అధికార పార్టీ నేతల.. ఇంజినీ‘రింగ..రింగా’..!
ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదనను హైజాక్ చేసే యత్నం
తమ పరిధిలో ఏర్పాటు చేయాలని అంబేద్కర్ వర్సిటీ విజ్ఞప్తి
అందుబాటులో 21వ శతాబ్ది గురుకుల భవనాలు
రూసా నిధుల మంజూరుకూ అవకాశం
ఇవన్నీ కాదని టెక్కలి ప్రాంతంలో ప్రైవేట్‌రంగంలో ఏర్పాటుకు ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలన్న ప్రతిపాదన విషయంలో అధికార పార్టీ నేతల వైఖరి రెండు విధాలా నష్టం కలిగించేలా ఉంది. ఇంజినీరింగ్ కళాశాలను టెక్కలి ప్రాంతంలో ఏర్పాటు చేయించాలని కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనివల్ల ప్రభుత్వరంగంలో ఏర్పాటు కావాల్సిన కళాశాల ప్రైవేటురంగానికి మరలిపోతుంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్ష అభియాన్(రూసా) నిధులు మంజూరు కావు. అదే విధంగా ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సమీపంలో నిరుపయోగంగా ఉన్న 21 శతాబ్ది గురుకుల భవనాలు వినియోగంలోకి రాకుండాపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కొన్నాళ్లుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దాన్ని వర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని అంబేద్కర్ వర్సిటీ అధికారులు ప్రభుత్వాన్ని ఇప్పటికే రాతపూర్వకంగా కోరారు. మరోవైపు జేఎన్‌టీయూ కూడా ఇంజినీరింగ్ కళాశాల నిర్వహణకు ముందుకొచ్చింది. ఈ రెండింటిలో ఏ ప్రతిపాదన ఆమోదం పొందినా ప్రభుత్వపరంగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటవుతుంది. ప్రస్తుతం వృథాగా ఉన్న 21 శతాబ్ది గురకుల భవనాల్లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది అంబేద్కర్ వర్సిటీ అధికారుల ఆలోచన.
అందుబాటులో గురుకుల భవనాలు
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు 21 శతాబ్ది గురుకులాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీ పక్క నే 50 ఎకరాల స్థలంలో 8 బ్లాకులతో గురుకులానికి భవనాలు నిర్మించారు. అయితే గురుకులాలు ప్రారం భం కాకపోవడంతో మొదట్లో ఈ భవనాలను యూని వర్సిటీకి అప్పగించారు. కొన్నాళ్లు వాటిని వర్సిటీయే నిర్వహించేది. ఆ తర్వాత వీటిలో రాజీవ్ యువకిరణాలు పథకం కింద నిరుద్యోగులకు ఉపాధి శిక్షణలు నిర్వహించడం ప్రారంభించారు. అప్పటినుంచి క్రమం గా ఈ భవనాలు వర్సిటీ పరిధి నుంచి జిల్లా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 2013 తర్వాత శిక్షణలు కూడా నిలిచిపోవడంతో భవనాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదన వచ్చింది. గురుకుల భవనాలను తమకు అప్పగిస్తే తమ ఆధీనంలోనే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, దీని వల్ల వసతి సమస్య తీరడంతోపాటు గురుకుల భవనాలు వినియోగంలోకి వస్తాయని, ఇంజినీరింగ్ కళాశాల వల్ల ఏడాదికి ఎలా లేదన్నా రూ.30 లక్షల వస్తుం దని.. అది వర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని బీఆర్‌ఏయూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
నేతల వ్యూహాలు
అయితే స్వార్థంతో ఆలోచిస్తున్న అధికార పార్టీ నేతలు ఈ ప్రయోజనాలన్నింటికీ గండికొట్టేలా పలాస-టెక్కలి మధ్య ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇందుకోసం భూ సేకరణకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ సంస్థలకు కళాశాల మంజూరు చేస్తే ‘రూసా’ నిధులు మం జూరయ్యే అవకాశం ఉండదు. పైగా విద్యార్థులకు ప్రభుత్వపరంగా అందే రాయితీలు ఇతర సౌకర్యాలు అందకుండాపోతాయి. ప్రైవేట్ కళాశాలలో ఫీజుల భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ వర్సీటీకే ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలన్న డిమాండ్ విద్యార్థివర్గాల నుంచి పెరుగుతోంది.
యూనివర్సిటీ పరిధిలోనే ఉండాలి
గత చైర్మన్ కె.సి.రెడ్డి హయాంలో గురుకుల నిర్వహణ యూనివర్సిటీ పరిధిలోనే ఉండేది. తర్వాత ప్రభుత్వానికి అప్పగించారు. వర్సిటీ అనుబంధంగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే దానికి గురుకుల భవనాలు ఉపయోగపడతాయి. దానివల్ల ఏడాదికి ఎలా లేదన్నా రూ.30 లక్షల ఆదాయం వస్తుంది. వర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ఇంజినీరింగ్ కళాశాల ఉండాలన్నదే మా ప్రతిపాదన. ప్రభుత్వానికి కూడా నివేదించాం. కళాశాల మంజూరు విషయంలో నేతలు చొరవ చూపాలి. -హెచ్.లజపతిరాయ్, ఉప కులపతి, బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ