సాక్షి, కర్నూలు:
విభజన ప్రక్రియపై సమైక్యగళం హోరెత్తుతోంది. ఉద్యమకారుల నిరసనలు.. ఆందోళనలతో జిల్లా అట్టుడుకుతోంది. శుక్రవారం కర్నూలులో విద్యార్థులు కదంతొక్కగా.. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లీనిక్‌లు ఒక్క రోజు బంద్ పాటించాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సేవలు యథావిధిగా కొనసాగినా.. వైద్యులు మాత్రం బంద్‌కు సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆదోనిలో ఉద్యోగులు, విద్యార్థులు, కళాకారులు కోలాటాలు ఆడుతూ నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమైక్యాంధ్ర బనియన్లు ధరించి, జాతీయ పతాకాన్ని చేతబూని పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. భీమాస్ సర్కిల్‌లో దాదాపు గంట పాటు కళాకారులు చేసిన ప్రసంగాలు, పాడిన ఉద్యమ గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆళ్లగడ్డలో రైతులు ర్యాలీ చేపట్టి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు.
ఆలూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నాయకుల పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. వీరికి వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు మద్దతు పలికాయి. డోన్‌లో ఆర్టీసీ, ఎన్జీవో, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను బంద్ చేయించారు. ప్యాపిలి, వెల్దుర్తి మండల కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా 39వ రోజున 16 మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు దీక్షలో కూర్చొన్నారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్‌జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు రెండో రోజు మూతపడ్డాయి. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా డిపో ఎదుట కార్మికులు కొద్ది మంది కండెక్టర్లతో టికెట్లు తీసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్‌కార్డుల నమోదు కార్యక్రమాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు.
ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థుల మహాగర్జన
Published Sat, Sep 21 2013 2:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement
Advertisement