పాత పద్ధతిలోనే ప్రవేశాలు | Engineering management seats to be filled in old method | Sakshi
Sakshi News home page

పాత పద్ధతిలోనే ప్రవేశాలు

Published Wed, Mar 19 2014 1:42 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

పాత పద్ధతిలోనే ప్రవేశాలు - Sakshi

పాత పద్ధతిలోనే ప్రవేశాలు

 ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీపై ప్రవేశాల కమిటీ నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో ప్రవేశాలను పాత విధానంలోనే చే పట్టాలని ఇంజనీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. తొలుత జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అప్పటికీ మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు మిగిలిపోతే చివరగా ఇంటర్మీడియెట్ మార్కులతో ప్రవేశాలు చేపడతారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు భర్తీ విధానాన్ని ఖరారు చేశారు. మేనేజ్‌మెంట్ కోటా భర్తీ విధివిధానాలను మేనేజ్‌మెంట్లకు తెలియజేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున, ఈనెల 28న కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సతీష్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్, ఏఎఫ్‌ఆర్‌సీ నుంచి బాలసుబ్రహ్మణ్యం, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
 ఇదీ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ విధానం...
 
  గతేడాది అనుసరించిన విధంగా 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు
 
  మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాలో భర్తీ చేస్తారు. గతంలో ఎన్‌ఆర్‌ఐ కోటా 5 శాతమే ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు దానిని 15 శాతానికి పెంచుతున్నారు. అయితే ఇందులో కేవలం ఎన్‌ఆర్‌ఐ కోటానే కాకుండా ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా పేరును చేర్చాలని, తద్వారా స్పాన్సర్డ్ కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. అయితే విమర్శలు వస్తాయనే ఆలోచనతో ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటాకు కమిటీ నిరాకరించింది.
 - ఈసారి 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాలో నేరుగా ఎన్‌ఆర్‌ఐ పిల్లలనే చేర్చుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సీట్లు మిగిలిపోతే అవి మేనేజ్‌మెంట్ కోటాలోకి వెళతాయి.
 - మిగిలిన 15 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం అంటూ ఏమీ ఉండదు. అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.
 - మొత్తం మేనేజ్‌మెంట్ కోటాను ఇంటర్ మార్కులతోనే భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలన్న యాజమాన్యాల డిమాండ్లకు ఉన్నత స్థాయి కమిటీ మొదట్లో తలొగ్గి, ఆ అంశంపై చర్చించింది. అయితే దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement