ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన ఎంసెట్ ఎంపీసీ కేటగిరీ అభ్యర్థుల జాబితా మంగళవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్టు ఎంసెట్ అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. సీటు కేటాయింపు వివరాలను అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియపరుస్తామన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబరు, పాస్‌వర్డ్, పుట్టినతేదీ వివరాలను ఉపయోగించి సీటు కేటాయింపు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు బోధన రుసుం చెల్లించాల్సిన కేటగిరీలో ఉంటే బ్యాంకు చలానా ఫారం కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సీటు కేటాయింపు పత్రంలో పేర్కొన్న బోధన రుసుమును ఇండియన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులోగానీ చెల్లించి రశీదు పొందాలని చెప్పారు. సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 23లోగా కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో మొత్తం 2,076 మంది హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న సహాయక కేంద్రాలకు అదనంగా ఈ నెల 17 నుంచి 21 వరకు ఏలూరులోని సెయింట్ థెరిసా అటానమస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.
ఐసెట్ రిజిస్ట్రేషన్లు 57,019
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు ఇప్పటి వరకూ మొత్తం 57,019 మంది హాజరవగా.. సోమవారం 21,107 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్నట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి తెలిపారు.
‘బీ-కేటగిరీ’పై అక్టోబర్ 7న సమావేశం
ఇంజనీరింగ్‌లో బీ-కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీలో ఎదురవుతున్న బహుళ ప్రవేశాల ప్రతిబందకంపై చర్చించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో అక్టోబర్ 7న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు తెలిపారు. బీ-కేటగిరీ సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు.. అతనికి కళాశాలలు అన్నింటిలో సీటు లభించినప్పుడు ఆయా సీట్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు యాజమాన్యాలతో చర్చించి పరిష్కారం కనుక్కోవాలని ఉన్నత విద్యా మండలిని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భేటీ అయిన యాజమాన్యాలు తామంతా ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని, మరోసారి సమావేశానికి సమయం ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని కోరాయి.
నేడు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జాబితా
Published Tue, Sep 17 2013 1:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement