో రహస్యంగా విచారణ చేసి వెళ్లినట్లు తెలిసింది. అయితే జితేంద్రనాథ్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వెంకటరమణప్ప హైకోర్టులో అప్పీలు చేశారు.
సర్వీస్ రిజిష్టర్ కోసం తంటాలు
ఎంతో మంది కార్యనిర్వహణాధికారులు బదిలీపై వచ్చి వెళ్లినా.. ఈయన వాలకాన్ని గమనించి ఉన్నతాధికారులకు ఎస్‌ఆర్ పంపకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. పంపితే ఏమవుతుందోనని భయపడి, తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని ఎవరికి వారు మౌనం వహిస్తూ వచ్చారు. జితేంద్రనాథ్ బదిలీపై ఇక్కడకు వచ్చిన ప్రతి ఈఓను ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేకపోతోంది. ఇతడి కారణంగానే ఇద్దరు ఈఓలు సస్పెన్షన్‌కు గురైనట్లు తెలిసింది.
భార్యకు విడాకుల కేసులో జైలుశిక్ష
మొదటి భార్యకు విడాకుల కేసులో జితేంద్రనాథ్ మూడు నెలల పాటు జైలుశిక్ష అనుభవించినట్లు దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో సెలవు కూడా పెట్టలేదంటున్నారు. జైలుకెళ్లడం, ట్రస్ట్ చైర్మన్ సంతకం ఫోర్జరీ చేయడంతో 2015కు ముందున్న ఈఓ నరసింహరాజు ఉన్నతాధికారులకు జితేంద్రనాథ్ ఎస్‌ఆర్ పంపలేదు. ఈయనపై ఉన్న కేసులు, ఫోర్జరీ సంతకం విషయాలను ప్రస్తావించి, ఆ కారణాలతోనే ఎస్‌ఆర్ నమోదు చేయలేదని ఉన్నతాధికారులకు తెలిపినట్లు విశ్రాంత ఈఓ నరసింహరాజు చెబుతున్నారు.
ఎస్‌ఆర్ పంపలేదు
రాయదుర్గం గ్రూపు దేవాలయాల గుమస్తాగా ఉన్న జితేంద్రనాథ్‌కు ఎస్‌ఆర్ లేదు. కేవలం ఆయన ట్రస్ట్ చైర్మన్ నియమించిన గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదికూడా సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు కొంతమంది కోర్టులో కేసు వేశారు. గతంలో ఉన్న ఈఓలు ఎస్‌ఆర్ పంపించాల్సి ఉంది. కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. తదుపరి నిర్ణయాలు కోర్టు తీర్పును బట్టి ఉంటాయి.
– కె.శ్రీనివాసులు, ఈఓ, రాయదుర్గం
ఫోర్జరీ చేయలేదు
నేను 1993లో ఇంటర్ ఫెయిల్ అయ్యాను. 1995 మేలో పాసయ్యాను. అదే సంవ త్సరం నవంబర్‌లో జంబుకేశ్వర స్వామి ఆలయ గుమాస్తాగా నియమింపబడ్డాను. ట్రస్ట్ చైర్మన్ సంతకం ఫోర్జరీ చేయలేదు. మొదటి భార్య విడాకుల కేసులో బెయిల్ పొందాను. జైలుశిక్ష అనుభవించలేదు.– జితేంద్రనాథ్, గుమస్తా,గ్రూపు దేవాలయాలు, రాయదుర్గం
Comments
Please login to add a commentAdd a comment