సాక్షి ప్రతినిధి, కడప: స్వార్థ చింతన విడనాడి, ప్రజలు, ప్రాంతం యోగక్షేమాలే పరమావధిగా నాటి తరం నేతలు త్యాగాలకు ఒడిగట్టారు. ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజించారు. అలాంటి వారి వారసులుగా చెప్పుకుంటున్న నేటితరం నేతలు అడుగడుగునా స్వలాభాపేక్షే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. అందుకు గెజిటెడ్ అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ముందు వరసలో నిలుస్తున్నారు.అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మత్యాగం చేయడంతోనే ఆంధ్రప్రదేశ్‌కు తొలిమెట్టు పడింది. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు ఆయన. అందుకే తరాలు మారినా తెలుగుజాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. అటువంటి మహనీయుల వారసులైన తెలుగువారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యమించారు. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, జీతాల కంటే జీవితమే ముఖ్యమని సమ్మెలోకి వెళ్లారు. ప్రజల కోసం ప్రాంతం కోసం వారు ఆరాటపడుతున్న తీరుకు అన్ని పక్షాల నుంచి మద్దతు లభించింది.
అందులో భాగంగా గెజిటెడ్ అఫీసర్లు సెప్టెంబర్ 20 నుంచి సమ్మెబాట పట్టారు. అటెండర్ నుంచి అడిషనల్ జాయింట్ కలెక్టర్ వరకూ, వర్క్ ఇన్‌స్పెక్టర్ నుంచి సూపరింటెండెంటు ఇంజనీరు వరకూ సమ్మెలోకి వెళ్లారు. జీతాలు వదులుకొని సమ్మె చేస్తున్నారని ప్రజలు వీరికి పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. అయితే సుదీర్ఘకాలం సమ్మెచేసిన ఉద్యోగులు సమస్య కొలిక్కి రాకమునుపే ఉద్యమజెండాను పక్కనబెట్టేశారు.
ప్రజాప్రతినిధులతో పోటీ పడుతున్న ఇంజినీర్లు రాష్ట్ర విభజన ప్రకటన వెలువడగానే రాయలసీమ, కోస్తాంధ్రలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వారికి సంఘీభావంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఊరికో మాట, పూటకో స్టేట్‌మెంట్ ఇస్తూ వచ్చారు.
అధిష్టానం ఆదేశాలు శిరసావహిస్తామంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పదే పదే పేర్కొన్నారు. తత్ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంది. ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఎవ్వరికి వారు పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే తప్పా వారి ప్రోటోకాల్ ఎవ్వరూ వదులుకోలేదు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఇటీవల తరచూ పర్యటన చేస్తూ అభివృద్ధి పనుల్లో మామూళ్ల కోసం అధికారులను వేధిస్తున్నట్లు సమాచారం. మరో ఎమ్మెల్యే అసైన్‌మెంటు కమిటీ సమావేశం నిర్వహించాలని, త్వరగా ప్రభుత్వ భూములు తన అనుచరులకు అప్పనంగా కట్టబెట్టాలని తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది.
ఇవన్నీ కూడా ఇంజినీరింగ్ అధికారులు గమనించినట్లు ఉన్నారు. సెప్టెంబర్ 20నుంచి అక్టోబర్18వరకూ సమ్మెలో ఉన్నారు. ప్రత్యక్షంగా ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ వారు సమ్మె చేయలేదంటూ జీతాలు పొందేందుకు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఈ కోవలో ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయాలకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు. సమ్మె చేసిన కాలంలో ఇంజినీర్లు విధుల్లో ఉన్నారని డ్రాయింగ్ ఆఫీసర్లతో తప్పుడు రికార్డులు సృష్టించి జీతాలు పొందుతుండటం గమనార్హం.
నాలుగో తరగతి ఉద్యోగులే నయం
గెజిటెడ్ హోదా ఉన్న ఇంజినీర్ల కంటే నాలుగో తరగతి ఉద్యోగులే చిత్తశుద్ధితో సమైక్యరాష్ట్రం కోసం పోరాటం చేశారని పలువురు సమైక్యవాదులు పేర్కొంటున్నారు. నెలవారి జీతాలతోనే సంసారాలు నెట్టుకొచ్చే క్రింది స్థాయి ఉద్యోగులు ఉద్యమస్ఫూర్తికి భంగం కల్గకుండా వ్యవహరించారు. చాటుమాటుగా జీతాలు పొందేందుకు అడ్డదారులు ఎంచుకోవడం లేదని పలువురు అభినందిస్తున్నారు.
జిల్లా వ్యావ్తంగా సుమారు 26వేల మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. అందులో అసిస్టెంట్ ఇంజనీర్ల నుంచి ఎస్‌ఈ స్థాయి వరకూ ప్రభుత్వ ఉత్తర్వులు 1013జీఓ ప్రకారం జీతాలు ఇవ్వాలంటూ పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీర్లు సమ్మెలోకి వెళ్లినా డ్రాయింగ్ ఆఫీసర్లు గుడ్డిగా సమర్థించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇంజినీర్లూ..ఇదేం పని
Published Fri, Nov 1 2013 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
Advertisement
Advertisement