
గ్లోబల్ వార్మింగ్ ఛాలెంజ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వంద ఎకరాల్లో ఎనర్జీ స్టోరేజి పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎనర్జీ స్టోరేజీకి రాష్ట్రంలో అన్ని అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఉండవల్లిలోనీ గ్రీవెన్స్ హాలులో సోమవారం హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజి డివైజ్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడంపైనే యువత దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు.
కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి ఖరీదైందని, అలాంటిది ఇప్పుడు చౌకధరకు ఇస్తున్నామని చెప్పారు. నిన్నటిదాకా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధ్యం కాదన్నారని, ఇప్పుడు పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఎనర్జీ స్టోరేజి కోసం అందరూ ఎదురు చూస్తున్నారని, చివరికి అది కూడా సాధ్యమైందని తెలిపారు. 2020 నాటికి దేశంలో 15 వేల మెగావాట్ల హై ఎనర్జీ స్టోరేజి డివైజ్ మార్కెట్‌కు అవకాశం ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, టెలికం, విపత్తు నిర్వహణ తదితర రంగాల్లో ఎనర్జీ స్టోరేజికి అత్యధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అంతరం తొలగించేందుకు నాలుగేళ్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఉపాధి కల్పించే చదువుకే పెద్దపీట వేయాలన్నారు. ఈ సందర్భంగా భారత్ ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీని చంద్రబాబు అభినందించారు.
నేనూ అవయవదానం చేస్తా..
అవయవదానానికి తాను ముందుకు వస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అవయవదానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో అవయవదానం ఒక షరతుగా పెట్టే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో అవయవదాతలు ఇచ్చిన అంగీకార పత్రాలను పట్టణ పేదరిక నిర్ములన సంస్థ(మెప్మా), ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్ దాన్ సంస్థకు అందించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని లక్షా 20 వేల మంది అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాల దానం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. 1.20 లక్షల మంది అవయవదానానికి ముందుకురావడాన్ని ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్టు ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన్ దాన్ ఫౌండేషన్ చైర్మన్ కృష్ణమూర్తి, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.వి.రావు, మెప్మా మిషన్ డైరెక్టర్ పి.చినతాతయ్య పాల్గొన్నారు.
తిరుపతిలో హోలీటెక్ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం
తిరుపతిలో షియోమీ మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ నెలకొల్పేందుకు దానికి సంబంధించిన హోలీటెక్ కంపెనీ, ఏపీ ప్రభుత్వాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో పనులు ప్రారంభించాలని, జనవరిలో ఉత్పత్తి ప్రారంభించాలని హోలీటెక్ ప్రతినిధులను కోరారు. సమావేశంలో మంత్రి నారా లోకేశ్, హోలీటెక్ సీఈఓ ఫ్లేమ్ చంద్, షియోమీ వైస్ ప్రెసిడెంట్ మనోజైన్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఐటీ ముఖ్య కార్యదర్శి విజయానంద్ తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment